Tuesday, October 9, 2018

పితృ దేవతా స్తుతి

శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.

నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః!!
నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!
నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!
తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!
నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!
శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!
నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!
నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!
కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!
నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!
స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!
సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!
సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!
తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!

పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!
తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!
పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!
యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!
పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!
తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!
సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!
సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!
తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!
యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!
యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!
యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!
కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!
కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!
తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!
దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!
యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!
పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|
తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!
తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!
తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!
యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!
రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!
ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!

అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!
ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!
రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!
సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!
విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!
భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!
కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!
కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!
సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!
పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!
ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!

మార్కండేయ ఉవాచ
ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః!
ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!
తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!
జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!

రుచిరువాచ
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!
ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!
మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!
నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!
ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!
నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!
స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!
సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!
అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!
అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!
యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!
తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!
నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!

మార్కండేయ వువాచ
ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!
నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!
నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!
తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!
ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!
నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!
స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!
తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!
ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!
శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!
పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!
స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!
అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!
యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!
సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!
తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!
శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!
(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు)

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

నర్మదా బాణలింగం

పురాణాల ప్రకారం నర్మద శివాంశసంభూతురాలని, చంద్రవంశ రాజుకు భార్య అయి నందున ‘సోమోద్భవ’ అని, నాగులకు గంధర్వుల బాధ తొలగించి నందున "నాగకన్య" అని కొన్ని పేర్లతో పిలవబడుతుంది. నాగులకు ఉపకారం చేసినందులకు నర్మద యందలి లభించు బాణ లింగాలకు అభిషేకం చేసిన జలాలు సేవించిన వారికి కాలసర్ప విష భయం ఉండదని నాగులు వరమిచ్చారు. ఈనర్మదా బాణలింగ అభిషేక జలం త్రిదోషహరం, వీర్యవృద్ధి కరం, ఆరోగ్యకరం, రుచికరమని ఆయుర్వేద గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. నర్మదా లింగాన్ని చూచినంత మాత్రముననే కాలసర్పదోషాలు, నాగదోషాలు, సమస్త పాపములు నశించునని పురాణములు ప్రకారం నాగదేవతలు వరం ప్రసాదిస్తున్నవి.

బాణలింగ పూజ వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆధునిక కాలంలో నిర్మిస్తున్న శివాలయాలలో చాలావరకు బాణలింగాలనే ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నారు. బాణ లింగాలు గుడ్డు ఆకారంలో ఎంతో నున్నగా వుంటాయి. ఎంత తేనే పోస్తే అంత ఎత్తుకునేంతగా బాణలింగాలు కనిపిస్తుంటాయి. ఏ విధమైన ఎగుడు దిగుడు లేకుండా ఒకే విధమైన కోణాలను కలిగి, ఆకర్షణీయంగా కనిపించడం బాణలింగం ప్రత్యేకత. ఇవి తెలుపు, నలుపు, నేరేడు పండు, తేనే, గచ్ఛ కాయ రంగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

బాణలింగాలు ఎక్కువగా నర్మదా నదీ ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా లభిస్తూ వుంటాయి. నర్మదా బాణ లింగ రూపంలో ఉన్న శివుణ్ణి ఇంద్రాది దేవతలు, రావణాది రాక్షసులు పూజించారు. నర్మదా నదీతీరంలో కూర్చుని పూర్వం బాణాసురుడు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగానే ఈ పర్వతంలో ఈ నదిలో నీవు నాకెప్పుడూ దర్శనం ఇవ్వాలని వరం కోరతాడు. బాణుడు కోర్కెను తీర్చడానికి భగవానుడు గుండ్రని లింగాకృతి గల రాళ్ళ రూపంలో మారిపోయాడు. అందుకే “నర్మదాకే శంకర్ సబ్ కే శంకర్” అనే సామెత వచ్చింది. బాణాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు ఇక్కడ లింగ రూపాల్లో లభిస్తూ ఉంటాడనీ, ఈ కారణంగానే వీటికి బాణలింగం అనే పేరువచ్చిందని అంటారు.

