Sunday, September 9, 2018

వినాయక పత్రిలోని విశేష గుణాలు

వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షంలో హస్త నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది.

వర్షాకాలానికి, చలి కాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో సూక్ష్మజీవులు స్వైరవిహారంచేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికం. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్లనుంచి త్రుంచి వాటిని దేవునికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ, వాటినుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి.

గణపతి పూజావిధాపంలోనే 'పత్రం సమర్పయామి' అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. అదే విధంగా వినాయక చవితి ముందు రోజున 'తదియ గౌరి' వ్రతం గౌరిదేవికి చేస్తారు. ఈ పూజలో గౌరిదేవికి 16 రకాలైన పత్రాలు సమర్పిస్తారు. అందులో ముఖ్యమైనది 'అపామార్గ పత్రం' అంటే ఉత్తరరేణి ఆకు. దానికి ప్రాధాన్యం ఎక్కువ.

జ్యోతిర్‌ వైద్యం ఆధారంగా నక్షత్రాలకు, రాశులకు, గ్రహాలకు ఈ పత్రాలతో అవినాభావ సంబంధముంది. జ్యోతిషంలో ఆకుపచ్చరంగు బుధునిది. ఆకులన్నీ బుధ కారకత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే తత్వాలను పరిశీలిస్తే... అగ్నితత్వానికి రవి, కుజ, గురువు; భూతత్వానికి బుధుడు, వాయుతత్వానికి శని, చంద్ర, శుక్రులు; జలతత్వానికి, పిత్త తత్వానికి రవి, కుజ, గురువు; వాత తత్వానికి శని, కఫానికి చంద్ర శుక్రులుగా శాస్త్రం నిర్వచించినది. అయితే బుధునికి వాత, పిత్త, కఫతత్వం (త్రిగుణం) ఉంది.

ఏకవింశతి 21 పత్రాలు, వాటి పేర్లు, వాటివల్ల దూరమయ్యే రోగాలు, గ్రహకారకత్వాలు .

1. మాచీ పత్రం (దవనం ఆకు) : ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడంద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. వ్రణాలకు, కుష్టువ్యాధికి మందులా పనిచేస్తుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది.

2. బృహతీ పత్రం (నేల మునగ ఆకు) : దీనినే 'వాకుడు ఆకు' అని అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది.

3. బిల్వ పత్రం (మారేడు ఆకు) : దీనికే మరో పేరు 'బిలిబిత్తిరి'. 'త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మపాప సంహారం, ఏక బిల్వం శివార్పణం' అని పూజిస్తాం. బిల్వ పత్రమంటే శివునికి ఎంత ప్రీతికరమో ఈ శ్లోకంద్వారా తెలుస్తోంది. ఈ మారేడు ఆకువల్ల నెమ్మదించే రోగగుణాలను పరిశీలిస్తే... బంక విరోచనాలు కట్టడిపోతాయి. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలైనది. నేత్రసంబంధమైన రుగ్మతలను అరికడుతుంది. శ్రీమహాలక్ష్మి తపస్సువల్ల ఈ వృక్షం జన్మించినదట. మారేడు దళంలో మూడు ఆకులు, ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది.

4. దూర్వాయుగ్మం (గరిక) : చర్మరోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులు నిరోధించడంలో, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్నిస్తుంది. గజ్జిని నియంత్రిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిణి (aఅ్‌ఱ పఱశ్‌ీఱష)లా పనిచేసి మాడ్చేస్తుంది.

5. దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు) : దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగిస్తుంది. ఉదరకోశ వ్యాధులకు, చర్మరోగాలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక సంబంధ సమస్యలకు, గడ్డలు, ప్రణాలకు ఉమ్మెత్త ఆకు చాలా బాగా పనిచేస్తుంది.

6. బదరీ పత్రం (రేగు ఆకు) : జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. వీర్యవృద్ధికి దోహదపడుతుంది. రక్త దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరిచేతుల దురదలు తగ్గుతాయి.

7. అపామార్గ పత్రం (ఉత్తరేణి) : పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు. కడుపు శూల, అజీర్తి, మొలలు, వేడిసెగ గడ్డలు, చర్మపుపొంగుకు ఉత్తరేణి చాలా మంచిది. దీనితో పళ్లు తోముకున్నట్టయితే దంతాలు గట్టిపడతాయి. దీనికే పాపసంహారిణి, రాక్షస సంహారిణి అనికూడా పేర్లున్నాయి.

8. కశ్యపాయ పత్రం (తులసి ఆకు) : ఇందులో చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గు, చర్మరోగాలు, గొంతు సంబంధ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు తగ్గించగలదు. రక్తస్రావాన్ని, అతిసారను అదుపుచేస్తుంది. వాంతులు, కడుపుశూల అరికడుతుంది. విషాన్ని హరించే గుణంకూడా తులసి ఆకులో ఉంది. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. కలియుగ కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పాలి.

