Monday, February 12, 2018

వివాహ ముహూర్తాల విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలు

వివాహ విషయమై ఆడపిల్లకు మూడు నవకములలోని జన్మతార గ్రాహ్యమే. అలాగే మగ పిల్లవాని విషయమై ప్రథమ నవకంలోని జన్మతార నిషేధం. కానీ, రెండు మూడు నవకములలోని జన్మతారలు గ్రాహ్యమే. ఇదే రీతిగా పెండ్లి చూపులు, నిశ్చితార్థము విషయములలో కూడా ప్రవర్తించాలి.

నిశ్చితార్థం: వధూవరులకు వివాహం చేయుటకు అన్ని విధములుగా సమ్మతమయిన యెడల వెంటనే వధూవరుల తల్లిదండ్రులు తాంబూలములు మార్పు చేసుకోవడం ఆచారం. అదే రీతిగా వధువుకు వరుని తల్లిదండ్రులు పసుపు, కుంకుమ, గంధం, పళ్లు, పూలు వంటి శుభ ద్రవ్యములు ఇచ్చి ‘తథాస్తు’ అనుకోవడం సంప్రదాయం. అందుకే పిల్లను చూచుటకు, మాటలాడుకొనుటకు కూడా మంచి కాలం చూచు సంప్రదాయం. ఇక నిశ్చితార్థం రాత్రులందు నిషేధము వున్నది. కారణం నిశ్చితార్థం రోజు వధువుతో సహా వధువు యొక్క తల్లిదండ్రులు విఘ్నేశ్వరుని పూజ చేసి కార్యక్రమం నిర్వహించాలి. మరి అటువంటి సందర్భంలో పగలు భోజనం చేసి రాత్రి కాలంలో గణపతి పూజ చేయరాదు. నిశ్చితార్థం రోజు ఉపవసించు ఆచారమూ లేదు. అందువలన ప్రాతఃకాలమే శ్రేయస్కరం. నిశ్చితార్థం అంటే అర్థం ఆ వధూవరులకు ఇరువురికీ వివాహం చేయుటకు ఉభయుల తల్లిదండ్రులూ అంగీకారము తెలుపుట. ఈ ముహూర్తంతో బంధం ప్రారంభమవుతుంది. అందువలన నిశ్చితార్థమునకు శాస్ర్తియంగా బలమయిన ముహూర్తం అవసరం. ఒకవేళ మీరు రాత్రి కాలంలోనే వేడుకగా చేసుకోవాలి అంటే పగలు శాస్త్రోక్తంగా కార్యక్రమం పూర్తి చేసుకొని రాత్రి కాలంలో వేడుక చేసుకోండి. ముహూర్త బలం వివాహ ముహూర్తంతో సమానంగా వుండాలి.

1. పెండ్లిచూపులు ఒకవేళ తప్పనిసరిగా మూఢమి వంటి రోజులలో జరపవలసి వస్తే... ప్రథమతః వధూవరులను ఇరువురినీ దేవాలయంలో కలుసుకునేలాగ చేసి అనంతరం ఇంటిలో చూపించండి. పెండ్లిచూపుల విషయంలో దేవాలయం సర్వదోషహరణ చేస్తుంది అని పెద్దల వాదన. ఒకే గోత్రీకులకు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులలో వివాహం చేయు ఆచారము లేదు. శాస్తమ్రు అంగీకరించదు. గోత్రమునకు సంబంధించి ఋషులు కొందరు వుంటారు కచ్చితంగా. ఋషులు కూడా కలవకూడదు అని శాస్త్ర వచనం. ఋషి గణం ఒకటే అయితే వారు అందరూ సోదరవర్గంలో వారు అని అర్థం.

