Tuesday, August 20, 2013

వినాయక పూజ

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం

చతుర్భుజమ్

ప్రసన్నవదనమ్ ధ్యాయే

త్సర్వ విఘ్నోపశాంతయే..


ప్రతి పూజకు ముందు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటుంటాం. ఇందులో వినాయకుని తత్వం నిక్షిప్తమై ఉంది. ’శుక్లాంబరదరమ్’ అంటే తెల్లని ఆకాశం అని అర్థం. తెలుపు సత్వ గుణానికి సంకేతం. ’శుక్లాంబరధరం విష్ణుం’ అంటే సత్వగుణంతో నిండిన ఆకాశాన్ని ధరించినవాడని అర్థం. ’శశివర్ణం’ అంటే చంద్రుని వలె కాలస్వరూపుడని అర్థం. ’చతుర్భుజం’ అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్ద బ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నవాడని అర్థం. సర్వవిఘ్నాలను పోగొట్టే విఘ్ననివారకునికి మనసారా నమస్కరిస్తున్నానని ఈ శ్లోకం యొక్క అర్థం. విఘ్నాలను తొలగించి సత్వరఫలాన్ని, శుభములనిచ్చే శుభదాయకుడు గణపతి. హిందువులు జరుపుకునే సర్వశుభకార్యాలలోను విఘ్నేశ్వరుకే అగ్రపూజ.


దేహాన్ని ఆరోగ్యంగా నిలుపుకుంటేనే ధర్మసాధన సాధ్యమవుతుంది. ఈ దృష్టితోనే విజ్ఞులైన మన పూర్వులు మన ఆచారాలలో, సంప్రదాయాలలో ఆరోగ్య సూత్రాలను ఇమిడ్చి, నియమాలను నిర్థారించారు. మన పండుగలు, దైవారాధనలు ఆరోగ్యసూత్రాలతో ముడిపడి ఉన్నాయన్నది నిజం. ఇందుకు వినాయకచవితి పూజ, ప్రప్రథమ ఉదాహ్రణమంటే అతిశయోక్తి కాదు.


వినాయకచవితి రోజున నూనెలేని కుడుములను, ఉండ్రాళ్ళను నివేదించడం మన సంప్రదాయం. వర్షఋతువు కారణంగా

ఆరోగ్యభంగము కలుగకుండా ఉండేందుకు, ఆవిరిపై ఉడికించినవాటిని తినాలని చెప్పేందుకు ఉండ్రాళ్ళ నివేదన. ఆవిరిపై ఉడికినవి సులభంగా జీర్ణమై, పిత్త దోషాలను హరిస్తాయి. నువ్వులు, బెల్లంతో చలిమిడి తయారుచేసి గణపతికి నైవేద్యంగా పెడతాము.నువ్వులు శ్వాసరోగాలను, అధికామ్లం, అజీర్తిని తొలగించి నేత్రరోగాలను రాకుండా చేస్తాయి. బెల్లం జీర్ణశక్తిని కలిగించి, వాత, పిత్త దోషాలను పోగొడుతుంది. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే నవధాన్యాలను గమనించిన మన పెద్దలు, వినయకునికి తొమ్మిది(నవ) రోజుల పండుగను ఏర్పాటు చేసి, రోజుకొక ధాన్యంతో ప్రసాదాన్ని పంచే ఏర్పాటు చేసారు.


వినాయకపూజలో పిండివంటలకు, ఫలాలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పత్రాలకు ఉన్న ప్రాధాన్యత తక్కువేం కాదు. మన శరీర ఆరోగ్యపరిరక్షణకు కావలసిన పత్రాలు 21 అని గమనించిన మన పెద్దలు, ’ఏకవింశతిపత్రపూజ’ అని పత్రాలతోనే వినాయకుని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. శ్రీహరి ఎత్తినవి (10) దశావతారాలైతే, శంకరుని రూపాలు ఏకాదశ (11) కాబట్టి, శివకేశవ అబేధంతో, మొత్తం ఇరవై ఒక్క పత్రాల్తో పూజ జరపాలని చెప్పారు. ఈ పత్రపూజ స్వామికి ప్రీతికరం.


ఈ 21 పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి…


1. మాచీపత్రం (Artemisia vulgaris)


ఇది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్ఠును, బొల్లి, దప్పికను పోగొడుతుంది. త్రిదోషాలను ఉపశమింపజేస్తుంది. ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి. తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి.. నరాలకు బలాన్నిస్తుంది. ఇది ఘాటైన వాసన కలది కనుక, నాసికా పుటాలు శుభ్రపడతాయి. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది.