9, చూత పత్రం (మామిడి ఆకు) : దీనిని ఏ శుభకార్యమైనా, పర్వదినమైనా గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి. మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కుట్టుకుని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత, చిగుళ్ల బాధలు, పాదాల పగుళ్లు వంటివి మామిడాకుతో నివారించుకోవచ్చు. చక్కెర వ్యాధికి ఉపశమనమిస్తుంది. దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తి కలిగిస్తుంది.

10. కరవీర పత్రం (ఎర్ర గన్నేరు ఆకు) : పేలను నివారించి శిరోజాలకు రక్షణనిస్తుంది. గుండె జబ్బులు, మూత్రవ్యాధులు, కుష్టు రోగం, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కణుతులను కరిగించే గుణం పుష్కలంగా ఉంది.

11. విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి) : జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, రొమ్ము పడిశం, దగ్గు తగ్గించగలదు.

12. దాడిరి పత్రం (దానిమ్మ ఆకు) : రక్తవృద్ధి కలుగజేస్తుంది. పిత్తహరిణి, అతిసార, మలేరియా, ఇతర జ్వరాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను నివారిస్తుంది. పిల్లలకు కడుపులో నులిపురుగులను, నలికెల పాములను చేరనివ్వదు.

13. దేవదారు పత్రం (దేవదారు ఆకు) : జ్ఞానవృద్ధి, జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి. పుండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, విరోచనాలు తగ్గించగలదు. దీని తైలం కళ్లకు చలువనిస్తుంది.

14. మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. దీని నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలనివ్వదు.

15. సిందూర పత్రం (వావిలాకు) : తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టించగలదు. కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది.

16. జాజి పత్రం (జాజి ఆకు) : తలనొప్పి, చర్మవ్యాధులు, నోటి పూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటివాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్లలకు జాజి ఆకు మంచి మందు. జాజికాయ, జాపత్రికి చెందినదీ ఆకు. సన్నజాజి ఆకు కాదు.

17. గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) : ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలుగజేస్తుంది.

18. శమీ పత్రం (జమ్మి ఆకు) : చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి రుగ్మతలనుంచి విముక్తి చూపించి ప్రశాంతతను చేకూరుస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది.

19. అశ్వత్థ పత్రం (రావి ఆకు) : కంటివ్యాధులు, అతిసార, సంభోగ రోగాలు, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్లు, చర్మ రోగాలు, పుండ్లు తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది. జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది.

20. అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు) : దీనిలో నల్లమద్ది ఆకుకూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. వ్రణాలకు, శరీరంలో మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. వాత పిత్త కఫాలకు మంచిది. పితృకర్మలలో వినియోగిస్తారు. దీని రసం రుమాటిజమ్‌ను అరికడుతుంది. నల్లమద్ది ఆకు కడుపులో నులిపురుగులను నివారిస్తుంది.

21. అర్క పత్రం (జిల్లేడు ఆకు) : సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు, చర్మవ్యాధులు, ఉబ్బసం, వాతం, కడుపు శూల వంటి దీర్ఘరోగాలను నివారిస్తుంది. అమిత ఉష్ణతత్వంనుంచి విముక్తి కలిగిస్తుంది. రథసప్తమినాడు ఆత్మకారకుడైన సూర్యభగవానుడి ప్రీతికోసం జిల్లేడు ఆకులను తల, భుజాలపై పెట్టుకుని తలారా స్నానంచేయడం ఆనవాయితీ.

అరటి ఆకులో భోజనం అనేది జీర్ణప్రక్రియలో ఒక భాగం. అలాగే మృష్టాన్న భోజనం అనంతరం తాంబూలం పేరుతో తమలపాకును తినటం జీర్ణప్రక్రియకు ఎంతగానో ఉపయోగం. ఇంకా చర్మవ్యాధులకు, పొంగు, ఆటలమ్మలకు ఈనాటికీ గ్రామాల్లో వేపాకుతో వైద్యం చేస్తారు. దగ్గు, ఉబ్బసంలాంటివాటికి తమలపాకు, సంతానలేమికి రావిచెట్టు ప్రదక్షిణం, విరోచనానికి సునామికాకు, సౌందర్యపోషణలో కలబంద, మునగాకు, వాపులకు వావిలాకు... ఇలా ప్రతి పత్రంలోనూ ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

Saturday, September 8, 2018

క్షేత్రానికి, తీర్థానికి తేడా తెలుసా?

సర్వ సామాన్యంగా మనం తీర్థక్షేత్రం అనే పదాన్ని వాడుతున్నాం. వాస్తవానికి తీర్థం, క్షేత్రం రెండూ వేర్వేరు. నదీనదాలు, సముద్రపు తీరాన వెలసిన పవిత్రాలయాలను తీర్థాలంటారు.