2.ఆడపిల్లను దత్తత ఇచ్చి (వేరే గోత్రం వారికి) అప్పుడు వివాహం చేయుట అని కొందరు తప్పుడు శాస్తమ్రులు చెబుతున్నారు. ఆడపిల్లకు ఒకసారే గోత్రం మార్పు జరుగుతుంది. అది ప్రథమతః వివాహంలో మాత్రమే. ఇక్కడ మరొక ధర్మసూక్ష్మ ప్రస్తావన చేద్దాం. ఒకవేళ మగపిల్లవాడిని శాస్త్ర ప్రకారం వేరే గోత్రం వారికి దత్తత ఇచ్చాము అనుకోండి. అప్పుడు ఆ పిల్లవాడికి జనక స్థానం, దత్తత స్థానం గోత్రీకులతో ఇరువురితోనూ కూడా వివాహం చేయరాదు. అలాంటప్పుడు ఆడపిల్ల విషయంలో ఒకవేళ మనం ఆధునిక స్వభావాలతో దత్తత ఇచ్చినా జనక స్థాన గోత్రం వారూ ఎలాగూ పనికిరారు అని ధర్మశాస్త్ర వచనం. కాబట్టి ఆడపిల్లను దత్తత ఇద్దాం అనే ఆధునిక ఆలోచనలు తప్పు.

3.వరుడి వయసు కంటే వధువు చిన్న వయస్కురాలయి ఉండాలి. దీని విషయంగా నేడు సమాజంలో చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ శాస్త్రం, ధర్మం పాటింపవలసిన అవసరం మనది. చర్చలు అనవసరం.

4.వివాహమునకు తారాబలం చూసే విషయంలో ప్రత్యేక తార విశేషం అనే నానుడి వున్నది.

5.స్వాతీ నక్షత్రంలో వివాహం చేస్తే ఆ వధువు మరల పుట్టింటికి వెళ్లాలి అని చూడదు. అత్తగారింట సుఖంగా ఉంటుంది అని కృష్ణ యజుర్వేద వాక్యము. ఇది జ్యోతిష గ్రంథాలలో లేదు. కేవలం వంశపారంపర్య విద్యగా అభ్యాసం చేసిన వారికి మాత్రమే ఈ రహస్యం తెలుస్తుంది.

6.ఉపనయ నార్హత వున్నవారి విషయంలో రాత్రి సూర్యాస్తమయాత్ ఒక గంటన్నరలోపు చేయు వివాహం విశేషం. కారణం ఏమిటి అంటే ‘స్థాతీపాకం’ అనే కార్యం వివాహం దీక్షలో ప్రధానమయినది. అది సూర్యాస్తమయాత్ పరం మూడు గంటల వ్యవధిలోనే చేయాలి. ఒకవేళ మూడు గంటల వ్యవధి తరువాత ముహూర్తం చేశాము అనుకోండి. వివాహంలో వైదీక సంప్రదాయం కచ్చితంగా జరగదు. వివాహం ముహూర్తం ఎంత ప్రాధాన్యమో, కార్యక్రమం వేద విహితంగా చేయడానికి కూడా అంతే ప్రాధాన్యం కదా! అందుకే రాత్రి వివాహం కంటే పగలు వివాహం చేయుట ద్వారా శాస్ర్తియత బాగా జరుగుతుంది అని పెద్దల వాదన. రెండు రోజుల వివాహం, మరియు అయిదు రోజుల వివాహం వారికి రాత్రి వివాహం విశేషమే. ఉపనయనార్హత లేనివారికి స్థాతీవాకం ఉండదు.

7.వరుని తండ్రి, పితామహ, కాలం చేసిన సందర్భంలో సంవత్సరం దాటేవరకు వివాహం చేయరాదు. వధువు విషయంలో వివాహం చేయుట సంప్రదాయం వున్నది.

8.వధువు, వరుడు ఇరువురి విషయంలో వారి తాత, మామ్మ, అమ్మమ్మ, మాతామహుడు, తల్లిదండ్రీ అబ్దీకముల రోజులలో వివాహం చేయరాదు.

9.ఒకవేళ అమ్మమ్మ, మాతామహుడు కాలంచేస్తే వారి మృతాశౌచ కార్యములు 12 రోజులు పూర్తయ్యేవరకు వివాహం చేయరాదు. ఈ అంశాలు అన్నీ శోధించుకొని ముహూర్తం నిర్ణయింపజేయాలి.

వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం.అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల రోజులలో వివాహము శ్రేయస్కరమే.

