Tuesday, October 9, 2018

శరన్నవరాత్రులలో కుమారి పూజ విశిష్టత

వసంత రుతువులోను, శరదృతువులోని తొమ్మిది రోజులు ఆ పరదేవతను పూజించడాన్నే నవరాత్రి (శరన్నవరాత్రి)పూజలు అంటారు. ఆశ్వీయుజమాసంలో శుక్లపక్షంలోని పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించాలి. ఈ శరన్నవరాత్రి పర్వదినాలలో కొన్ని ప్రాంతాలలో కుమారిపూజను చేస్తారు. ఈ పూజ హస్తా నక్షత్రముతో కలిసిన పాడ్యమి రోజున మొదలు పెట్టడం చాలా మంచిది అని పెద్దలు అంటారు.

కుమారిపూజ శ్రీరస్తు అని ఆరంభించాలి లేదా శ్రీమంత్రంతో కానీ బీజ మంత్రంతో కానీ మొదలుపెట్టాలి. ఈ కుమారిపూజలో రెండుసంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూజిస్తారు. కొత్తబట్టలు, నగలు ఇచ్చి పూజ చెయ్యాలి. అవలక్షణాలు ఉన్న బాలికలు, రోగాలతో ఉన్న బాలికలు, పది సంవత్సరాలు దాటిన బాలికలు ఈ పూజకు అనర్హులు. ఈ బాలికలకు షడ్రుచులతో భోజనం పెట్టి, వస్త్రాలతో సత్కరిస్తారు. ఒక్కొక్కరోజు ఒకొక్క వయస్సు బాలికకు పూజలు చేస్తారు.

రెండుసంవత్సరాలు ఉన్న బాలికను కుమారి అంటారు. కుమారిగా భావించి పూజించడం వల్ల దారిద్ర్యదుఃఖాలు నశిస్తాయి. మూడుసంవత్సరాలు ఉన్నబాలికను త్రిమూర్తి అని అంటారు. ఈ త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. నాలుగుసంవత్సరాలు ఉన్న బాలికను కల్యాణి అని అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఐదుసంవత్సరాలు ఉన్న బాలికను రోహిణి అని అంటారు. రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఆరుసంవత్సరాలు ఉన్న బాలికను కాళిక అని అంటారు, కాళికను పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది.

ఏడుసంవత్సరాల బాలికను చండిక అని అంటారు. చండికను పూజించడం వల్ల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ఎనిమిదిసంవత్సరాల బాలికను శాంభవి అని అంటారు. శాంభవిని పూజను నృపసమ్మోహకం అని అంటారు. ఈ పూజ వల్ల అధికారులు మనకు అనుగుణంగా ఉంటారు. తొమ్మిదిసంవత్సరాల బాలికను దుర్గ అని అంటారు. దుర్గను పూజించడం వల్ల సర్వసుఖాలూ లభిస్తాయి.
ఈ పద్ధతిలో శ్రద్ధాభక్తులతో, శాస్త్రోక్తకంగా నవరాత్రులు పూజ చేయడం సర్వశ్రేయస్కారం, శుభదాయకం.

కన్యా పూజా లేదా కుమారి పూజ నవరాత్రి వేడుకలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం. ఇది నవరాత్రి అంటే అష్టమి మరియు నవమి అతిముఖ్యమైన రోజుల సమయంలో జరుగుతుంది.

మనం ఎంతమందిని అయిన ఈ కన్యా పూజాకి ఆహ్వానించవచ్చు. సాధారణంగా 1,3,5,7,9 మంది కన్యలను ఆహ్వానించవచ్చు.
ఒక అమ్మాయికి పూజలు చేస్తే ఐశ్వర్యము అందిస్తుంది.
ఇద్దరు బాలికలుకి పూజలు చేస్తే భోగము మరియు మోక్షం అందిస్తుంది.
ముగ్గురు అమ్మాయిలకి పూజలు చేస్తే ధర్మము, అర్థము మరియు కామము అందిస్తుంది.
నలుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే అధికారం అందిస్తుంది.
ఐదుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే విధ్య అంటే నాలెడ్జ్ పెరుగుతుంది.
ఆరుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే , 6 రకాల సిద్ధి అందిస్తుంది.
ఏడుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే రాజ్యసభ అంటే శక్తి మరియు రాజ్యం సాధించడంలో సహాయపడుతుంది.
ఎనిమిది మంది అమ్మాయిలకి పూజలు చేస్తే సంపద పెంచుతుంది.
తొమ్మిది మందిఅమ్మాయిలకి పూజలు చేస్తే పృథ్వీ. యాజమాన్యం ఇస్తుంది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