పవిత్ర గంగ, గోదావరి, కృష్ణ, తుంగ వంటి నదుల తీరంలో ఉన్న వారణాసి, గోకర్ణం, రామేశ్వరం వంటివి తీర్థాలు. కొండలపై, నేలపై వెలసిన ఆలయాలు క్షేత్రాలు. క్షేత్రాల్లో స్థలక్షేత్రాలు, గిరి క్షేత్రాలు అని రెండు రకాలున్నాయి.

నేలపై ఉన్న ఆలయాలు స్థల క్షేత్రాలు కాగా కొండలపై వెలసినవి గిరి క్షేత్రాలు. తిరుమల, మంగళగిరి, సింహాచలం, శ్రీశైలం వంటివి గిరిక్షేత్రాలు. కొన్ని పవిత్రాలయాలు నదులు పక్కన కొండలపై ఉండవచ్చు. వాటిని కూడా క్షేత్రాలుగానే వ్యవహరించాలి.

Saturday, September 1, 2018

మనశ్శాంతిని పొందడం ఎలా?

సముద్రం ఒడ్డున ఆగి ఉన్న ఓడపైన ఓ కాకి వచ్చి వాలింది. అంతలో ఓడ ప్రయాణం ప్రారంభమై సముద్రం మధ్యలోకి చేరింది. కాకి ఓడపై భాగంలో ఎగిరింది. ఎటూచూసినా నీళ్లే ఉన్నాయి. వాలడానికి స్థలం లేదు. తిరిగి తిరిగి మళ్లీ ఓడపైనే వాలింది. చంచలమైన మనస్సు కూడా ఆ కాకిలాంటిదే. చాలాదూరం పరుగెత్తుతుంది. కానీ ఎక్కడా దానికి తృప్తి దొరకదు. గాలిలో దీపం లాగా ఎప్పుడూ కదులుతుంది. అందుకే మనసును కోతితో పోల్చారు. మనసు కోతిగా ఉంటేనే గెంతులేస్తుంది. అలాంటిది ఆ కోతి కల్లు తాగిలే.. దాన్నితేలు కుడితే.. దానికి దెయ్యం పడితే.. ఆపై అది నిప్పులు తొక్కితే? ఇక ఆ కోతి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే మనిషి మనసు కూడా!

ఈ రోజుల్లో ఏ మనిషిని కదిలించినా చాలా ‘బిజీ’గా ఉండడానికి కారణం మనసుకుండే ఈ కోతి స్వభావమే. ఇవాళ మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ అందరిదీ ‘సమయ పేదరికం’. హద్దులు మీరిన ధనవ్యామోహం, తీవ్రమైన పదవీకాంక్ష, హద్దూ అదుపులేని కీర్తి కండూతి వల్ల మనిషి అశాంతిలో మునిగి తేలుతున్నాడు. ప్రతివారిలో ఆధ్యాత్మికత పెరిగినట్లు కనిపిస్తుంది. కానీ ఎక్కువమంది అశాంతితో జీవిస్తున్నారు. గుళ్లకు, గురువుల దగ్గరకు వెళ్లి నాకు ఇళ్లూ, ధనం, పదవి కావాలని భౌతిక సుఖాన్ని యాచిస్తున్నారు. అంతేతప్ప.. ‘నా మనసుకు శాంతి కావాలి’ అని ఎవరూ అడగట్లేదు.

వెండి, రాగి మొదలైన లోహాలతో కలిసినప్పుడు బంగారం విలువ ఎలా తగ్గిపోతుందో.. అలాగే శుద్ధజ్ఞానం గల జీవుడు శివస్వరూపి అయినాగాని అహంకార, మమకార గుణాలతో మాయ ఆవరించి జీవత్వం పొందుతున్నాడు. స్ఫుటం అనే శుద్ధి ప్రక్రియ ద్వారా స్వర్ణకారులు బంగారాన్ని ఇతర లోహాల నుండి ఎలా వేరు చేస్తారో గురువు కూడా అలా తన యోగ విద్యా ప్రబోధం వల్ల మనోనాశనం చేస్తాడు. సాధన వల్ల కలిగే సంస్కారాలతో జీవుని మనో మాలిన్యం తొలగిస్తే ‘శుద్ధ జ్ఞానైక శివస్వరూపుడు’ అవుతాడు. అలాంటి సాధానానుష్ఠానం మనోనిశ్చలతను కలిగిస్తుంది.

*🌹ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్‌*
*ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్‌*

‘ప్రశాంతత పొందిన మనస్సు గలవాడై, త్రిగుణాలు శమించినవాడై పాపం లేనటువంటి బ్రహ్మ స్వరూపుడైన, జీవన్ముక్తుడైన యోగిని ఉత్కృష్టమైన బ్రహ్మానంద సుఖం ఆవరిస్తుంది’ అని గీతాచార్యుడు చెప్పినట్లు మనసుకు శాంతిని కలిగించాలి.

- గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

Thursday, August 30, 2018

దేవాలయంను దర్శించుకునే పద్ధతి


(నాకు తెలిసినవి తప్పులుంటే క్షమించండి)

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమ పవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమపావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీలు , పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట విభూతి,గంధం,కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.ఇలా ధరించినవారిని ఆలయ ప్రవేశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు ” పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి” …ఎవరైతే నాకు భక్తితో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారో వాటిని ప్రీతితో నేను స్వీకరిస్తాను” అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ, చేతులు, ముఖం, నోరు, శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గో కర్ణాకృతిలో ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని ” అకాల మృత్యు హరణం …” అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీసుకోవాలి, తలకు రాసుకోకూడదు.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని దైవ నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచకుండా స్వీకరించరాదు.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

14) అనవసరంగా మాట్లాడటం.. పౌరుషపదజాలం ఉపయోగించకూడదు

15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గోక్కోవడం, తమలపాకులు(కిళ్లీలు) వేయకూడదు.

16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను గడపలను తొక్కకూడదు.

19) ఆకర్షణీయ (మెరుపు) దుస్తులను ధరించకూడదు.

20) పానవట్టo దాటరాదు.

21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.

22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయలి.

24) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.

25) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

26) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

27) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.

28) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

29) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానమే ప్రధానంగా ఉండాలి.

30) గోపుర దర్శనం తప్పక చేయాలి.

31) ఆలయంలోని మర్రి చెట్టుకు, రావి చెట్టుకు, సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు, అసలు వాటి క్రింద కూర్చోరాదు, నిదుర) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

32) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.
33) ప్రధానాలయo వెనుకభాగం(అసుర భాగం) ను తాకరాదు.
34) ఘంటలు ఆడవారు మ్రోగిన్చరాదు.
35) హారతి తీసుకునేటపుడు మొదట కళ్ళకు, రెండు బ్రహ్మరన్ద్రoకు అద్ది , మూడు వాసన చూడాలి, పై విధoగా 3సార్లు హారతిని తీసుకోవాలి.
36) ప్రధాన గర్భాలయo లోకి అర్చకుడు తప్ప అవకాశం వున్నా ప్రవేశిoచరాదు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

Friday, August 24, 2018

జంధ్యాల పౌర్ణమి

శ్రావణపౌర్ణమిని ‘జంధ్యాలపౌర్ణమి’ అని కూడా అంటారు. జంధ్యాల పౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. యఙ్ఞోపవీధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణపౌర్ఱమినాడు, విధిగా నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే, యఙ్ఞోపవీతంగల ప్రతివారు, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతకోసం, ప్రతినిత్యం సంధ్యావందనం చేసితీరాలి. కానీ, ఏదోఒక కారణంగా, ఏదోఒక సందర్భంలో తెలిసో తెలియకో, ఈ నియమానికి భంగం జరిగే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే, ధరించిన యఙ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యఙ్ఞోపవీతిన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లనుసరిదిద్దడానికే ‘శ్రావణపౌర్ణమి’ నాడు నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వులు ఓ ఆచారంగా ఏర్పాటుచేసారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునే వారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు.ముహూర్తంతో పనిలేకుండా ఈ రోజు ఉపనయనాలు చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.

య జ్ఞో ప వీ త ము

యజ్ఞధృతం ఉపవీతం - యజ్ఞోపవీతం లేక యజ్ఞసూత్రమనియు నందురు. బౌధాయనః|| కౌషంసౌత్రం, త్రిస్తివ్రృతం, యఘ్నోపవీతమానామేః| మనుః - కార్పాసముపవీతంస్యాత్‌.

కార్పాసముపవీతం, షట్తస్తుత్రివృతం, బ్రాహ్మణస్య అను థర్మశాస్త్రకారుల వచనముల ననుసరించి, ప్రత్తితో వడికిన దారములు మూడు పొరలతో చేర్చి నొక్కపోగువలె మూడు పోగులుకు మూడు మూడులతొమ్మిది పోగులుండులాగున యజ్ఞోపవీతము ధరింపదగినది.

యజ్ఞోపవీతం కుర్వీతసూత్రాణినవతన్తవః ఏ కేనగ్రంధినాతన్తుస్తిగ్రుణోధనా.

యనురీతిని తొమ్మిది పోగులతో చేర్చిన మూడుపోగులను "బ్రహ్మముడి' యనుపేర నొకముడి వేయదగినది. ""ఏకోగ్రంధిరీతి, నానాత్వ నిషేధార్థం'' యనురీతిని యొ కేముడి యుండదగినది. ఇట్టి నవతన్తు నామకయజ్ఞోపవీతథారణార్థమై గర్భాష్ఠమేబ్దే బ్రాహ్మణస్యోపనయనంశస్తం'' అను ధర్మాన్ని పురష్కరించుకొని యేడవ వర్షముననే యుపనయనము బ్రాహ్మణ బాలునకు చేయుట యుత్తమము.