మట్టి, స్పటికం, బంగారం, వెండి తదితర శివలింగాలను పూజించడం వలన కలిగే పుణ్యఫలం, ఒక్క నర్మదా బాణ లింగాన్ని పూజించడం వలన లభిస్తుందని చెప్పబడుతోంది. నర్మదా బాణలింగాన్ని ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరతాయనీ, సుఖ సంతోషాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది. సాలగ్రామములు ఏ విధంగా పూజలు అందుకుంటున్నవో నర్మద యందలి శిలలు, త్రినేత్రముల, యజ్ఞోపవీతముల చిహ్నములతో నర్మదబాణములుగా ప్రసిద్ధి పొంది శిష్టుల పూజా పీఠములను శివ స్వరూపంతో అలంకరిస్తున్నాయి. "గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు" పై శ్లోకంలో ఉన్న ఏడు నదుల పేర్లు స్మరించుకోవాలని మన పెద్దలు చెబుతారు. బృహదీశ్వరాలయంలోని అతిపెద్ద బాణలింగం ఇక్కడ లభించిందే.

జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు నర్మదా తీరమందే సన్యాసదీక్ష తీసుకున్నారు. వారు రచించిన దివ్య స్తోత్రములలో 'నర్మదాష్టకం' ప్రసిద్ధమయినది. కార్త వీర్యార్జునుడు రాజధానిగా చేసుకొని నర్మదా నదీ ప్రాంతలను పరిపాలించినట్లు పురాణ గాథలు కలవు. నర్మదా బాణలింగాన్ని ప్రతి సోమవారం గాని, శివరాత్రి పర్వదినాలలో మరియు ప్రత్యేకమైన రోజులలో పూజా మందిరంలో ప్రతిష్టించటానికి ముందుగా నర్మదా బాణలింగాన్ని పవిత్ర నదీ జలాలతో గాని, పసుపు నీటితో గాని శుభ్రపరచి అమ్మవారి స్వరూపమైన పానపట్టం పైన ప్రతిష్ఠించాలి. ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, అభ్యంగన స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, తాంబూలం, నమస్కారం, ఉద్వాసన అనే షోడశోపచారాలతో లింగార్చన చేసిన వారికి కుజ దోషాలు, నాగదోషాలు, బంధన యోగం, పితృదోషం, కాలసర్పదోషాల నుండి విముక్తి కలుగుతుంది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

శని త్రయోదశి ప్రాముఖ్యత

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.

జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది.

బౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాధిపతి లా శని దండన విధిస్తాడు.

శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.

క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ఆ సమయం లో శివుడు , మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది.

ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు,రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.

ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం గా లబిస్తుంది.

ఈ సమయం లో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం అవి :

నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం,శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం.

శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు
(నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం)

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
ఎవరివద్ద నుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలిమద్యమాంసాదులను ముట్టరాదు.
వీలైనవారు శివార్చన స్వయముగా చేయటము.

శనీశ్వర గాయత్రి:
“ఓం కాకధ్వజాయ విద్మహే, ఖడ్గ హస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్‌”
(శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాత:సమయాన ఎనిమిదిమార్లు జపించవలెను)

ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

పూర్వజన్మ కర్మ ఫలం:
ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్ట్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకు న్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.

ఫలితం అనుభవించాల్సిందే:
ఎంత దైవాంశసం భూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి.

భయపెట్టే దేవుడు కాదు:
భగవంతుడు శనిదేవుణ్ణి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వర్రపదాయినిగా బాధ్యతలు అప్పగించాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశపారంపర్య లక్షణాలను వదులుకోడు. శని భగవానుడు మహర్షి కశ్యపునకు మనవడు. కశ్యపాత్మజుడైన సూర్యభగవానుడికి కుమారుడు. ఈ చుట్టరికమే ఆయనను మిగతా దేవతలకన్నా ప్రత్యేకమైనవాడిగా చేసింది. శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని బంధుగణమంతా గొప్ప అధిదేవతలు. సూర్యునికి కుమారుడు, విష్ణువు అంశ అయిన శనీశ్వరుడికి సంధ్య, ఛాయలు మాతృమూర్తులు. మను సౌవర్ణి, యమధర్మరాజులు సోదరులు. యమున, భద్ర నదులు సోదరీమణులు. వీరందరిలోని దైవాంశలు కలిగిన శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి.

ఓర్పు, సహనం ముఖ్యం:
మంచికన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదిం చాలంటే, ఓర్పు సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాల నుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిమహరాజు కోర్టులో తప్పక శిక్షించబడతారు. ఆయన కోర్టులో లంచాలకు, రికమెండేషన్లకు తావులేదు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచిపనులు, ప్రార్థనలు, భక్తియుతులనే పిటిషన్లు తప్ప ఏవీ పనిచేయవు. శనిభగవానుడి తీర్పు సుప్రీంకోర్టు తీర్పేనని గుర్తుంచుకోవాలి. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడంద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు. స్వర్ణకారుడు పుటం వేసి బంగారాన్ని కాల్చి నగలను తయారు చేసినట్లుగా...శనీశ్వరుడు మానవుల్లోని మాలిన్యాన్ని కడిగేస్తాడు.