నవదుర్గా అవతారాలు, నైవేద్యం, మంత్రం

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి-గాయత్రీదేవి, చంద్రఘంట-అన్నపూర్ణ,కూష్మాండ-మహాలక్ష్మి, స్కందమాతను లలితా త్రిపురసుందరి, కాత్యాయిని- సరస్వతీదేవి, కాలరాత్రిని దుర్గాదేవి, మహాగౌరి-మహిషాసురమర్దని, సిద్ధి ధాత్ని-రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి పూజిస్తారు.

తిథులలో అమ్మవారి అవతార విశేషం, ఆ రోజున సమర్పించాల్సిన నైవేద్యం, జపించాల్సిన మంత్రం, గాయత్రి మంత్రం.

పాడ్యమి - బాలా త్రిపురసుందరి - పాల పాయసం
"దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే - హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే
సకల జయకరీ, శక్తి బాలే నమస్తే|| " అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి

బాల గాయత్రి :
" ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి - తన్నో బాలా ప్రచోదయాత్‌||"
అనే బాల గాయత్రి సహస్ర గాయత్రి జపించిన మంచి ఫలితం లభిస్తుంది.

విదియ - అన్నపూర్ణేశ్వరి - పాయసన్నం
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||
మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః

అన్నపూర్ణ గాయత్రి :
అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||

తదియ - శ్రీమహలక్ష్మి - గుఢాన్నం
మాతర్నమామి కమలే కమలాయతాక్షి - శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరదజే కమల కోమల గర్భగౌరి - లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే||

లక్ష్మీ గాయత్రి : ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||
"ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి - తన్నో లక్ష్మిః ప్రచోదయాత్‌||" అని పఠించినా మంచిది.

చవితి - గాయత్రి దేవి - కట్టు పొంగలి అన్నం
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి ధియో యోనః ప్రచోదయాత్‌||
అని పఠించినట్టయితే తల్లి కరుణిస్తుంది.

పంచమి - శ్రీ లలితా దేవి - పులిహోరాన్నం
అనఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ - ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా||

శ్రీలలితా గాయత్రి : లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ థీమహి ఔతన్నో దేవి ప్రచోదయాత్‌||

షష్టి - శ్రీ దుర్గాదేవి - చిల్లు లేకుండా అల్లపు గారెలు
ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే - తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ
పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ - సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ
నవమా సర్వస్థిశ్చేత్‌ నవదుర్గా ప్రకీర్తితా||

దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్‌

సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - కొబ్బరి అన్నం
సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ - హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||

సరస్వతీ గాయత్రి : సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి - తన్నో వాణీ ప్రచోదయాత్‌||

అష్టమి - మహిషాసురమర్ధని - శాకాన్నం, కేసరిబాత్‌
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే

మహిషాసుర మర్ధిని గాయత్రి : మహిషష్యైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి - తన్నో మాతా ప్రచోదయాత్‌||

నవమి - శ్రీరాజరాజేశ్వరి - చిత్రాన్నం, లడ్డూలు
అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్‌
దంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబాపావన మంత్ రాజ పఠనాద్ధంతీశ మోక్ష ప్రదా
చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||

రాజరాజేశ్వరి గాయత్రి : రాజేశ్వర్యైచ విద్మహే శ్రీభవానీయైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

దుర్గతి నాశిని శ్రీ దుర్గా స్తోత్రం

దుర్గా దుర్గతి నాశిని అని అమ్మను స్తుతించటం లో ఒక అంతరార్ధం తెలుసుకుందాం . దుర్గం అంటే శరీరం . ఈశరీరంలో ఉండే శక్తే దుర్గ . అదే ప్రాణశక్తి . ప్రాణం ఉంటేనే దేహం ఉన్నట్లుగా దుర్గాదేవి అనుగ్రహం వలన మాత్రమే విశ్వమంతా నిలచి ఉంది.