షోడశవర్షాణాం ఉపనయనాంగయప్రతీయతే
పతితా యస్యసావిత్రీదశవర్షాణింపంచచా,

అనురీతిని పదు నేడు సంవత్సరములు కాగానే సావిత్రీ పతితుడగును, గాన పదునారు సంవత్సరములలోపుగనే బ్రాహ్మణ బాలున కుపనయనము చేయుట ముఖ్యము.

""బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే'' యను తైత్తిరీయారణ్యకమున యజ్ఞొవీతము బ్రాహ్మణునకు ముఖ్యాతిముఖ్యమని వచింపబడియున్నది,

నవతన్తు యజ్ఞోపవీతమునకు అధిపతులు

ఓంకారః ప్రథమస్తన్తుః
ద్వితీయోగ్నిస్తధైవచ
తృతీయోభగదైవత్యః
చతుర్థస్సోమదైవతః
పంచమః పితృదైవత్యః
షష్ఠశ్చెవప్రజాపతి ః
సప్త మోవిష్ణుదైవత్యః
దర్మశ్చాష్టమఏవచ
నవమః సర్వదైవత్యః

ఇత్యే తేనవతన్తవః.

"వినాయచ్ఛిఖయాకర్మ, వినాయజ్ఞోపరీతతః|
రాక్షసం తద్ధి విజ్ఞేయం, సమస్తాన్నిష్నలాఃక్రియాః

అను ధర్మము ప్రకారము, శిఖ లేకపోయిననూ, యజ్ఞోపవీతము లేకున్ననూ, వైదికకార్యము లాచరించినచో నిష్పలములే గాన, శిఖా యజ్ఞొపవీతములు సంధ్యావందనమునకుగూడ ముఖ్యమనియే గ్రహింపదగినది.

నాభేరూర్థ్వ మనాయుష్యం| అధోనాభేస్త పక్షయః|
తస్మాన్నాభిసమం కుర్యాత్‌, ఉపవీతం విచక్షణఇతి.

యను రీతిని యజ్ఞొపవీతము నాభికి సమంగా పొడవుండదగినదిగాని, నాభి కూర్థముగానున్నచో ఆయుస్సు క్షీణించును, నాభికి క్రిందనుండినచో చేసిన జపాది తపస్సు నశించును గాన నాభి సమంగా యజ్ఞొపవీతమున్నది లేనిది గమనించి నాభి సమంగా నొనర్చుకొని సంధ్యావందనాది కర్మలాచరింపదగినది.

"స్తనాదూర్థ్వం, అథోనాభేఃనకర్తవ్యంకదాచనా'' అనురీతిని నాభికి పైకినుండరాదు, నాభికి క్రిందికి నుండరాదు. నాభి సమంగానుండుటయే శ్రేయము.

శిఖా యజ్ఞొపవీతము లెప్పటికి ధరించియే యుండవలయును గాని, అవసరమగుతరిని యుంచుకొని మిగతా సమయములలో తీసివేయరాదు. ఇందుకు ప్రమాణంగా ధర్మశాస్త్రకారిట్లు వచింతురు.

కాయస్థమేవతత్కార్యం, ఉత్థాప్యంనకదాచన|
సదోపవీతినాభావ్యం, సదాబద్ధశిఖేనచ||

ఎప్పటికి శరీరముననే థరించియుండదగిది. శిఖను ముడివేసియే నుంచదగినది. ఉతవీతిగనే యజ్ఞోపవీతము థరించియుండదగినది. ఈరీతిని శిఖా యజ్ఞోపవీతములు థరించి యుపనయన ప్రభృతి గాయత్రీ యనుష్ఠానమున కుపక్రమింపదగియున్నది.

మౌంజీబంధదినే తిష్టేత్‌ సావిత్రీమభ్యసన్‌ గురోః
సూర్యేస్తశిఖరం ప్రాప్తే సాయం సంధ్యాం సమభ్యసేత్‌.

ఉపనయనమున వెంటనే నిలచియే సాయంకాలమువరకు సావిత్రీయుపాసనము (గాయత్రీజపము) చేయుచండవలయును. సూర్యాస్తమయమగుతరిని సాయంసంధ్యా వందనము చేయదగినది.

ఉపనయన వటువు సంధ్యావందనమువలెనే మరునాటినుంచి బ్రహ్మయజ్ఞముగూడా నాచరింపవలయును. వేదాద్యయనమే ప్రారంభించలేదు గాదా? బ్రహ్మయజ్ఞమెట్లు చేయడమను సందియముగలుగవచ్చును. అందులకు ధర్మకారుల సమాధానము పరికించునది.