అష్టమ శుద్ధి, లగ్నంలో పాపగ్రహములు లగ్నాత్ సప్తమంలో పాపగ్రహములు లేకుండా వివాహ సుముహూర్తము చేయవలెను. ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు వివాహమునకు గ్రాహ్యము కాదు అని కొందరి వాదన వున్నది. అది కూడా గ్రంథాధారమే కానీ వాటిల్లో కొందరు మహర్షులు శ్రేష్ఠము అని చెప్పిన కారణంగా అందరూ ఆచరిస్తున్నారు. చిత్తా నక్షత్రం గ్రాహ్యం కాదని వాదన.

లగ్నాత్ కేంద్రములు అనే 1,4,7,10 స్థానములలో శుభ గ్రహములు వుండడం దృష్ట్యా వివాహ లగ్నమునకు బలం ఎక్కువ అని చెప్పాలి. లగ్నాత్ 1,4,5,7,9,10 స్థానములలో శుభగ్రహ సంచారం విశేష లాభ ఫలితాలు ఇస్తుంది. అవకాశం వున్నంతవరకు 1,7 స్థానములలో పాపగ్రహములు లేకుండానే నిర్ణయం చేయాలి. శుక్ర గ్రహమునకు పాపగ్రహం సంబంధం లేకుండాను అలాగే చంద్రగ్రహం వున్న నక్షత్రంలో పాపగ్రహం లేకుండాను చేసుకోవాలి. కారణం కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే మనఃకారకుడు చంద్రుడు. అలాగే వీలయినంతవరకు గురు బలం అధికంగా వున్న ముహూర్తం నిర్ణయించాలి.

వధూ ప్రవేశము: ‘వివాహ మారభ్య వధూ ప్రవేశో యుగ్మేదినో షోడశ వాసరాంతే’ వివాహం అయినది. ప్రభృతి 16 రోజులలోపు ఎప్పుడయిననూ సరి దినముల యందు నూతన వధువు గృహ ప్రవేశము చేయవచ్చును. అత్తవారి ఇంట ‘వధూ ప్రవేశో నదివా ప్రశస్తిః’ అని కూడా చెప్పారు. సూర్యోదయాత్ పూర్వం సూర్యాస్తమయాత్ పరం మాత్రమే విశేషము.

అప్పగింతలు అనే కార్యక్రమం వేడుక + ఆచారము. అంతేకానీ శాస్త్రం కాదు. ఇది శుక్రవారం పనికిరాదని పనికి వస్తుంది అని చెప్పే మాటలు కుటుంబ ఆచారమునకు ముడిపడినవి.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

వారశూల ఏవిధంగా గ్రహించాలి

ప్రయాణం నిమిత్తంగా వెళ్లేవారికి వారశూల అనేది ఒక నియమం ఏర్పరిచారు. రోజూ ప్రయాణం చేయువారు కూడా ఈ నియమం పాటిస్తే సుఖపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయంగా తిరిగే వారికి పట్టింపులేదు. ఒకవేళ ఉద్యోగరీత్యా తిరిగే వారికి వారశూల నియమం పాటిస్తే విశేష కార్యలాభం వుంటుంది.

సోమ శనివారములు తూర్పు ప్రయాణం నిషిద్ధం.
గురువారం దక్షిణం ప్రయాణం నిషిద్ధం.
ఆది, శుక్ర వారములు పడమర దిశా ప్రయాణం నిషేధం.
బుధ, మంగళ వారములు ఉత్తర దిశా ప్రయాణం నిషేధం. దీనికే వారశూల అని పేరు.

ఆయావారములలో ఆ దిక్కులకు ప్రయాణం నిషేధం కావున వారశూల అంటారు. అయితే ఒకవేళ అత్యవసరంగా వారశూల వున్న దిశకు ప్రయాణం చేయాలి ఎలా? రాత్రి కాలము వార దోషములు ఉండవు అని శాస్త్రం. దానికి బలమైన కారణం ఉంది. ఆగ్నేయ దిక్కుకు సోమ గురువారములు, నైరుతి దిశకు ఆది శుక్ర వారములు, ఈశాన్య దిక్కుకు బుధవారం, వాయవ్య దిశకు మంగళవారం వారశూల ప్రయాణం కూడదు.