దుర్గాదేవి దశభుజాలు ,పంచప్రాణ, పంచోపప్రాణాలు దశప్రాణాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉన్నది. సింహం కామానికి సంకేతం .దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూడదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది ..అలాగే అమ్మ చేతిలో సంహరించబడిన మహిషుడు దున్నపోతువంటి క్రోధానికి ప్రతీక .క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం .ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కావున అమ్మకు చేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే . మనలో అట్టి దుర్గాతత్వాన్ని పెంపొందించుకోవటమే ప్రాణాయామం ప్రాణశక్తిని పెంపొందించుకునే యోగ రహస్యం.

ఇక దుర్గ పక్కన ఉండే లక్ష్మీదేవి ధనశక్తి. ఆశక్తిఉండాలి కానీ దివాంధం గుడ్లగూబలా కన్నూమిన్నూకానని స్థితి పనికిరాదు .దాని సూచిస్తూ లక్ష్మీదేవి గుడ్లగూబను అణచివేసి అధిరోహించటం సూచిస్తుంది. మరో పక్క సరస్వతి జ్ఞానానికి ప్రతీక .అది అత్యవసరం .అసత్ జ్ఞానం వీడి సత్ జ్ఞానంతో ఉండాలనే దానికి సంకేతం ఆవిడ వాహనం హంస. అది నీటిని వీడి పాలనుమాత్రమే స్వీకరిస్తుంది . ఇంకో పక్కనుండే కుమారస్వామి దేవసేనాని ,ఆయనవీరత్వానికి ప్రతీక. అట్టివీరత్వంతో ఆత్మరాజ్యస్థాపన చేయాలి . నెమలి లైంగిక సంబంధంలేని బ్రహ్మచర్యానికి గుర్తు .అట్టి బ్రహ్మచర్యమందుండుటచే నెమలికన్నువంటి జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది. ఇట్టి సాధనలో సిద్ది గణపతి స్థానం.

అకారణంగా అన్నింటినీ నాశనం చేసే లక్షణం ఎలుకది . సిధ్ధికి భంగం కలుగకుండా ఉండాలంటే  ఆఎలుకను అదుపులో ఉంచుకోవాలి . ఆన్నింటికీ అధిష్టాతగా ఉన్న శివుడు త్యాగమునకు,అద్వైతస్థితికి ప్రతీక కాగా ఆయన చేతిలో డమరుకం ప్రణవనాదం. త్రిసూలం సత్వరజస్తమోగుణాలకు గుర్తు, వృషము అంటే ధర్మం .అదే ఆయన వాహనమైన నంది. అది నాలుగు కాళ్లపై ఉంటుంది .ఇలా పరివార సహితంగా దుర్గాతత్వం మానవునకు మార్గదర్శకమై జీవితగమ్యాన్ని సూచిస్తుంది

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

Monday, October 8, 2018

బాలారిష్ట దోషం - బాలగ్రహ చికిత్స సుదర్శన పద్ధతులు

పిల్లలు పుట్టిన వెంటనే జన్మనక్షత్రం ప్రకారం దోషం ఉన్నదా? జన్మలగ్నం దశాత్ ఏమైనా దోషములు ఉన్నాయా? అనేది పరిశీలించడం ఒక ఆనవాయితీ. అలా ఎందుకు చేయాలి.

జనన కాలమునకు గండ నక్షత్రములు అని పేరుతో కొన్ని నక్షత్రాలు చెప్పారు కదా. ‘అశ్విన్యాది చతుష్కంచ పుష్య ప్రభృతి పంచకం; రాధేంద్ర భాతి త్రితయం పూర్వాభాద్రా చరేవతీ చిత్తార్ర్దా బహు దోషంస్సాత్ పితృ మాతృ హానిం వదేత్’ అని వున్నది. ప్రతి పంచాంగంలోను ఉదహరిస్తున్నారు. ఆ పట్టికను ఆధారంగా ఏ నక్షత్ర పాదంలో పుడితే తల్లికి గండము, ఎందులో పుడితే తండ్రికి గండము అనే అంశాలు మనం తెలుసుకొని నక్షత్ర శాంతి చేయించుకొని ముందుకు వెళ్లాలి.

వైదిక సంప్రదాయంలో ఏ నక్షత్రంలో పిల్లలు పుట్టినా ‘ముభావ లోకనం’ (నూనెలో ముఖం చూచుట) శిశువును ప్రథమతః నూనెలో ముఖం చూచి తరువాతనే ప్రత్యక్షంగా చూడడం శ్రేయస్కరం అని పెద్దల వాదన. శాస్త్రాన్ని అనుసరిద్దాం అనే ఉద్దేశం వున్నప్పుడు వేద విహితమైన వైదిక మార్గానికి పెద్ద పీట వేయవలసిందే.