ఆరభేత్‌ బ్రహ్మయజ్ఞన్తు, మధ్యాహ్నెతు పరేహని మరుదినము మథ్యాహ్నమునుంచి బ్రహ్మయజ్ఞముగూడా చేయవలయును.

అను పాకృత వేదస్య, బ్రహ్మయజ్ఞః కథంషవేత్‌|
వేదస్థానేతు గాయత్రీ గద్యతేన్యత్స మంభవేత్‌||

వేదము రాకపోయిననూ వేదస్ధానమున గాయత్రీ మంత్రమే పఠింపదగినది

వేద మథ్యాపయేత్‌ ఏనం, శౌచాచారాంశ్చ శిక్షయేత్‌ ||

ఉపనయనము చేసిన వటువునకు వేదము నేర్పించవలయును. శౌచాచారాదులలో బాగా శిక్ష యిప్పించవలయును.

దివా సంధ్యాసుకర్ణన్థః బ్రహ్మసూత్రః ఉదఙ్ముఖః
కుర్యా న్మూత్ర పురీషేవా రాత్రౌచేద్దక్షిణాముఖః||

ఉపనయన వటువు శౌ చా చా ర ము లు తప్పక పాటించడము నేర్వదగియున్నది గాన, పగలుగాని సంధ్యాకాలములలోగాని మూత్ర పురీషములు విడువదగినచో, యజ్ఞొపవీతము కుడి చెవునకు చుట్టుకొని ఉత్తరముఖముగ కూర్చొని మూత్ర పురీషాదులు వదలదగినది.

రాత్రికాలమున మూత్ర పురీషాదులు వదలవలసివచ్చినచో యజ్ఞోపవీతము చెవునకు (కుడిచెవుకు) చుట్టుకొని దక్షిణాభి ముఖముగకూర్చొని విడువదగినది,

మధు మాంసాం జనోచ్ఛిష్టశుక్తం, స్త్రీప్రాణిహింసనం,
భాస్కరాలోకనా శ్లీల పరివాదాది వర్జయేత్‌

మధు మాంసములు తినరాదు, ఎంగిలి తినరాదు. నిష్ఠురమైన మాటలు పలుక రాదు. (శుక్తం-నిష్ఠుర వాక్యం) స్త్రీలను తదితప్రాణి లోకమును బాధించరాదు, సూర్యుని చూడ రాదు. అశ్లీలమైన పలుకులు పలుక రాదు కొట్లాడరాదు. ఈ నియమములు బ్రహ్మచారి (ఉపనయనమైన బాలునకు బ్రహ్మచారి యని పేరు) తప్పక యాచరింపదగినది. ఈ నియమములు విధిగ పాటించుచు సంథ్యావందనము చేయుచు వేదాధ్యయనము చేయుట ముఖ్యము.

...ఇట్లు...
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

Wednesday, August 22, 2018

గాయత్రి ముద్రలు

ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః

ఓం భూర్బువ స్సువః 5
తత్స వితుర్వ రేణ్యం 7
భర్గో దేవస్య ధీమహి 8
ధియో యోనః (ప్రచోదయాత్) 4
24
గాయత్రి ముద్రలను గురు ముఖంగా సాధన చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.ముద్రా విజ్ఞానాన్ని తత్త్వయోగం అంటారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో కూడా తోడ్పడతాయని రుజువైంది. మన ప్రాచీనులు ఈ విశ్వంలో 24 నిర్ధారణ మూలకాలు ఉన్నాయని విశ్వసించారని, గాయత్రి మంత్రంలో 24 పదాలు ఉండడం, 24 మంది జైన తీర్ధాంకరులు, సనాతన ధర్మంలో 24 అవతారా లు ఉండడం యాధృచ్ఛికం కాదని పలువురు అంటుంటారు.

మన చేతుల్లో శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, మన చేతికున్న ఐదు వేళ్ళూ ఐదు తత్వాలకు సంకేతమని అంటారు. బొటని వేలు అగ్నికి, చూ పుడు వేలు వాయువుకు, మధ్యవేలు ఆకా శం, ఉంగరం వేలు పృధ్వి, చిటికెనవేలు జలానికి సంకేతాలు గా చెప్తారు. ఈ ఐదు తత్వాల అసమతుల్యత వల్లనే వ్యాధులు వస్తాయని, వీటిని మందులు, ఆత్మశక్తి, ముద్రల సాయంతో సరిచేయవచ్చని అంటారు. గాయత్రి మంత్రం కూడా ముద్రలు ఎంత విలువైనవో తెలియజేస్తుంది.

ఏత ముద్రన జానాతి గాయత్రి నష్ఫల భవత్‌ (ముద్రల గురించి తెలియనివారు గాయత్రీ మంత్ర ఫలాన్ని పొందలేరు).

