Friday, August 23, 2013
దీక్షలు స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలను పొందండి.
దీక్ష అనగానే మనకు గుర్తుకు వచ్చేది అయ్యప్ప స్వామి దీక్ష. ఇది చాలా ప్రాచుర్యం పొందింది. తరువాత భవానీ దీక్ష కూడా చాలా మందికి పరిచయం. ప్రతీ ఒక్క భక్తుడూ ఏదో ఒకసందర్భంలో దీక్ష తీసుకోవాలని అనుకుంటాడు. దీక్షలు చాలా మంది పడుతూ ఉంటారు. కానీ దీక్షా ఫలాన్ని ఏకొందరో మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. ఇది ఎందువల్ల?
నెలరోజులు ఉద్యోగం చేసి జీతం తీసుకోకుండా మానేయగలరా? ఈ నెల రోజులూ జీతం ఇవ్వం, ఉచితంగా మీ సేవలు అందించండి అంటే ఎంత బాధగా ఉంటుంది మనకు. ఎందుకంటే అది మన జీవన ఉపాధి కనుక. మనమీద కుటుంబ బాధ్యతలు ఉంటాయి కనుక. తనకు మాలిన ధర్మం పనికిరాదు. అందుకే కంపెనీ ఎంత లాసులో ఉన్నా కనీసం సగం జీతమైనా పొందే వరకూ పోరాడతాం. అలాగే ఈ దీక్షను రోజుల తరబడి చేస్తాము. మరి ఫలితం పొందకుండా ఎలా? పొందితీరాలి. అటువంటి దీక్ష ఎలా స్వీకరించాలి? ఏమి నియమాలు పాఠించాలి? అసలు ఏదీక్ష ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది?
మీరు అయ్యప్ప దీక్ష విని ఉంటారు. దుర్గా దీక్ష విని ఉంటారు. శివ దీక్ష విని ఉంటారు. హనుమత్ దీక్షలు తెలుసు. బ్రహ్మచర్య దీక్ష గురించి కొందరు విని ఉంటారు. విద్యా దీక్ష ఎప్పుడైనా విన్నారా? ఉద్యోగ దీక్ష తెలుసా? మరి మౌన దీక్ష? ఇలా అనేక రకాల దీక్షలు ఉన్నాయి. వీటిలో కొన్ని మనకు తెలిసి, కావాలనుకుని స్వీకరిస్తాం. మరికొన్ని ఇది దీక్ష అని తెలియకుండానే స్వీకరిస్తాం.
ఉదాహరణకు : బ్రహ్మచర్య దీక్ష. ఉపనయనము అయినప్పటి [ పిల్లవాడిని స్కూలులో చేర్చిన దగ్గర ]నుండీ, స్నాతక మహోత్సవం [ డిగ్రీనో, పీజీనో పూర్తి చేసి పట్టా పుచ్చుకునే ] వరకూ మనం బ్రహ్మచర్య దీక్ష అంటాము. ఇది తెలిసినా తెలియక పోయినా మనం దీక్షను పాటిస్తున్నట్టే.
అలాగే మనం ఒక్కో సారి ఓ నెలరోజులలో ఈ ఇంగ్లీషు గ్రామరు పై పట్టు సాధించాలి అని అనుకుని గంటల తరబడి సాధన చేసి ఇంగ్లీషుపై పట్టు సాధిస్తాం. అది కూడా దీక్షే! విద్యా దీక్ష అనవచ్చు.
ఇక ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించేవి దైవ దీక్షలు. ఏదో ఒక దైవం మీద నమ్మకంతో ౪౦ రోజులు దీక్షపూని, కొన్ని నియమాలు పెట్టుకుంటాం. వీటివలన ఆధ్యాత్మిక ఉన్నతి తద్వారా విద్యా ఉద్యోగ ఉన్నతులు కూడా కలగుతాయి. ఇంకా అనేక కోరికలు తీరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అవసరంలేదు.
అటువంటి ఉన్నతి మనకు కలగాలంటే ఎలా?
మనం ఎంతో ఎదిగాము అనుకుంటాం. చాలా నాగరికులం అనుకుంటాము. కానీ ఒక్కోసారి సంతలో గొర్రెలలా ప్రవర్తిస్తాం. పక్కింటి వాళ్ల అబ్బాయి ఇంజనీరుంగు చేస్తున్నాడని మన వాడూ ఇంజనీరైపోవాలి అని పెద్దలు, మన స్నేహితులు అందరూ ఇంజనీరింగే కనుక మనమూ ఇంజనీరై పోవాలి అని పిల్లలు. ఎంసెట్ లో ఎంత రాంకు వచ్చినా ఫర్వాలేదు. ఏదో మారుమూల కాలేజీ లోనైనా ఫర్వాలేదు. మొదట ఓ గొప్ప బ్రాంచ్ అనుకుంటాం. మన రాంక్ చూసి ఇది చాలు లే అనుకుంటాం. తీరా కౌన్సిలింగ్ లో అది కూడా రాదని తెలిసి వాడు ఏదిస్తే దానికి ( మొక్కలకు పందిరెయ్యడం నేర్పే కోర్స్ ఒకటి పెట్టి, దానికి ‘పందిరి బ్రాంచ్’ అని పేరు పెట్టి అందులో సీట్లున్నాయి అంటే దానికి కూడా ) సిద్ధమే మనం. ఏ బ్రాంచ్ అయితే నేముంది. నాలుగుసార్లు తప్పినా ఫర్వాలేదు. చివరికి ఇంజనీరింగ్ అయింది అనిపించుకుంటే చాలు. తరువాత మళ్లీ ఏ కంప్యూటర్ కోర్సో చేసి ఎలాగోలా బి.పి.ఓ. జాబ్ సంపదించకపోతామా... ఇదే మన ఆలోచన, కాదు కాదు ధోరణి అనాలేమో.? ఎందుకంటే అసలు ఆలోచన అనేది ఉంటేగా..? చుట్టూ నలుగురూ చేస్తున్నారు. బాగా సంపాదించొచ్చు. నలుగురితో పాటు నరాయణా!
ఏమి చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో తెలియకుండా చదువుతాం. అదీ ఒక చదువేనా..?
అంటే ఇంజనీరింగ్ ఎందుకూ పనికి రాని చదువని కాదు నా ఉద్దేశం. అది చాలా గొప్పది. అసలు నిరర్ధకమైన విద్య అనేది లేదు. మనం చదివే తీరే అలా ఉంది. ఇంజనీరింగ్ రాయాలంటే ఎవరో అన్నట్టు గట్స్ కావాలి. నేను ఫలానా కాలేజీలో, ఫలానా బ్రాంచ్ లో మాత్రమే చేరతాను. అని నిర్ణయించుకుని దానికి తగిన కృషి చేసి అక్కడే సీట్ సంపాదించి చదవాలంటే చాలా తెగువ, పట్టుదల ఉండాలి. అలా ఉన్ననాడు మీరు చదివింది చదువు అని నలుగురి ముందూ ఒప్పుకోవచ్చు. అలా లేని నాడు అది చదువే కాదు. అలా భ్రమ పడుతున్నారంతే!