రాత్రి కాలమే కాక ఇంకా విశేష పాఠం ద్వావింశతిర్గురౌచైవ ద్వాదశేందుజ భౌమయోః-పంచాదశభృగౌభానౌ మందేద్యోశ్చాష్ట నాడికాః గురువారం 22 ఘడియలు సూర్యోదయంనుండి 3 గంట.48 ని.లు వరకు వారశూల, బుధ, మంగళవారములు సూర్యోదయంనుండి 12 ఘడియలు 4 గంట.49ని.లు. ఆది, శుక్ర వారములు సూర్యోదయంనుండి 15 ఘడియలు అనగా ఆరుగంటలు. శనివారం సూర్యోదయం మొదలు ఎనిమిది ఘడియలు 3 గం.12 నిమిషముల వ్యవధి మాత్రమే వారశూల దోషము ఉంటుంది. మిగిలిన సమయంలో ప్రయాణం వారశూల వున్న దిశకు కూడా చేయవచ్చు. అందువలన రాత్రి కాలమునకు వార శూల లేదు అని చెప్పిన కారణము.

మన ఇంట ప్రారంభం అయిన తరువాత తొమ్మిదవ రోజు తిరుగు ప్రయాణం చేయరాదు. అలాగే తొమ్మిదవ రోజు ఇంటిలోకి ప్రవేశింపరాదు. అలాగే నవమి తిథి రోజున ప్రయాణం చేయరాదు అని శాస్త్ర వచనం. విశేష కార్యక్రమములు మరియు వధువు ప్రయాణం, చిన్నపిల్లల ప్రయాణం, గర్భిణీ ప్రయాణం విషయాలమీద మంచి ముహుర్తం చూసుకుని ప్రయాణం చేయవలెను.

ప్రయాణమునకు యోగ్యమైన నక్షత్రములు ‘మృగాశ్వినో పుష్యపునర్వసొచ హస్తానురాధా శ్రవణాచ మూలా, ధనిష్ట రేవత్యభిలే ప్రయాణే ఫలం లభేచ్ఛేఘ్రునివర్తనంచ’ మృగశిర, అశ్వినీ, పుష్యమీ, పునర్వసు, హస్త, అనూరాధ, శ్రవణం, మూల, ధనిష్ట, రేవతీ విశేష నక్షత్రములు వీటిలో ప్రయాణం చేసినవారు త్వరగా కార్యం పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి వస్తారు. ఇవి కాకుండా రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిషం ఇవి సాధారణ నక్షత్రములు.

శ్రీ గుట్టీ  సుబ్రహ్మణ్యం శర్మ

ధనుర్మాస వ్రతవిధానం

ధనుర్మాసంలో ఆచరించే వ్రతం తిరుప్పావు. ఈ తిరుప్పావును ఆర్ధ్రమైన హృదయంతో ఆండాళ్‌ ఆలపించింది. వీటిలో ఉన్నవి 30 పాశురాలే. ఆండాళ్‌ ఆళ్వార్ల వంశంలో పుట్టింది. ఆమె తండ్రి విష్ణుచిత్తుడు. నారాయణుడిని అపరిమితంగా ప్రేమించినవాడు. భక్తులు భగవంతుడు తమకు కనిపించాలని ఆశిస్తారు.

సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - "ధనుర్మాసం". వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దధ్యోదనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం.

ధనుర్మాస వ్రతం

ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది.

వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహలాతోగాని, రాగితో గానీ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారుచేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. విష్ణువును 'మధుసూదనుడు' అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతి రోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ 'చెక్కర పొంగలి' ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ 'దధ్యోదనం' నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప, దీప, దక్షిణ, తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని  పూజించాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.

వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని -
"మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||"
అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ -
"ఇందిరా ప్రతి గృహ్ణాతు"
అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాల పాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితుల అభిప్రయం. కాత్యాయనీవ్రతం లేక శ్రీ వ్రతం. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.

వ్రత విధానం

ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి. తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరు పడిన ఈ కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం.
పాశురాల సాయం

1 నుంచి 5 వరకు ఉన్న పాశురాలలో వ్రత విధానం గురించి, 6 నుంచి 15 వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16 నుంచి 17,18 పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొల్పడం, 23వ పాశురంలో మంగళాశాసనం చేయడం, 25, 26 స్వామివారికి అలంకారలైన ఆయుధాలను 'పర' అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది. 27వ పాశురంలో పరమాత్మకు, జీవాత్మకు గల సంబంధాన్ని 'కూడారై' ప్రసాదంతో పోల్చి వివరించింది. 30వ పాశురం ఫలశ్రుతితో భగవంతునికి, మనకు గల సంబంధం తెలిస్తే కోరికలను మనం కోరవలసిన పనిలేదని స్వతంత్రించి భగవంతుడిని అడిగి పొందవచ్చని తెలియజేసింది గోదాదేవి.