గాయత్రి మంత్రం 24 ముద్రలను చెప్తుండగా, యోగాలోని అనేక రూపాలలో పలు ముద్రలను వివరిస్తుంది. కాగా, ఆధునిక వ్యాధులను నియంత్రించడం లో తోడ్పడే విధంగా అనేక ముద్రలకు కూడా రూపకల్పన చేయడం జరుగుతోంది. మన సంప్రదాయం లోనే అనేక ఆరోగ్య సూత్రాలు ఇమిడున్నాయి.

కాళ్ళు ఊపుతూ కూచున్నప్పుడో, వేళ్ళు ఊరుకే విరుచుకుంటుంటేనో ఇంట్లో పెద్దలు అరు స్తుంటారు. అలా చేయవద్దనడానికి కారణం ఆ చ ర్యల వల్ల ప్రాణశక్తి వృధా అవుతుందనే. అనవసరంగా ప్రాణశక్తి వృధా అవడమనేది మెద డుకు నష్టం జరుగుతుంది. ముద్రా విజ్ఞానం వ్యక్తికి ఉపశమనం కలిగించేందుకు ఈ శక్తిని తట్టి లేపుతుం దంటారు దీనిని సాధన చేసే వారు. మానవ సంక్షేమానికి యోగా ఇచ్చిన అద్భుతమైన బహుమతులలో ఈ ముద్రా విజ్ఞానమొకటని కూడా భావిస్తా రు. ఈ ముద్రలను రోజూ అరగంట సాధన చేస్తే చాలు. అయితే ఈ సాధన చేసే సమయంలో పద్మాసనం వేసుకోవడం మంచిది. అలాగే నడిచేటప్పుడు కూడా ముద్రలను సాధన చేయవచ్చు.

ముద్రలు అధిక శక్తిని పుట్టించవు, ప్రాణ శక్తిని సమతులం చేస్తాయి అంతే. ఆరోగ్యాన్ని, మేధస్సును పెంచడమే కాదు సిద్ధులు సాధించడం కోసం, మన చుట్టూ ఉండే ఆరాను ఆరోగ్యవంతం చేయడం, కుండలినినిలోని ప్రాణ కుండలిని, చిత్‌ కుండలిని, పరా కుండలినిని ఉత్తేజితం చేసి మరింత క్రియాశీలకమయ్యేందుకు దోహదం చేస్తాయి. ముద్రలను సాధన చేసేటప్పుడు చేతుల సున్ని తత్వాన్ని పెంచుకునేందుకు, వేళ్ళ చక్రాలను క్రియాశీలకం చేసేం దుకు మన చేతివేళ్ళ పై, అరచేతిపై దృష్టిని కేంద్రీకరించి ఉంచాలి.

ఈ వ్యా యామం చేతిలో ఉండే చక్రాలను పెద్దవి చేసే శక్తి అవసరమైనట్టుగా ఇరువైపులా ప్రవహించేలా చేస్తుంది. ఈ వ్యాయామం చేసేందుకు ముందుగా, ప్రతి వేలి చివరి మీద కనీసం ఒక నిమిషం పాటు దృష్టి కేంద్రీకరించాలి. వేలి చివర్లలో రక్తం ప్రవహించడం, స్పందనలు అనుభవంలోకి రావాలి. ముందుగా ఒక చేతితో ప్రారంభించి, తరువాత మరో చేతి వేళ్ళ మీద దృష్టి కేంద్రీకరించాలి. తరువాత దృష్టిని మూడు నిమిషాలపాటు అరచేతిపై కేంద్రీకరించాలి. అరచేతిలో పువ్వు వికసిస్తున్న అనుభూతిని పొందాలి. ఈ సాధనను కనీసం 40 రోజుల పాటు సాధన చేస్తే, మన చేతులలో ఉండే చక్రాలు శాశ్వతంగా పెద్దవై, మరింత సున్నితత్వం వస్తుంది. ఈ సమయంలో ముద్రలను సాధన చేయడం మంచిది.

ముద్రల సాధనను ప్రారంభించే ముందు వ్యక్తి మనస్సును, శరీరం కొంతమేరకు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ముద్రలను కొన్ని బీజ మంత్రాలను ఉచ్ఛరిస్తూ కూడా సాధన చేయవచ్చు. ఈ మంత్రాలు చక్రాలను ఉత్తేజి తం చేయడమే కాక సూక్ష్మ వాహకాలను విస్తరింపచేస్తాయి. అంటే మానసిక, భౌతిక ప్రబావాన్ని చూపిస్తాయి. బీజ మంత్రాన్ని ఉచ్ఛరించేటప్పుడు బలం గా ఉచ్ఛరించాలి. అప్పుడే ఆ మంత్ర బలం మనలోని వివిధ మానసిక కేంద్రాలకు అనుభవంలోకి వస్తుంది. మంత్రాన్ని బలంగా ఉచ్ఛరించడం అంటే బిగ్గరగా చదవడమని కాదు అందులోని అక్షరాలను ఉచ్ఛరించవలసినట్టుగా ఉచ్ఛరించడం. అందుకే బీజ మంత్రాలను ఎప్పుడూ గురు ముఖంగా పొందాలంటారు.