సరిగ్గా దీక్షలు స్వీకరించే విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. అయ్యప్ప స్వామి దీక్ష చాలామంది స్వీకరించి ఉంటారు. కానీ ఎంతమంది నియమాలు సరిగ్గా పాటించారు? ఇక్కడా మనం గొర్రెల్లా మరొకరిని అనుసరిస్తున్నామే తప్ప కాస్త ఆలోచించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తింటాం. తిరుగుతాం. కొందరు ధూమపానం కూడా చేస్తారు. మరి తాగే వారు నాకు ఇంకా కనపడలేదు భగవంతుడి దయవలన. తోటి స్వామి పడి పూజ వెయ్యిమందిని పిలిచి చేస్తే , మనం రెండువేలమందిని పిలుస్తాము. రేపటి నుండి దీక్ష కనుక ఈ రోజు ఫుల్లుగా పట్టించేసి రేపు ఆ మందు దిగకుండానే మాలను ధరించాలి. (ఇది నా స్నేహితులైన స్వాములకు స్వీయ అనుభవం. తోటి స్వాములు కొందరు అలా ఉండే వారుట.) సాయంత్రం అల్పాహారం పేరుతో అరవై రకాలు ఆరగించాలి. చుట్టూ ఉన్న స్వాములు అలా చేస్తే మనమూ అలా ఎందుకు చేయాలి? కాస్తైనా ఆలోచన ఉండదా? "మాలధారణం నియమాల తోరణం" అంటూ రోజూ పాడుకుంటాం కానీ, నియమాలు పాటించడం అబ్బో అన్ని నియమాలు పాటించడం కొంచెం కష్టమే. అందుకే మన వీలును బట్టి కుదిరినవి పాటిస్తాం. ఇంకెందుకండీ దీక్ష? దీనివలన వచ్చే పుణ్యమేమో కానీ, పాపం మూట కట్టుకుంటున్నాం. నలుగురికోసం కాదు మనకోసం మనం దీక్షపూనుతున్నాం. నేను ఇన్ని సార్లు దీక్ష స్వీకరించాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు. అన్ని సార్లు స్వీకరించడం వలన నా జీవితంలో వచ్చిన మార్పేమైనా ఉందా అని ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఏదైనా లోపం ఉందంటే అది దీక్షలో కాదు పాటించే మనలో ఉంది అని గుర్తించండి. మనలో అహం కారాన్ని పెంచే దీక్షలు వేలసార్లు పూనినా ఏమిటి లాభం? జీవితాన్ని తరింప చేయగల దీక్ష జన్మానికి ఒక్క సారి స్వీకరించినా చాలు.
నేడు మనం స్వీకరిస్తున్న భగవత్ దీక్షల నియమాలు బ్రహ్మచర్య దీక్షనుండి స్వీకరించినవి అయి ఉండవచ్చు. ఉపనయనమయిన బ్రహ్మచారి ఎటువంటి నియమాలు పాఠించాలో మన పెద్దలు చెప్పారు. దాదాపు అటువంటి నియమాలే నేడు స్వామి దీక్షలకూ విధించుకున్నాము.
దీక్ష - నియమాలు
౧.సూర్యోదయాత్ పూర్వం లేవాలి.
౨.సూర్యోదయానికల్లా పూజను ప్రారంభించాలి.
౩.రోజుకు కనీసం ౧౦౦౦ సార్లు నామాన్ని స్మరించాలి. ఏ పని చేస్తున్నా మన నాలుకపై భగవన్నామం ఆడుతూ ఉండాలి.
౪.వార్తా పత్రికలు, టీవీ, ఇంటర్ నెట్ వంటివి ముట్టుకో కూడదు. ఉద్యోగ విషయమై అవసరమైతే తప్ప.
౫.ధూమ పానం, మద్య పానం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.
౬.శాఖాహరం ,సాత్వికాహారం తీసుకోవాలి.
౭.కోపం పూర్తిగా వీడాలి. వివేకం పని చేయాలి.
౮.సత్యం మాట్లాడడం చాలా అవసరం.
౯. ఈ దీక్ష మానసిక, వాచిక, కాయికములను మూడింటి ద్వారా జరగాలి.
౧౦.మూడు కాలాలూ భగవంతుని ఉపాసన చేయాలి. ఉద్యోగస్తులు కనీసం ౨ కాలాలు(ఉదయం,సాయంత్రం) అయినా పూజించాలి.
౧౧.నోటితో అసభ్య పదాలు పలకూడదు.
౧౨.చేతితో చెడు చేయకూడదు.
౧౩.మనసుతో చెడు ఆలోచనలు చేయకూడదు. ఇది చాలా కష్టమైనది. కానీ అమ్మమీద భారం వేసి మొదలు పెడితే అంతా శుభం జరుగుతుంది.
౧౪. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పాదరక్షలు ఉండకూడదు.ఎల్లప్పుడూ విబూధి ధరించి, ఎర్రని తిలకాన్ని ధరించాలి. ఉదయం పూజానంతరం గంధాన్ని ధరించాలి. తెల్లని స్ఫటిక పూసలు దీక్షా మాలగా ధరించాలి. శిఖను ధరించాలి. మొలత్రాడు తప్పక ఉండాలి. పూజా సమయంలో పంచె, కండువాలు మాత్రమే ధరించాలి. చేతికి దీక్షా కంకణమును రక్షగా కట్టుకోవాలి.
౧౫. నేలమీద శయనించాలి. నేలమీద కూర్చుని భుజించాలి. నీటిని కూడా కూర్చుని స్వీకరించాలి. ఏక భుక్తము చేయాలి. భోజనము కొరకు కాక, శక్తి కొరకు మాత్రమే అన్నట్లు భుజించాలి.
౧౬. భగవంతుని చిత్రపటమును, కలశమును పెట్టి ఈ దీక్షాసమయంలో పూజించాలి. పూజా ప్రదేశము నిత్యము శుభ్రముగా ఉంచాలి. దీపం వెలుగుతూ ఉండాలి. భజనలు వంటివి జరుపుట శ్రేష్ఠము. నిత్యము ధ్యానము కనీసం ౧౫ నిమిషాలు చేయాలి. ఏపని చేస్తున్నా ఆంతరింగిక పరిశీలన చేయాలి. లోపలి వ్యక్తిని గమనించాలి.
౧౭. మనం మన జీవితంలో ఎటువంటి పురొగతి కోరుకుంటున్నామో, ఆ పనిని ఈ నలభై రొజులలో సాధన చేయడం మొదలు పెట్టాలి. మన ఆశయ సాధనకు మొదటి అడుగును వేయాలి. తరువాతి అడుగులు భగవత్కృపచే వాటంతట అవే పడతాయి.
౧౮. పూజ, ధ్యానం, ఉద్యోగం, లక్ష్య సాధన వీటితో ప్రధానంగా నిండినదై మన దిన చర్య ఉండాలి. మిగిలిన వ్యసనాలు సమయాన్ని పాడు చేయకుండా ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవడం, ప్రవచనాలు వినడం వంటివి చేయాలి. రోజంతా భగవత్ చింతనలో గడపాలి.