ధనుర్మాస మహాత్యం

ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు వైష్ణవులు. ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో వేంకటేశ్వరున్ని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈమాసం మొత్తం  శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా ఈ థనుర్మాసాన్ని భావిస్తారు. ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి.

ప్రతిదినం ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసిన తర్వాత ...మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్యోజనమును సమర్పిస్తారు. ఈ ధనుర్మాస ప్రత్యేక ప్రసాదాలను తీసుకుంటే తమకి ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ ధనుర్మాస ఉత్సవాలను దేశవ్యాప్తంగా విష్ణు దేవాలయాల్లో ఘనంగా నిర్వహిస్దారు. 108 దివ్య వైష్ణవక్షేత్రాలలో ప్రధాన మైన తిరుమలలోనూ ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు అర్చకులు.

ధనుర్మాస పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబవుతుంది. ఈనెల 16వ రాత్రి 10గo.52ని ల నుంచీ ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికార్లు. ఈ నెల రోజులపాటూ శ్రీవారికి చేసే సుప్రభాత సేవను రద్దు చేసి ఆస్ధానంలో తిరుప్పావై పఠించనున్నారు అర్చకులు. దీని వెనుక పురాణ గాధను పరిశీలిస్తే  గోదాదేవి  తనను ద్వాపర యుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను ఈ నెల రోజుల పాటూ పఠిస్తారు. రోజుకొక పాశురం చొప్పున ఈ తిరుప్పావై పఠనం ఆలయంలో జరుగుతుంది. నిత్యం వేదపారాయన చేసే అర్చకులే స్వామివారికి సుప్రభాతాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ధనుర్మాసం మొత్తం జీయంగార్లు తిరుప్పావై పాశురాలను స్వామివారికి చదివి వినిపిస్తారు.

గోదాదేవి రచించిన ఈ 30 పాశురాలను రోజుకోక పాశురం చోప్పున.... పటిస్తారు జీయంగార్లు. అనంతరం స్వామివారికి తోమాలను సమర్పించి, సహస్రనామార్చన చేస్తారు అర్చకులు. అనంతరం యధావిదిగద అన్ని పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు. పెళ్లి కావాల్సిన వారు ఈ మాసంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఈ అక్షింతలను తాము శిరస్సున దరిస్తే ఖచ్చితంగా ఏడాదిలోనే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసం అందుకే ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమల వస్తుంటారు.

ఇక శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవలో నిత్యం  భోగ శ్రీనివాస మూర్తికే జరుపడం ఆచారం. అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాస మూర్తికి  బదులుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు అర్చకులు. మరో వైపు  నిత్యం శ్రీవారిని తులసీ ఆకులతో అర్చిస్తుంటారు అర్చకులు. అయితే ఈ మాసం మొత్తం తులసిఆకులకు బదులుగా బిల్వ  పత్రాలను ఉపయోగించడం ఆచారం. ఈ బిల్వపత్రాలంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కావడంతో ఈ ధనుర్మాసంలో ఈ పత్రాలతోనే స్వామివారిని అర్చస్తారు అర్చకులు.

ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి. ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈనెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి.

కాత్యాయనీవ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్రత విధానం ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరిస్తారు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవం మహా ఘనంగా జరుగుతుంది. తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్ని ''పావై నొంబు'' అంటారు.

అభిజిత్ ముహూర్తం

మనకు తెలియని మరో నక్షత్రం!  బ్రహ్మవైవర్త మహాపురాణం శ్రీకృష్ణజన్మ ఖండం తొంభై ఆరో అధ్యాయంలో ఉన్న విషయం. 

నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు. ఇవన్నీ దక్షప్రజాపతి కుమార్తెలు. దక్షుడు ఈ నక్షత్ర కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లిచేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ అనురాగాన్ని పెంచుకొని ఆమెతోనే ఎక్కువకాలం గడుపుతుండేవాడు. ఓసారి వసంత రుతువులో చంద్రుడు ఒక్క రోహిణి దగ్గరే ఉంటూ మిగతా నక్షత్రాలను నిర్లక్ష్యం చేశాడు. దాంతో మిగిలిన నక్షత్రాలు కొంత ­రుకున్నా శ్రవణా నక్షత్రం మాత్రం సహనాన్ని కోల్పోయింది. ఓపిక పట్టలేక తన నుంచి తనలాగే ఉండే ఒక ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి విషయాన్ని గురించి తన తండ్రికి చెప్పేందుకు వెళ్లింది. ఆ శ్రవణా నక్షత్రపు ఛాయ ఒక నక్షత్రమైంది. దానిపేరు అభిజిత్తు.

అలా ఇరవైఏడు నక్షత్రాలే కాక అభిజిత్తు అనే ఇరవై ఎనిమిదో నక్షత్రం ఏర్పడింది. ఆ తర్వాత కాలాలలో శ్రవణం చెప్పిన విషయాన్ని దక్షుడు వినటం, ఒకటికి రెండుసార్లు ఆయన చంద్రుడిని హెచ్చరించినా చంద్రుడు వినకపోయేసరికి ఆయన శపించటం ఇవన్నీ జరిగాయి. అయినా అభిజిత్తు మాత్రం ఓ పవిత్రమైన స్థానాన్నే పొందింది.

అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్ళలో "గడ్డపలుగు"ముహూర్తం అని అంటారు. గడ్డపలుగు భూమిలో పాతిన దాని నీడ మాయమయ్యే మిట్ట మధ్యాన్న సమయాన్ని అభిజిత్ ముహూర్తంగా, మంచి ముహూర్తంగా నిర్ణయించారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు పంచాంగం చూడటం రాని పల్లె ప్రజలకు ఎటువంటి గందరగోళం లేకుండా స్ధూలమైన మంచి ముహూర్తం ఈ విధంగా ఎన్నుకోవచ్చని తెలియజేశారు. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమకేంద్రంలో ఉంటాడని ఈ యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుందని తెలియజేసేవారు.

అభిజిత్తు అంటే మధ్యాహ్నం 11-45నుండి 12-30వరకు ఉన్న సమయాన్ని అభిజిన్ముహూర్తం  అని,  సూర్యోదయం నుండి లేదా సూర్యాస్తమయం నుండి ఎనిమిదవ ముహూర్తం అభిజిత్ ముహూర్తం అంటారు. పగటి భాగం లో ఎనిమిదవ ముహూర్తం ఇది .దీనికే ‘’విజయ ముహూర్తం ‘’అంటారు. ఈ  అభిజిత్ ముహూర్తం లోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం మొదలు పెట్టారు. ఈ శుభ ముహూర్తం లోనే దేవరాజు ఇంద్రుడు దేవ సింహాసనం అధిరోహించాడు. శ్రీరాముడు జన్మించినది, సీతారాముల కల్యాణం,  భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టింది . ఇన్ని మంచి పనులు ఈ గొప్ప ముహూర్తం లో జరిగాయి.

అభిజిత్ లగ్నం (మధ్యాహ్న లగ్నం) లో పెళ్ళి జరిగింది కనుక ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా, ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతటి దివ్యమైన ముహూర్తం ఇది.ఇవ్వాళ పెళ్ళి చేసుకుని, రేపు విడిపోదామనుకునే జంటలు, ముహూర్త బలాన్నీ, పెద్దల ఆశీర్వాదాలను తప్పుబట్టడం అవివేకం. శుభముహూర్తమేదైనా జీవితాంతం ఆనందంగా ఉండాలనే నిర్దేశించబడుతుంది. అయితే, ముహూర్తం అందించే బలాన్ని జంటలు ఎంతగా పెంచుకుంటున్నాయన్నది ఆలోచించాలి.

శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు

ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు.

శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే. ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు.
గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం శీదక్షిణామూర్తయేనమ:

అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం.

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది. ఆ రూపాలు వరుసగా....

శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.

దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...