ఇక జన్మలగ్నాత్ చాంద్రాష్టమంచ ధరణీ సుతస్సప్తమంచ రాహుర్నవంచ శని జన్మ గురున్తృపతీయే అర్కస్తు పంచ భృగుషట్క బుధశ్చతుర్దే కేతో వ్యయోస్తు బాలారిష్టానాం’ అని ఎక్కువ వాడకంలో వున్న సూత్రం. జన్మ లగ్నము నుండి అష్టమంలో చంద్రుడు వున్ననూ, కుజుడు సప్తమంలో వున్ననూ, రాహువు నవమంలో వున్ననూ, జన్మంలో శని వున్ననూ, గురువు తృతీయంలో వున్ననూ, రవి పంచమంలో వున్ననూ, శుక్రుడు ఆరవ యింట వున్ననూ, బుధుడు చతుర్ధంలో వున్ననూ, కేతువు వ్యయంలో వున్ననూ బాలారిష్టములుగా చెబుతారు.

పరాశరుల సిద్ధాంతం ప్రకారం మరియు ఇతర గ్రంథకర్తల వ్యాసములు ఆధారంగా 12వ సంవత్సరం వరకు ఈ బాలారిష్టములు ఉంటాయి. అంతేకాకుండా పితృ మాతృ పూర్వ జన్మల ఫలితంగానే ఈ బాలారిష్టములు కూడా అందిస్తాయి. అష్టమాధిపతి దశ అయినను అష్టమంలో వున్న గ్రహం యొక్క దశ అయినను ప్రారంభంలో వస్తే ప్రమాదమే. అలాగే లగ్నంలో షష్ట్ధాపతి, షష్ఠంలో లగ్నాధిపతి, ఇదే రీతిగా లగ్న వ్యయాధిపతుల విషయంలో కూడా చర్చనీయాంశ ప్రమాదకర అంశాలు ఉంటాయి. అందువలన ఆయా బాలారిష్టముల విషయములు మరియు గండ నక్షత్ర విషయములు ముందుగానే శోధింప చేసుకొని తగిన శాంతి మార్గములు వెదికి చేయించుట శ్రేయస్కరము.

బాలారిష్టములు ఇచ్చే గ్రహముల దశలు అంతర్దశలు 12వ సంవత్సరం వయసులోపుగా కనుక వస్తే అది ఇంకా ప్రమాదమే. అప్పుడు బహు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బాలారిష్టములు వున్న శిశువుకు 12వ సంవత్సరం వరకు తరచుగా ఆరోగ్య సమస్యలు రావడం పెద్దల శోధనల వలన వెల్లడి అవుతోంది. గండ నక్షత్ర శాంతి బాలారిష్ట శాంతి విధానములు వైదిక మార్గంలో నిష్ణాతులయిన పండితుల ద్వారా తెలుసుకోవాలి. ఎలాంటి జాతకంలో పుట్టినా నామకరణం రోజు నక్షత్ర హోమం, నవగ్రహ హోమం చేయించడం సర్వదా శ్రేయస్కరం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....✍

Saturday, October 6, 2018

చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ

“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.”

వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది. ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...  తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం ! అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు.

ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి. చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా , ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !!

పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.

ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు. తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు.

మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది. ఉదయం ఆమె  పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘ అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి. వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’ అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి. ‘చూసారా స్వామి ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’ అంది, మండోదరి. ‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.

చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’ అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు. ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి. హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు.

మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది. అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, మంత్రిని ఆదరించి, పంపివేసాడు.
నీతి : క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది. దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది ! ఇది సత్యం !

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

గొప్ప సందేశం


బిచ్చగాడు అడుక్కునేటప్పుడు 'దానం చెయ్యండి' అనేబదులు "ధర్మం చెయ్యండి" అని ఎందుకు అడుగుతాడు? ఆలోచించండి.
పూర్వకాలపు భారతీయ ధర్మం ఏమిటంటే: సంపాదించిన దాన్ని నాలుగు భాగాలు చెయ్యాలి.

👉మొదటి రెండు భాగాలు స్వంతానికి.
👉మూడోభాగం పన్నులు, తదితరాలు.
👉నాలుగో భాగం   కళాకారులు ,గురువులు,పురోహితులు, సన్యాసులు ఇలాంటి వారికి ఇవ్వాలి.