శని దండనాధికారి:
జ్యోతిష్య శాస్తర్రీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. బౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

మహా ప్రదోష పూజా మహిమ

సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు.

మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.

ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో,హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు.ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహారించేటప్పుడు,అంధకాసుర సంహారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.

త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం అని,త్రయోదశి సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషమని, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషమని, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషమని, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషమని, త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ,శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి.

ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.

శివప్రదోషస్తోత్రము:-
కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః

రాహుగ్రహ దోష నివారణకు పాదరస దుర్గాదేవి

పాదరస విగ్రహాల పూజ ఇతర విగ్రహాల పూజల కంటే 1000 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి. జాతకచక్రంలో బుధ, రాహు గ్రహా దోషాలు ఉన్నవారు పాదరస దుర్గాదేవిని పూజించిన ఉపశమనం కలుగుతుంది. కాలసర్పదోషం (రాహు కేతువుల మద్య గ్రహాలు) ఉన్నవారు, నాగదోషం (పంచమంలో రాహు గ్రహం) ఉన్నవారు, జాతక చక్రంలో రాహు దశలు జరుగుతున్నప్పుడు పాదరస దుర్గాదేవిని పూజించాలి.

జన్మరాశిలో గాని, జన్మ లగ్న జాతకంలో గాని రాహు గ్రహం శత్రు క్షేత్రాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేనప్పుడు వారి శారీరక, మానసిక ప్రవర్తన సరిగా ఉండదు. మానసికమైన చికాకులు, ఆందోళనలు, తొందరపాటు నిర్ణయాలు, అపోహలు, చెడు వ్యసనాలకు బానిసలు అవుతారు. అలాంటి వారు రాహు కాలంలో రాహుకాల దీపాలు పాదరస దుర్గాదేవి విగ్రహం ముందు వెలిగించి దుర్గా సప్తశ్లోకి చదివితే రాహు గ్రహం నుండి వచ్చే ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చును.

పాదరస దుర్గాదేవి విగ్రహాన్ని పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రం పరిచి దానిపైన పాదరస దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్టింపచేయాలి. ఎరుపు రంగు పూలతో దుర్గాదేవి విగ్రహాన్ని అలంకరించాలి.

పాదరస దుర్గాదేవిని రాగి, ఇత్తడి, వెండి, బంగారం ప్లేట్లపై ప్రతిష్టించేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని ఆ ప్లేట్లపై తప్పనిసరిగా ఉంచాలి.

నేతి దీపంతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అగరబత్తీతో దూపం చూపించాలి. పాదరస దుర్గాదేవి విగ్రహానికి "దుర్గాసప్తశ్లోకి " చదువుతూ కుంకుమార్చన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.

"ఓం హ్రీం దుర్గే పారదేశ్వరీ సర్వార్ధ సిద్ధం" అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించాలి.

పాదరస దుర్గాదేవిని పూజించిన వారికి దురదృష్టకర ప్రమాదాల బారినుండి రక్షింపబడతారు. శత్రుభాధల నుండి విముక్తి కలుగుతుంది.

చెడుకలలు రాకుండా ఉంటాయి. మోసం, భ్రమ, అత్యాశ, దుఃఖము మొదలగు వాటివలన కలుగు ఇబ్బందులను తొలగిస్తుంది.

చెడుదృష్టి, దీర్ఘకాల అనారోగ్యం, రాహుగ్రహా భాధల నుండి విముక్తి కలుగుతుంది.
ఇంటిలో నైరుతి దిక్కు దోషాలు ఉన్నవారు పాదరస దుర్గాదేవిని పూజించిన ఆ దిక్కు దోషాల వలన కలుగు ఇబ్బందులు తొలుగుతాయి.

పాదరస దుర్గాదేవిని పూజించిన రుణభాదలు తొలిగి ధనాభివృద్ధి కలుగుతుంది. పాదరస దుర్గాదేవిని వ్యాపారస్ధలంలో ఉంచి పూజించిన వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి, గౌరవాలు లభిస్తాయి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...