Tuesday, August 21, 2018

జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే ’శీతలాదేవి’

విశ్వచక్రంలోనున్న దేవతాశక్తుల్ని దివ్య మంత్ర,, నామ స్తోత్రాదులతో స్పందింపజేసి అభీష్టసిద్ధుల్ని సాధించే ’శబ్దచికిత్సా’ విధానాలను మన ఋషులు ఏర్పాటు చేశారు.
వ్యాధుల్ని నివారింపజేసి, జ్వరాలను తొలగించే శక్తి ఉన్న శీతలాదేవిని ఉత్తరాది, వంగదేశం, ఉత్కళ రాష్ట్రాలలో ఎక్కువగా ఆరాధిస్తారు. సుమారు ప్రతి దేవాలయంలో శీతలాదేవికి చిన్న ఆలయముండడమే కాక, ప్రత్యేకించి శీతలా మందిరాలు సైతం కనిపిస్తుంటాయి. శీతలా స్తోత్రాలు నిత్యపారాయణాలుగా ఉండడమే కాక, అతి సామాన్యులు సైతం ఈ తల్లిని ఆరాధిస్తుంటారు.

ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యునికి అనారోగ్యం కలిగింది. అప్పుడతను మాత శారదాదేవితో రైల్లో ప్రయాణిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా ఆ శిష్యుడు మూసిన కళ్లు తెరవలేక పోతున్నాడు.

అది నిద్రో, లేవలేని నిస్సహాయతో గానీ ఆ అస్పష్ట కలత నిద్రలోనే అతనికొక భయంకరమైన ఆకారం ఒకటి కనిపించి 'ఇప్పటికే నేను నిన్ను మృత్యువుకు అప్పచెప్పి ఉండేదాన్ని. కానీ, నీ గురువాజ్ఞ మేరకు వదిలి పెడుతున్నాను. అయితే, ఇందుకు కృతజ్ఞతగా నేనుచూపించే ఈ దేవతామూర్తికి నువ్వు బాగా తియ్యగా ఉండే రసగుల్లాలను నైవేద్యం పెట్టాలి' అని ఆదేశించి అదృశ్యమైంది. ఆ ఆకారం చూపించిన దేవతా మూర్తి ఎర్రని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంది.

ఆ తరువాత చిత్రంగా అతని అనారోగ్యం నయమైంది.ఎంత తీవ్రమైన జ్వరంగానీ, ఎంతో కాలంనుండి తగ్గకుండా పీడి స్తున్న వ్యాథులు పీడిస్తుంటే ఈ తల్లికి భక్తిశ్రద్ధలతో మొక్కుకుంటే తప్ప కుండా అవి నివారణ మవుతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

అనంతశక్తి స్వరూపిణియైన జగదంబ తన అనంత అనుగ్రహాన్ని వివిధ విధాలుగా అందించడానికి అనంత రూపాలను ధరించింది. అలాంటి రూపాలలో ఈ శీతలాదేవి ఒకటి, జ్వరహరణ శక్తులలో ఒకటి. గాడిద వాహనంపై కూర్చుని చేట, చీపురు, కలశంవంటి వాటితో ప్రకాశించే ఈ తల్లిరూపం రోగనాశక శక్తులకు సంకేతం.

జంతువులలో కూడా అనేక రహస్య శక్తులుంటాయి. ఆ శక్తుల్ని గమనిస్తే - కొన్ని జంతువుల ఇంద్రియాలలో సూక్ష్మశక్తులున్న విషయం స్పష్టమౌతుంది. ఆ ప్రత్యేకతలన్నీ విశ్వశక్తిలోని అంశాలే.
శక్తులకు సూక్ష్మ జగత్తులో ఉన్న ఆకృతులను మంత్రద్రష్టలు దర్శించి, వాటిద్వారా మనం తగిన ప్రయోజనాలను పొందాలని వివిధ స్తోత్రాలనందించారు.

గాడిద, చేట, చీపురు, కలశం - ఈపరికరాలు రోగకారక క్రిమినాశన, జ్వరహరణ శక్తులకు సంకేతాలు.
స్ఫోటకము, ఉష్ణతలు, తీవ్రజ్వరాలు నశించడానికి, పిల్లలకు వచ్చే ఆటలమ్మవంటి ’మారీ’ వేదనలు తొలగడానికి, శీతలాదేవిని తలంచి ఈ స్తోత్రం చదివితే చాలు - తప్పక ఆ వ్యాధులు నివారణ అవుతాయని శాస్త్రోక్తి. "శీతలా" నామస్మరణమే జ్వరతాపాలను పోగొడుతుందని పురాణవచనం.

అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః - అనుష్టుప్ ఛన్దః - శీతలా దేవలా దేవతా - లక్ష్మీర్బీజం - భవానీశక్తిః -సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...