ఇది మన కనీస ధర్మం. దీనికి సంస్కారం అవసరం.  
వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని ధర్మం పాటించడం అంటారు.మన ధర్మం మనకి రక్ష. లేదంటే మన అహంకారానికి మనమే బలికాకతప్పదు.
*దానగుణం*
ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు. "నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్ళ మాత్రం తియ్యగా
వుంటాయి. నీవు ఎంతో విశాలంగా ఉంటావు కానీ నీ నీళ్ళ మాత్రం చాలా ఉప్పగా వుంటాయి. దానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.
అప్పుడు సముద్రం ఇలా అంది. "నది ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది. అందుకే ఆ నదిలోని నీరు తియ్యగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానేగాని, ఎవరికీ ఇవ్వను. కాబట్టి నా నీరు ఉప్పగా వుంటుంది" అంది. అందుకే “ఆ చేత్తో తీసుకోని, ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు" అని మన పెద్దలంటారు.

          గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....✍

DON'T MISS

తప్పదు లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గమనించగలరు

1995 వరకూ మాకు *హీరో సైకిల్* ఉండేది.
ఏదో తెలియని *ఆనందం

ఆదివారం వచ్చిందంటే చాలు..  కిరసనాయిల్ తో రిమ్ములు తుడిచేసి కొబ్బరినూనె గుడ్డ తో తుడిచేసి చూస్తుంటే ఆ ఆనందమే వేరండీ.

ఆదివారం వచ్చిందంటే.. ఇంట్లో అన్ని పనులు చేసేవాళ్లం.

ఈ తరం పిల్లలు *బండి*  తుడవమంటే తుడవరు..!
*మేజోళ్ళు* అదేనండీ *సాక్సులు*  ఉతుక్కోమంటే ఉతకరు.! కనీసం *అండర్ వేర్* లు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు..!
*లంచ్ బ్యాగ్* లు శుభ్రం చేసుకోవడం లేదు..!

ఎప్పుడైనా దాచుకోమని *డబ్బులు* ఇస్తే *నూడుల్స్ ప్యాకెట్లు, 5 స్టార్ లు, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు* కొనుగోలు చేస్తున్నారు..!

ఆడపిల్లలైతే తిన్న కంచం కూడా కడగటం లేదు..!
ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..!
డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..!

*తల్లిదండ్రులు మారాలి*

భార్యకు వంట వండటం సరిగా రాదని *నేటి యువత* బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంటపడుతూ  చిన్న వయసులోనే *గ్యాస్టిక్, అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్* ల బారిన పడుతున్నారు..!

మరొక *ఫ్యాషన్* ఏమిటంటే..
పెరుగు, మజ్జిగ తీసుకుంటే *వాంతులు* చేసుకోవడం..!
కాలేజీ పిల్లలైతే చిన్న టిఫెన్ బాక్సు రైస్..!

Pregnant అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం..!
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం.!!

ఈ రోజు ఒక స్కూలు అమ్మాయి స్కూల్ అవ్వగానే  500 రూపాయల కాగితం ఓ షాపు అతనికి ఇచ్చి ఏదో 30 రూపాయల ice cream కొనుగోలు చేసింది. షాపతను 470 ఇచ్చాడు.
ఆ అమ్మాయి చిల్లర ఎంత ఇచ్చారో కూడా లెక్క పెట్టుకోలేదు.
షాపతను *చిల్లర సరిపోయిందా.?*  అనడిగితే.. *సరిపోతాయిలే అంకుల్..!* అంది.

*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం.?*

*ఒక్కసారి ఆలోచించండి*

*బాధ్యత* 👈        
*బరువు* 👈
*కష్టం* 👈
*నష్టం* 👈
*ఓర్పు*👈
*నేర్పు*👈
*దాతృత్వం*👈
*మానవత్వం*👈
*ప్రేమ*👈             
*అనురాగం*👈
*సహయం*👈
*సహకారం*👈
*నాయకత్వం*👈
*మానసిక ద్రృఢత్వం* 👈
*బంధాలు* 👈
*అనుబంధాలు* 👈 అంటే ఏమిటో..
*పిల్లలకు అలవాటు చేద్దాం*

*మనం కూడా మమేకమవుదాం*

భావి తరాలకు ఒక మానవీయ విలువలతో కూడిన,  సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...