మీరు స్వీకరించే దీక్ష ఎటువంటి దైనా నియమాలు లేకుండా ఫలించదు. సరదాగా ఆడే క్రికెట్ ఆడాలంటే కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. బ్యాట్ విసురుతాను నువ్వు బాలుతో తన్నాలి అంటే కుదరదు. బ్యాటుతో బాలుని మాత్రమే తన్నాలి. మరి అలాంటిది మన జీవితానికి ఎన్ని నియమాలు ఉండాలి? నియమాలు లేని జీవితం అందగా ఉండదు. అర్థరహితంగా ఉంటుంది. ఆ నియమాల విలువను తెలిపేందుకే ఇటువంటి దీక్షలు అవసరమౌతాయి.
ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు|
బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ||
ఇన్ద్రియాణి హయనాహు ర్విషయాస్తేషు గోచరాన్| - కఠోపనిషత్తు.
ఆత్మ రథికుడు, శరీరం రథం. బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం. ఇంద్రియాలు గుర్రాలు, అవి నడిచే దారులు విషయ వస్తువులు.
నేర్పరి అయిన సారథి అనేక వైపులకు పరుగులు తీసే గుర్రాలను కళ్లెంతో అదుపు చేసి, ఒకే గమ్యం దిశగా పయనింప చేస్తాడు. అలాగే బుద్ధి శాలి అయిన వాడు అనేక విషయ వాసనలతో పరి పరి విధాల ఆకర్షింప బడు ఇంద్రియాలను, మనసు అనే కళ్లెంతో అదిలించి, అంతర్ముఖం చేసి, ఒకే దారికి మళ్లించి గమ్యాన్ని చేరుకుంటాడు. అంటే మనకు మనమే కొన్ని నియమాలను విధించుకుని మంచి మార్గం వైపుకు ఇంద్రియాలను మళ్లించుకున్న నాడు మన గమ్యాన్ని చేరగలుగుతాము.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?
బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు "భూసురుడు" అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.
ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము.
ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను.
౧. స్నానము
౨.సంధ్యోపాసనము
౩.జపాదికము
౪.ఔపాసనము
౫. పంచాయతన దేవతార్చనము
౬.బ్రహ్మయఙ్ఞము
౭. వైశ్వదేవము
౮. పంచాయతనమునకు పునః పూజ
౯. అతిథిపూజ( భోజనము)
౧౦.భోజనము
౧౧.సత్సంగము
౧౨. సాయం సంధ్యావందనము
౧౩. సాయమౌపాసనము
౧౪. రాత్రి వైశ్వదేవము
౧౫. రాత్రి దేవతార్చనము
ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజనము, దానము-ప్రతిగ్రహణము,నైమిత్తికములు,శాంతులు, నిత్య లౌకిక కృత్యములు మొదలైనవి నిత్యము చేయాలి.
అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా
దానంప్రతిగ్రహణం చైవ బ్రాహ్మణానామకల్పతె
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
మాంసాహారం తినడం అధర్మమా?
మాంసాహారం తినడం అధర్మమా?
నేడు శాకాహారులు మాంసాహారులు అవుతున్నారు. మాంసాహారులు అనారోగ్యం పేరుతో శాకాహారులవుతున్నారు.
శాకా
హారులుగానే ఉందామనుకునే నిర్ణయమున్న వారికి బయటకెళ్లి తినటం అనేది
జటిలంగా మరుతోంది. ఎక్కడ చూసినా మాంసాహార శాలలే కనిపిస్తున్నాయి. కాలేజీ
ర్యాగింగులలో శాకాహారి అనేవాడు కనబడితే వాడు మాంసం ముట్టేదాకా వెధిస్తారు. (
ఈ స్థితి ఎప్పుడో దాటి పోయింది. ఇప్పుడు మందు, సిగరెట్, అమ్మాయిలు ఈ
విషయాలలో సీనియర్స్ జూనియర్స్ కి వద్దుమొర్రో అన్నా నెర్పిస్తున్నారు. )
మనసులో శాకాహరిగా ఉందామని ఉన్నా చుట్టూ ఉన్న అనేక పరిస్థుతుల వల్లో, చుట్టూ
ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది మాంసాహారులే ఉండడం వల్లో, జిహ్వ చాపల్యం
వల్లో, ప్రలోభం వల్లో నేడు శాకాహారులందరూ మాంసాహారులవుతున్నారు. గుడ్డు
మాంసాహారం కాదని దానిని శాకాహారంలో కలిపెసిన వారూ ఉన్నారు.
ఇటువంటి
సందర్భంలో శాకాహారిగా జీవించడం ప్రశ్నార్థకమవుతున్నది.అసలు ఇంత కష్ట పడి
శకాహారిగా జీవించడం అవసరమా? అసలెందుకు శాకా హారిగా జీవించాలి? మాంసాహారం
తింటే ఏమిటి నష్టం? ఇలా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
అలాగే
మాంసాహారులు కూడా శాకాహారుల ప్రభావంతో ఆలోచనలో పడుతున్నారు. మాంసాహారులుగా
ఉండడం మంచిదా? శాకాహారులుగా ఉండడం మంచిదా? అనే ప్రశ్నలు ఏదో ఒక సందర్భంలో
రాకమానవు. మాంసాహారం మానలేక శాకాహారానికి రాలేక తాముచేసేది తప్పు అనే
ఉద్దేశంలో సతమత మయ్యే వారూ ఉండవచ్చు.
ఇటువంటి పరిస్థితులలో
శాకాహారులకు, మాంసాహారులకు అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏది మంచి, ఏది
చెడు అని. ఇదే విషయం నేనాలోచిస్తే ఏది ధర్మం, ఏది అధర్మం అని ఆలోచిస్తాను.
రెండిటికీ తేడా ఏమిటీ? అనుకోకండి. చాలా తేడా ఉంది. మొదటి రకంగా సమాధానం
దొరకని ఎన్నో ప్రశ్నలకు ఈ ధర్మాధర్మ విచక్షణ ద్వారా చాలా సులభంగా
దొరుకుతుంది.
నాకో సందేహం ఈ శాకాహరం అనేది మనమే పాటిస్తున్నామా?
మొదటి నుడీ శాకాహారాన్నే నియమంగా పెట్టుకుని ఉన్న శాఖలు/తెగలు ఇతర దేశాలలో
ఏమైనా ఉన్నాయా?
ఇక మన విషయానికి వస్తే ఆహారం కోసం ఒక దానిపై మరికటి
ఆధార పడడం ప్రకృతి ధర్మం. ఆహారం కోసం చెట్లపై ఆధారపడడం ఎంత సహజమో,
జంతువులపై ఆధారపడడమూ అంతే సహజం. పూర్వ కాలంలో అందరూ మాంసాహారం తినేవారని
పూరాణేతిహాసాల వలన తెలుస్తోంది. వశిష్టుడు మొదలైన వారికి శ్రాద్ధాది
క్రతువులలో మధువు, మాంసాహారం ( మేక మాంసం ) పెట్టేవారు. సోమయాగంలో( ఆ
సోమయాగం చేసినవారిని మత్రమే సోమయజి అనే వారు. ఇప్పుడు అందరూ అపేరు
పెట్టుకుంటున్నారు. ) ఆ విధంగా చూస్తే మాంసాహారం తినడం అధర్మమేమీ కాదు.
అయితే మాంసాహరం తినవచ్చా? అంటే తినవచ్చు. మరి కొందరు ఎందుకు నిషద్ధం చేశారు?
ఇదే
అందరూ ఆలొచించ వలసిన విషయం. మాంసాహారాన్ని ఎందుకు తినకూడదు అని
ప్రశ్నించుకుంటే ఆ మాంసాహారాన్ని తినడం వలన రజో గుణం ఎక్కువ అవుతుంది. (
ఇదే కారణంతో కలియుగంలో బాహ్మలు, గురువులు మధుమాంసాలు తినరాదని
శుక్రాచార్యుడు శపించాడు. ) శాకాహారం సాత్విక లక్షణాలు పెరుగుతాయి. ఈ
రజోగుణం మనల్ని తప్పుదారిలో నడిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత చేటు.
సాత్విక గుణం మనల్ని ధర్మాధర్మ విచక్షణ చేసే స్థితిలో ఉంచి ఙ్ఞానం వైపు
నడిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.
అంటే మాంసం తినేవారికి
ఈ సాత్విక గుణం లేదనా? ఎందుకు ఉండదు? తప్పక ఉంటుంది. కానీ దాని పాళ్ల (
levels ) లో తేడా ఉంటుంది. అలాగే శాకాహారం తినే వారిలో పూర్తిగా సాత్విక
గుణాలు ఉంటాయనుకోవడం కూడా అపోహే అవుతుంది. ఎందుకంటే వారు రజోగుణానికి ఇతర
కారకాలైన మద్యము, గుట్కా, జరదా, గంజాయి, ఉల్లిపాయలు ఇంకా అనేకమైనవి
సేవిస్తూ ఉండవచ్చు. కనుక ఈ రజోగుణం ఎక్కువగా కలగకుండా ఉండటం కోసం మాత్రమే
ఇటువంటివి మానేయవలసిన అవసరం ఉంది.
బ్రాహ్మలు ఇదివరకు విద్యకు
పరిమితమై గురువులుగా ఉండే వారు. నలుగురికీ ఙ్ఞాన మార్గం బోధించ వలెను కనుక
వారికి ఇటువంటివి నిషేధించడమైనది. అందువలన వారు ఎక్కువ సాత్విక ప్రవృత్తి (
positive attitude ) కలిగి ఉండి ఙ్ఞానాన్వేషకులై జీవించేవారు. ఇప్పటికీ
సాత్వికాహారం తినేవారు చాలా మంచి గుణాలు కలిగి ఉండడం మీరు గమనించ వచ్చు.
ఇది నా దృష్టి కోణం మాత్రమే. ఇంకా చాలా విషయాలు వ్యాఖ్యల రూపంలో వస్తాయి. అవన్నీ చదివి ఏది సమంజసమో మీరే నిర్ణయించుకోండి.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
ఆత్మలతో మాట్లాడవచ్చు
ఆత్మలతో మాట్లాడవచ్చు.!
కొన్ని కంటితో చూసి నోటితో చదివినంత మాత్రాన అర్థం కావు. మనసుతో అనుభవించి చూడవలసినదే వాటి లోతు. కొన్ని సాధారణ విషయాలలోనే అసాధారణమైన రహస్యాలు దాగుంటాయి.
నాకు చిన్నప్పటి నుండీ ఓ విచిత్రమైన కోరిక ఉంది. గాలిలో ఎగరాలని. " రావణ బ్రహ్మ రోజూ తెల్లవారుతూనే ఆకాశమార్గాన వెళ్లి కోటి శివలింగాలకు అర్చన చేసి వచ్చే వాడని " ఓసారి ఎవరో నాకు చెప్పారు. అప్పటి నుండీ అనుకుంటా గాలిలో ఎగరాలని బలమైన కోరిక. ఎంత బలమైనది అంటే నిజంగా ఈ దేహంతో ఎగరడం సాధ్యం కాదు కనుక కనీసం కలలో నైనా ఎగరాలని నా సంకల్పమో ఏమో.. సరిగా గుర్తులేదు కానీ నాకు వచ్చే కలలో చాలా వరకూ నేను ఎగురుతున్న ఎరుక నాకు తెలిసేది. ఓ సారి అర్జునుడు పాశుపతాన్ని పొందే సందర్భంలో శివుడితో యుద్ధం చేసే కథను విన్నాను. కొన్నాళ్లకు నాకు ఓ కల వచ్చింది. ఎదురుగా ఎవరో ధనుర్బాణాలతో ఉన్నారు. నేను అవే ఆయుధాలతో ఉన్నాను. ఇద్దరం గాలిలో నేలకు మూడు మీటర్ల ఎత్తులో ఉండి పెద్ధ యుద్ధం చేసుకున్నాం. అద్భుతమైన దివ్యాస్త్రాలు.
నాకోరికలు అలా కలలలో తీరుతున్నాయని అనుకునే వాడిని. ఒక్కటి మాత్రం నాకర్థమైంది. మనం బలంగా ఏవైనా కోరుకుంటే అవి కలలుగా వస్తాయని. అలా నాకొచ్చే విచిత్రమైన కలలు మిగిల్చిన అనుభవాలు ఎప్పుడు తలుచుకున్నా చాలా బలం వచ్చి నట్లు అనిపించేది. కలలు అందరికీ వస్తాయి కానీ చాలా మందికి గుర్తుండవు.
ఆ కలలు గుర్తుంచుకో గలిగితే అందరూ ఆత్మలతో మాట్లాడవచ్చు. ఆ కలలను గుర్తుంచుకోవడం ఎలాగ అని అడుగుతారేమో!? మీ సంకల్పమే మీకు దారి చూపుతుంది. రాత్రి పడుకునే ముందు నాకు వచ్చిన కలలను నేను గుర్తుంచుకోవాలి అని స్థిరంగా 4,5 సార్లు సంకల్పించుకుని పడుకోండి. క్రమ క్రమంగా మీ కలలు మెలకువ తరువాత కూడా గుర్తుకు వస్తుండడం మీరే గమనిస్తారు. అలా మీ సంకల్ప బలం, కోరిక, నమ్మకం వీటిని బట్టి మీకు గుర్తుండే శాతం ఉంటుంది.
ఇంతకీ కలలను గుర్తుంచుంకుంటే ఆత్మలతో ఎలా మాట్లాడవచ్చూ..!? అని అనుకుంటున్నారా? అదిగో అక్కడికే వస్తున్నాను.
మీకెప్పుడైనా అద్భుతమైన,వింత ఐన కలలు వస్తాయా? మీకలలలో మీరు అద్భుత శక్తులు ప్రదర్శిస్తున్నట్టు, మీతో దేవతలు- చనిపోయిన వారు - యోగులు మాట్లాడినట్లు, మీరు గాలిలో ఎగిరినట్లు, కొత్త కొత్త ప్రదేశాలు చూసినట్టు, లేదా లోకాలన్నీ తిరిగినట్టు కనిపించిందా.!?
అయితే మీకు కలల ద్వారా ఏవో సందేశాలు వస్తున్నట్టు తెలుసుకోండి. అవును కలల ద్వారానే. కలల ద్వారా మీకు సాధ్యమవ్వని దంటూ ఏమీ లేదు. మీరు కలవలానుకున్న వారిని కలవ వచ్చు. ఎంత దూరంలో ఉన్నా, అసలు భూమిమీదే లేకున్నా,ఏడేడు పధ్నాలుగు లోకాలలో ఎక్కడ ఉన్నా. మీరు కలిసి వారితో పంచుకున్న అనుభవాలను నిద్రనుండి మేల్కొన్న తరువాత కూడా గుర్తుకు ఉంచుకోవచ్చు. కాక పోతే కొంత సాధన ద్వారా.
ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రముఖ రచయిత "శ్రీ శార్వరి" చెప్తున్న మాటలు ఇవి. ఈయన మాష్టర్ సి.వి.వి. ధ్యాన ప్రక్రియకు ఆకర్షితులై, తద్వారా ధ్యానం,యోగం,ఆత్మ యాత్రలు ( astral travel ) మొదలైన అనేక విషయాలగురించి అనేక భాషలలో పలువురు రాసిన రచనలను చదువుతూ,సాధన చేయడం మొదలు పెట్టారు. అలాగే వీటి గురించి తెలుగులో అనేక పుస్తకాలు రాశారు. వాటిలో నేను ఈ మధ్య అనుకోకుండా " పరావిద్య " అనే పుస్తకం కొనిచదివాను. నేను ఇంతకు పూర్వం వీరి రచనలు ఎప్పుడూ చదవలేదు. నాకు వారి గురించి పెద్దగా తెలియదు. కానీ పుస్తకం కొద్దిగా చదివితే ఏదో ఆసక్తిగా అనిపించి కొన్నాను. ఇంటికి వచ్చి తెరచి చదివితే నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. నా ఆసక్తికి సరిగ్గా తగిన పుస్తకం అనిపించింది. నాకు తెలిసిన కొన్ని విషయాలకు కొన్ని కొత్త పార్శ్వాలు కనిపించాయి. నా ఆధ్యాత్మిక సాధనకు కొన్ని కొత్త దారులు కూడా గోచరించాయి. పుస్తకం తెరచిన దగ్గరనుండీ పూర్తయ్యే వరకు ఆపకుండా దాదాపు ఏకబిగిన చదివాను.
మనకు కనిపించే శరీరం కాకుండా ఇంకా అనేక శరీరాలున్నాయి. ఈధర్ శరీరం, ఆస్ట్రల్ శరీరం, భావశరీరం,ప్రాణ శరీరం, ఆత్మ శరీరం ఇలా కంటికి కనిపించని అనేక శరీరాలు మనకున్నాయి. వాటిని కంటితో చూడడం కుదరదు. మనసుతోదర్శించాలి.
" కనిపించడం అన్నది కంటికి పరిమితం. కనిపించని దానిని దర్శించడం మనస్సు పరిధి లోనిది. అలా దర్శింప చేసే సామర్ధ్యం ఉన్నది ఆత్మకు మాత్రమే."
" ఇవ్వాళ మనం టన్నుల కొద్దీ విఙ్ఞానం,నాగరికత ఉందని సంబరపడి పోతున్నాంగానీ, ఇంతకు వేయిరెట్లు 'వివిఙ్ఞానం' ఆ (పూర్వం)రోజుల్లోనే ఉండేది. అది సంస్కారం. అప్పుడు మనవాళ్లు హాయిగా పరలోకాలకు విహార యాత్రలకు వెళుతూ వస్తూ ఉండేవారు. దేవతలతో, యక్షులతో, కిన్నెరలతో, కింపురుషులతో, గంధర్వులతో చెలిమి చేసేవారు. "
" ఈజిప్టు, రోమ్ దేశాల నాగరికతల్ని అధ్యయనం చేస్తే అక్కడి చారిత్రక అవశేషాల్ని గమనిస్తే చాలా రహస్యాలు తెలుస్తాయి. ఈజిప్టులోని పిరమిడ్లు,ప్పింక్ రహస్యాలు ఇప్పటికీ తెలియడం లేదు. వారి ఖగోళ విఙ్ఞానం, ఆత్మల అవగాహన నేటికీ ఊహాతీతంగానే ఉంది. భూమి కొలతలు, భూమికి ఇతర గ్రహాలకు మధ్యదూరాలు ఎలా కొలవగలిగారు. ఎవరూ భౌతిక శరీరాలతో వెళ్లి టేపులు పెట్టి కొలిచి ఉండరు కదా! వారికి లింకులు తెలుసు. మానవ మేధస్సును విశ్వ మేధస్సుతో లింక్ చేయడం వారికి తెలుసు. భౌతిక శరీరాన్ని ఇక్కడ భద్రపరచి, అశరీరులుగా విశ్వసంచారం చేయడం వారికి తెలుసు."
" ఏదేశ చరిత్ర పుటలు వెనక్కి తిప్పినా, ఏజాతి చరిత్రలోకి తొంగిచూసినా ఆకాలం వారికి 'అశరీర పరిఙ్ఞానం' పూర్తిగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మన పౌరాణిక కధలు, ఇతిహాసాలు, లోతుగా పరిశీలించండి. ఎన్ని అద్భుతాలు బయటపడతాయో గమనించవచ్చు. రాజులు,ఋషులు యధేచ్ఛగా అలా అలా స్వర్గానికి హనీమూన్ ట్రిప్స్ వేస్తుండే వారు. అక్కడిదేవకన్యలతో, అప్సరసలతో సరదాగా షికార్లు చేసి, సరదాలు తీర్చుకునేవారు. అలా విమానాల్లో ఆకాశమార్గాన హిమాలయాల పైకి వెళ్లేవారు. నదులు,సముద్రాలు అలవోకగా దాటి వెళ్లే వారు. ఇంద్రసభకు వెళ్లడం,నందనాల్లో విహరించడం, త్రిమూర్తుల్ని కలవడం, ముక్కోటి దేవతలతో ముచ్చట్లాడడం,ముచ్చటతీర్చుకోవడం బొత్తిగా కష్టం కాదని తెలుస్తుంది. " అంటారు మాష్టర్ శ్రీశార్వరి.
అయితే ఈపుస్తకం చదవక మునుపు కూడా నాకు ఇవన్నీ ఉన్నాయని, ఇంకా నేటికీ అనేకులు ఈ సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేస్తున్నారనీ తెలుసు. కానీ అది సామాన్యులకు అందుబాటులో లేదనే అభిప్రాయం ఉండేది. ఎంతో యోగ సాధన చేస్తే గానీ ఈ సూక్ష్మశరీర ప్రయాణం అనేది అనుభవంలోకి రాదని అనిపించేది. రోజూ ఉద్యోగాలు చేసుకునే వారికీ, సంసార బంధంలో ఉన్న వారికీ కొంత కష్ట తరమైన సాధన అనుకునేవాడిని. కానీ ఇది చదివిన తరువాత నా అభిప్రాయం పూర్తిగా తప్పని తేలింది. మనసుంటే మార్గముంటుందని మరోసారి ఋజువైంది. మాష్టర్ శ్రీశార్వరి గారు ఎంతో కష్ట తరమైన అనుభవాన్ని చాలా తేలికగా తన రచన ద్వారా మనకు అందించారు. ఈ పుస్తకం చదివిన ఎవరికైనా ఇది ఇంత సులువైన సాధనా అనిపిస్తుంది.
వారు చెప్పిన సాధన ఏమిటంటే రోజూ ప్రశాంతంగా నిద్ర పోవడమె.. చక్కటి కలలు కనడమే.. ఆ కలలను గుర్తుంచుకుని జాగ్రత్తగా ఓ పుస్తకంలో రాసుకుని భద్రపరచుకోవడమే... ఇంతే మీరు చేయవలసింది. దీని వలన మీరు పొందేది ఏమిటో తెలుసా..!? మీరు ఎవరిని కావాలనుకుంటే వారిని కలవగలరు. భవిష్యత్తులో జరిగే వాటిని తెలుసుకో గలరు. ఎంత దూరమైనా సూక్ష్మశరీరంతో సునాయాసంగా ప్రయాణించగలరు.
రోజూ రాత్రిపూట కలలు వస్తాయి కదా. కలలకు తలా తోకా లేదు అనుకుంటాం మనం. అప్పటిదాకా చెట్టుక్రింద ఉన్న మనం ఉన్నట్టుండి ఏ ఇంట్లోనో టీవీ చూస్తున్నట్టు, ఓ కోతిగానో, దేముడిగానో, రాక్షసుడిగానో మారినట్టు అర్థం పర్థం లేని కలలు వస్తున్నాయి అని అందరూ అనుకోవడం సహజం. కానీ వీటికి అర్థం ఉంది అని మరోసారి నిరూపిస్తుంది "పరావిద్య" పుస్తకం.
" మనకు మంచి కలలు వస్తే అవి ఇంకాఇంకా సాగాలని కోరుకుంటాం. అయ్యో అనవసరంగా మెలకువ వచ్చిందే ఇంకొంత సేపు మెలకువ రాకుండా ఉంటే బాగుండేది అనుకుంటాం. అలాగే చెడు కలవస్తే భయంతో ఒణికి పోతాం. కానీ రెండూ మనకు సంకేతాలే. అవి చెరుపు చెయ్యవు. ఓ దెయ్యమో,ఆత్మో మిమ్మల్ని వెంటాడినట్టో, ఓ గొప్ప సౌందర్యవతి కనిపించి కవ్వింనట్టో వస్తే అవి రెండూ మీ మనసులోని కోపతాపాలను, వ్యామోహాన్నీ తెలుపుతున్నట్టు గుర్తు. ఏ స్త్రీ వ్యామోహమూ మీకు లేదనుకోండీ.. ఏ అప్సరసా మీ కలల్లోకి రాదు, అలాగే మీ మనసులో కోపతాపాలు, ఏ మలినమూ లేకపోతే రాక్షసులు రారు. మనలో దాగిన వికృత భావాలకూ, అణచుకున్న ఉద్రేకాలకూ ఆ కలలు రూపాంతరాలు. మన గుణాలకు రూప కల్పనలే స్వప్నంలో కనిపిస్తాయి. ఏ కలా ఊరికే రాదు. వాటికో అర్థం ఉంటుంది. ఓ కారణం ఉంటుంది. ఓ సంకేతం ఉంటుంది. అందించ వలసిన సందేశం ఉంటుంది. ఎటువంటి కలలైనా సరే అవి మనకు చెడుపు చేయవు. ఇలలో మనకు సహాయపడేవే అయి ఉంటాయి. మన వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి కావచ్చు, ప్రపంచ విషయాలు కావచ్చు, రాజకీయ ప్రయోజనాలకు సంబంధించినవి కావచ్చు, కేవలం ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు. స్వప్నాలను విశ్లేషించడం ఒక కళ. కలలే గొప్ప పరిశోధనలకు ఆలంబనాలు. మహాజటిలమైన సమస్యలకు పరిష్కారాలు కలల్లోనే లభించాయి. మహర్షులు కలల ద్వారానే గొప్ప సత్యాలను ఆవిష్కరించారు. ఈ స్వప్న సందేశాలను ఆధారం చేసుకుని కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ఒక్కో కల మీజీవితాన్నే మార్చేయ గలదు. ప్రఙ్ఞతో అశరీర సంచారం చేయగల యోగి విశ్వరహస్యాలు సత్యాలు ఆవిష్కరిస్తాడు. "
ఎంత చెప్పినా ఇది తరిగేది కాదు కానీ, నేను అసలు ఏమి చేయాలో చెప్తాను. అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది. రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు ఓ ఐదునిమిషాలు మనసును ప్రశాంత పరచాలి. ముందుగా గురువులను ప్రార్థించాలి. మన చుట్టూ మనకంటికి కనిపించని గురువుల ఆత్మలు ఎన్నో ఉంటాయి. మన సూక్ష్మ శరీర ప్రయాణంలో వారి సహాయాన్ని అర్థించాలి. మనసులో మీరు చూడాలనుకున్న ప్రదేశమో, కలవాలనుకున్న వ్యక్తినో సంకల్పించుకోవాలి. ( ఫలానా ప్రదేశానికి నేను వెళ్లాలి. అక్కడ నాకు ఎదురైన అనుభూతులను పదిలంగా భద్రపరచుకోవాలి. మెలకువ తరువాతకూడా అవి నాకు గుర్తుండాలి. ఇలా మనసులో గట్టి విశ్వాసంతో సంకల్పించు కోవాలి. ) మీకు ఈ ప్రక్రియమీద ఉన్న నమ్మకాన్ని బట్టి మీకు కలిగే అనుభూతుల లోతు ఉంటుంది. మొదట్లో కొన్ని రోజులు కలల గుర్తుండక పోయినా త్వరలోనే అవి స్ఫురణకు రావడం, వాటి తాలూకా అనుభవాలు నిజ జీవితంలో ఎదురవడం మీరు చూచాయగా గమనించడం మొదలు పెడతారు.
అలా సంకల్పించుకుని మూసుకున్న కను గుడ్లను గుండ్రంగా త్రిప్పుతూ ఉండాలి. అందువలన త్వరగా నిద్ర వస్తుంది. మీ మనస్సును సూక్ష్మ శరీర ప్రయాణానికి సన్నద్ధం చేసుకోవాలి. మీరు క్రమంగా నిద్రలోకి జారుకుంటారు. మీరు నిద్ర పోయారు అంటే మీ సూక్ష్మ శరీరం మీ భౌతిక శరీరం నుండి విడి వడింది అని అర్థం. అలా భౌతిక శరీరం నుండి విడి వడినా భౌతిక శరీరానికీ - సూక్ష్మ శరీరానికీ ఒక దారం వంటి లింక్ ఉంటుంది. చనిపోయినప్పుడు ఆబంధం తెగిపోతుంది. నిద్రించి నప్పుడు ఎంత దూరం వెళ్లినా అది ఉంటుంది. కొందరు గొప్పగొప్ప వారికి ఆ దారం వంటి బంధం కలలలో దర్శించిన అనుభవాలు ఎదురయ్యాయి. అలా ప్రయాణానికి సిద్ధమైన సూక్ష్మ శరీరానికి ఒక స్నేహ హస్తం అందుతుంది. వారి మార్గదర్శకంలో మీరు కోరుకున్న చోటికి వెళ్తారు. వారే మీ ఆధ్యాత్మిక గురువులు.
కొన్ని సూచనలు : నేలమీద చాప వేసుకుని నిద్రించడం మంచిది. వెల్లకిలా శవాసనంలో పడుకోవాలి. నిద్రించే గదిలో ఎక్కువ వెలుతురు ఉండకూడదు. కొద్దిగా తగుమాత్రంగా వెలుతురు ఉండవచ్చు. గుండెల మీద చేతులు వేయకూడదు. అలా వేస్తే మన సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని వదిలి బయటకు వెళ్లడం కష్టం అవుతుంది. చేతులను కూడా వెల్లకిలా చాపి ఉంచాలి. శరీరం నుండి ఆత్మ విడివడడమేమిటి? మన ఆత్మ ప్రయాణం చేయడమేమిటి? అని కొందరికి వింత గొలపవచ్చు. మరికొందరికి కాస్త భయం కూడా వేయ వచ్చు. కానీ కంగారు పడనవసరం లేదు. ఈ విషయం మీకు తెలిసి నిద్రించినా, తెలియక నిద్రించినా ఆత్మ సూక్ష్మ శరీరంతో బయటకు రావడం అనేది ఖాయం. అలా ప్రయాణించినపుడు కలిగే అనుభవాలే కలలుగా మనకు కొంత గుర్తులో ఉంటాయి. వాటిని మరింత గుర్తుంచుకోవడానికీ, అలాగే మనకు అర్థం పర్థం లేకుండా వచ్చే కలలను ఒక క్రమ బద్ధంగా మన కోరిక ప్రకారం వచ్చేటట్లు మలచుకోవడానికీ మనమీ సాధన చేస్తున్నాము. అలాగే మనకు గురువులైన ఆత్మలు ఆ సూక్ష్మ లోకాలలో ఎదురు చూస్తూ ఉంటాయి. వారే స్వయంగా మనల్ని శిష్యులుగా ఎంచుకుంటారు. మన పుట్టుక తోనే ఆ ఎన్నిక అయిపోతుంది. కానీ ఆ విషయాలు మనకు తెలియవు. వారు అడుగడుగునా ఈ ప్రయాణంలో మనకు తోడ్పడుతూ ఉంటారు. కొన్ని సార్లు మీరు నిద్రలో మీకాలో చెయ్యో అసంకల్పితంగా అంతెత్తున లేపి దబ్బున క్రిందపడేస్తారు. ఉలిక్కి పడి, శరీరం ఎగిరి పడుతుంది. ఈ సాధన చేసే వారికైనా, చేయని వారికైనా ఇది సహజంగా అప్పుడప్పుడూ జరిగే విషయమే. అంటే మీ సూక్ష్మ శరీరం బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఏదో ఇబ్బంది రావడం వలన అలా జరుగుతోంది. మీరు సరిగ్గా వెల్లకిలా పడుకుంటే సరిపోతుంది. అలాగే ఒక్కో సారి మీరు నిద్రలో ఉండగానే మీ చెయ్యో కాలో కదపాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఎంత కదిపినా అవి కదలవు. అలా ఎందుకవుతుందంటే బయట తిరిగే ఆత్మలేవో మిమ్మల్ని అల్లరి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. కొన్ని ఆత్మలకు అలా చేయడం సరదా. అందుకు మీరు భయపడనవసరం లేదు. అవి అంతకన్నా ఏమీ చేయలేవు. మీకు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ (సూక్ష్మ శరీర ప్రయాణం) లో ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా మీ సూక్ష్మ శరీరం వెంటనే వచ్చి భౌతిక శరీరంలో చేరిపోతుంది. మీకు వెంటనే మెలకువ వస్తుంది. కనుక భయం అవసరంలేదు. ఎటువంటి భయాలు లేకుండా ఈ ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మాత్రమే మీ సాధన సక్రమంగా సాగుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీకు గురువులు ఎప్పుడూ అండగా ఉంటారు. అలాగే ఈ ప్రయాణంలో 99.99...% ఏటువంటి ఇబ్బందులూ ఎదురవ్వవు. ఇది సహజమైన ప్రక్రియే. కాకపోతే కాస్త ఎరుకతో చేయలనుకునే ప్రయత్నం. మీకు గల నమ్మకం, ఉత్సాహం ఈ ప్రయాణంలో అద్భుతాలను ఆవిష్కరిస్తాయి. మీరు మీ వంశీకులను, దేవతలను, మీ ఇష్టులను కలవవచ్చు - స్వర్గం, హిమాలయాలు, పవిత్ర ప్రదేశాలు, ఏడేడు పధ్నాలుగు లోకాలు, బ్రహ్మాండాలు వేటినైనా దర్శించ వచ్చు. ముఖ్యంగా ఎటువంటి వారికైనా చావు అంటే భయం పోతుంది. రోజూ వెళ్లి వచ్చే ప్రయాణమే, కాకపోతే కాస్త దీర్ఘ ప్రయాణం అన్న ధీమాతో ఉంటారు. మన కంటికి కనిపించేది కాక వేరే లోకాలు ఉన్నాయని, అవి ఈ లోకాల కంటే అందమైనవి, సుఖవంతమైనవి, అమిత ఆనందాన్నిచ్చేవి అని తెలియడం వల్ల - నసించేది నేను కాదు, నా శరీరం, ఇది లేక పోయినా నేను మరింత ఆనందంగా ఉండగలను అని అర్థమవ్వడం వల్ల సులభంగా మరణాన్ని సమ్మతించ గలుగుతారు.
నాకు చిన్నప్పటి నుండీ ఓ సందేహం ఉండేది. "యోగము ద్వారా చనిపోవాలి అనుకున్నప్పుడు చనిపోవడం అనేది అందరికీ సాధ్యమేనా? " అని. దానికి చిన్నప్పటి నుండీ యోగ సాధన బాగా చేస్తే అది సాధ్యమే అని తెలుసు. కానీ దానికి ఇంత సులువైన ప్రారంభముంటుందని మాత్రం ఈ పుస్తకం చదివిన తరువాత తెలిసింది. విద్వత్తు ఎవరి వద్దనైనా ఉంటుంది. దానిని నలుగురి మంచి కోసం వినియోగించగల ప్రఙ్ఞ కొందరికి మాత్రమే ఉంటుంది. అటువంటి ప్రఙ్ఞతో రాసిన పుస్తకం ఇది. ఆధ్యాత్మిక అభిలాషులు అందరూ చదవవలసినది. శ్రీ శార్వరి గారు నేటికీ మాష్టర్ గా అనేకులకి ఈ యోగ విద్యను నేర్పుతున్నారు. పూజాదికాలు అవసరం లేదని వీరి అభిమతం. మాష్టర్ సి.వి.వి. గారికి మరో అనుయాయులు ఎక్కిరాల క్రిష్ణమాచార్య గారు. వీరు సాంప్రదాయాలను, పూజాదికాలను ప్రోత్సహిస్తూనే తద్వారా యోగ జీవితానికి బాటను చూపారు. ఎవరి మార్గం వారిది అయినా చేరే గమ్యం ఒక్కటే.
నిద్రపోవడం ఎవరికి మాత్రం కష్టం చెప్పండి. అందుకే ఇది సులవైన ప్రారంభం అని చెప్పుకోవచ్చు. పైగా కలిగే ఫలితం అమేఘం, అద్భుతం. సూక్ష్మ శరీర ప్రయాణం ద్వారా అణిమాది అష్టసిద్ధులు, పరకాయ ప్రవేశం, కంటికి కనిపించని దివ్యలోక సందర్శనం మొదలైన వాటిగురించి తెలుస్తుంది. మనం సాధించవలసినది ఏమిటో ఎఱుకలోకి వస్తుంది. వీటితోనే ఆనందపడిపోయి ఇదే సర్వమనుకుని అక్కడే నిలచే వారూ ఉన్నారు. కలిగిన ఎఱుక ద్వారా మరింత ముందుకు వెళ్లవలసి ఉన్నదని గుర్తెరిగి మరింత సాధన చేసే వారున్నారు. ఇదే పరమావధి కాదు అని స్ఫురణలో ఉంచుకోవాలి మనం. సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలి ఆత్మ స్వయంగా ప్రకాశించ గలగడం మన లక్ష్యం. అది అందరికీ సాధ్యపడదు. సత్యలోక దర్శనం కోసం ఎంతో యోగ సాధన చేయాలి. మనం నిద్రపోయి ఏమీ తెలియని స్థితిలో దర్శించే ఈ లోకాలన్నీ ధ్యానముద్వారా ఎప్పుడనుకుంటే అప్పుడు అంతర్ముఖులమై శరీరాన్ని విడచి ప్రయాణించ గల శక్తిని సముపార్జించడానికి ఈ అనుభవం ఎంతో ప్రేరణనిస్తుంది.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
పూజ అంటే ఏమిటి? పూజను ఎందుకు చేయాలి?
పూజ అంటే ఏమిటి? పూజను ఎందుకు చేయాలి?

భగవంతుణ్ణి చేరుకోవడానికి పెద్దలు చెప్పిన అనేక మార్గాలలో `పూజా లేదా `అర్చనా అనేది ఒక మార్గం. మన ఇంటికి వచ్చిన పెద్దవారిని ఏవిధంగా గౌరవించి అథిధి సత్కారం (రండి బాబాయ్ గారు. ఇంత ఎండ వేళ వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా..! ఈ మజ్జిగ తీసుకోండి... ఇలా ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేయడం) చేస్తామో.., అలాగే మన ప్రార్ధన మన్నించి మనం పిలవగానే మన ఇంటికి వచ్చే భగవంతుడికి మనం చేసే సేవనే `పూజా అంటాము. ఈ పూజలో 16 రకాలైన సేవలతో భగవంతుడిని తృప్తిపరచి ఆయన ఆశీర్వాదాన్ని పొందుతాడు భక్తుడు. ఈ 16 రకాల సేవలనూ పూజావిధానం అనే టపాలో విపులంగా వివరిస్తాను.
అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, చీకటి నుండి వెలుగులోకి, దానవత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వం వైపు మన మనస్సును పురోగమింప చేయడానికి పూజను చేయాలి.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత సామాగ్రి

ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత సామాగ్రి జాబితాను jpg రూపంలో పొందుపరచాను. ఆ చిత్రం పై క్లిక్ చేస్తే పెద్ద చిత్రం కనిపిస్తుంది. లేదా save చేసుకొని చూడండి.
సత్యనారాయణ వ్రత విధానం: ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసుకుని, స్వామి వారిని మనసులో తలచి "ఓ దేవ దేవా! శ్రీ సత్యనారాయణమూర్తీ! నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను " అని సంకల్పించుకోవలెను. మధ్యాహ్మ సమయంలో పనులన్ని పూర్తి చేసుకుని సాయంకాలం రాత్రి ప్రారంభమవుతుండే సమయంలో ఈ వ్రతమును చేయవలెను. ( నేడు అందరూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉండలేక ఉదయాన్నే చేసుకొను చున్నారు. సాయంత్రం శ్రేష్ఠమైనది. ఇక చేయలేని సమయంలో ఉదయాన్నే చేయటం రెండవ పక్షం. ఏదైనా చేసిన కాసేపూ పూర్తి మనసుతో చేయడం మంచిది. )
శుచి అయిన ప్రదేశంలో గోమయముతో అలికి, అయిదు రంగుల చూర్ణములతో ( పొడులతో ) ముగ్గులు పెట్టి, అచట ఆసనము ( వ్రతం పీట )వేసి, దానిపై కొత్త వస్త్రము( తెల్ల టవల్ ) పరిచి, దానిమీద బియ్యము పోసి, దాని మధ్యలో కలశము ( మట్టి,రాగి, వెండి లేదా బంగారం ) ఉంచి, దానిపై మరల కొత్త వస్త్రమును ( జాకెట్ పీస్ ) ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమా రూపుడైన సత్యనారాయణ స్వామిని ఉంచవలెను. ( శక్తిమేర ఓ ప్రతిమను బంగారంతో చేయించి, పంచామృతములతో అభిషేకించి, దానిని కలశముమీద ఉంచ వలెను. )
ఆ మండపములో బ్రహ్మాది పంచలోక పాలుకులను, నవగ్రహములను,అష్ట దిక్పాలకులను ఆవహన చేసి పూజించ వలెను. తరువాత కలశములో స్వామివారిని ఆవాహన చేసి పూజించ వలెను. పూజానంతరము కథ విని ప్రసాదమును బ్రాహ్మలతోను, బంధువులతోనూ గూడి స్వీకరించ వలెను.
ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో గానీ, మాఘమాసమున గానీ, కార్తీక మాసమున గానీ శుభదినమున చేయవలెను. కలతలతో నున్నవారు చేయటం చాలా మంచిది. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేయవచ్చును. ఎవరి శక్తిని బట్టి వారు చేయ వచ్చును. ( కొత్తగా పెళ్లైన దంపతులకు నేను నెలకు ఒక సారి చొప్పున చేయించాను. వారు చాలా అన్యోన్యంగా,సంతోషంగా గడపడం నెను గమనించాను. కనీసం సంవత్సరానికి ఒక్క సారైనా ఈ వ్రతం చేయమని నా సలహా )
పూజ చేసిన నాడు ఏకభుక్తము ( ఒక పూట మాత్రమే భుజించుట ) చేయ వలెను. బ్రహ్మ చర్యము పాఠించ వలెను. మనసును, బుద్ధిని, కర్మలను మంచి వాటిపై నిలుప వలెను. (ఆ ఒక్క రోజు అయినా)సత్యమునే పలకవలెను. ఎంత శ్రద్ధతో, నిష్ఠతో చేస్తే అంత సత్ఫలితాన్నిస్తుంది.
చివరగా: మీరు భాగ్యనగరంలో ఉండి శ్రద్ధతో వ్రతం చేసుకోవాలనుకుంటుంటే ఒక్కసారి నన్ను పిలవండి. నేను తప్పక రాడానికి ప్రయత్నిస్తాను. చక్కగా వ్రతంచేసుకుందాం. మిగతా పూజలన్నిటికన్నా ఈ వ్రతం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో వ్రతం అనగానే ఖాళీ చేసుకుని మరీ వెళ్తుంటాను. :)
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
Subscribe to:
Posts (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్...
-
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు....