2. బృహతీ పత్రం: వాకుడాకు: నేలమూలిక (solanum surattense)


దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. జ్వరం, శ్వాసశూల, గుండె జబ్బులను అరికడుతుంది. మలబద్ధకం, మూలవ్యాధులు తగ్గుతాయి. దీని రసాన్ని చర్మరోగాలకు పైపూతగా ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది.


3. బిల్వపత్రం: మారేడు పత్రం (Aegle marmelos)


ఇది హిందువులకు అతి పవిత్రమైనది . బిల్వపత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే, పొడ, దురద, గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి. దీని నుంచి వచ్చే గాలిని శ్వాసిస్తే, శ్వాసకోశవ్యాధులు దరిచేరవు. ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది. దీనిని గాలిసోకని ప్రాంతాలలో పెడితే పురుగు పుట్రా రావు. స్వచ్చమయిన గాలి కోసం మన పూర్వులు మారేడును పెంచారు.


4. దూర్వాయుగ్మం: గరిక (cynodon dactylon)


గరికకు వైద్యగుణాలున్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. చిన్న పిల్లలకు ముక్కునుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. మూత్రబంధానికి, రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే, క్రిములను నశింపజేసి, చర్మ రోగాలను తగ్గిస్తుంది.


5. దత్తూర పత్రం ; ఉమ్మెత్త ; (Datura stramonium)


దీనిలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని రెండూ రకాలున్నాయి. ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు, ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది. దీని పత్రాలు,కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలున్నాయి. ఉమ్మెత్తరసాన్ని తలపై మర్ధన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చే అవకాశముంది. కీళ్ళనొప్పులకు, నువ్వుల నూనెను రాసి, ఈ పత్రాలను ఐదారుసార్లు కడితే నొప్పులు తగ్గుతాయి.


6. బదరి పత్రం : రేగు ఆకు : zizyphus jujuba)


దీని పత్రాలు కురుపులను త్వరగా నయం చేస్తాయి. రోజు మద్యాహ్నం తరువాత రేగుపళ్ళను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.


7. తులసీ పత్రం : (ocimum sanctum)


ఇందులొ శ్వేత, కృష్ణ అని రెండు రకాలున్నాయి. ఈ పత్రాల రసం జ్వరం, జలుబు, దగ్గుఅల్ను తగ్గిస్తాయి. క్రిమిరోగాల్తోపాటు నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసీతీర్థం గొంతును శుభ్రపరుస్తుంది….. మధుమేహం, గుండెపోటు, రక్తపోటువంటి వ్యాధులను అరికడుతుంది. దీని గాలి సర్వరోగనివారిణి., మూత్రసంబంధమైన వ్యాధులను, వాంతులను అరికడుతుంది.


8. అపామార్గ పత్రం : ఉత్తరేణి పత్రం (Achyranthus aspera)


ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడంవల్ల చిగుళ్ళవాపు, రక్తం కారడం తగ్గి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై, కడుపునొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనేటీగలు, కుట్టినచోట ఈ పత్రాల రసాన్ని తీసి, పూస్తే నొప్పి తగ్గుతుంది. దీనిని దుబ్బెనచెట్టు అని కూడా అంటారు.


9. చూతపత్రం : మామిడి పతం (mangifera indica)


లేత మామిడి పత్రాలను నూరి, పెరుగులో కలిపి తింటే అతిసారవ్యాధి తగ్గుతుంది. మామిడి పత్రాలు, లేత కాడలను నమిలితే నోటిపూటలు, చిగుళ్ళ బాధలు త్వరగా తగ్గుతాయి. మామిడికాయ రక్తదోషాన్ని హరిస్తుంది. శరీరానికి ఉష్ణాన్నిచ్చి పుష్టినిస్తుంది. ఒరిసిన పాదాల కురుపులకు, మామిడి జీడి రసంతో పసుపును కలిపి రాస్తే పుండు మానుతుంది. ఈ చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చబెట్టి, కాళ్ళ పగుళ్ళకి రాస్తే, అమోఘంగా పని చేస్తుంది. దీని పత్రాలను శుభకార్యాలలో తోరణాలుగా కడతాం.


10. కరవీరపత్రం : గన్నేరు పత్రాలు (nerium indicum)


దీని పత్రాలు కుష్టురోగాన్ని, దురదను తగ్గిస్తాయి. ఈ ఆకుపసరు తలలోని చుండ్రును నివారిస్తుంది. దీని వేరుబెరడుని తీసి ఎంతకు మానని పుండ్లకు పైన కట్టుగా కడతారు. తెల్లగన్నేరు, బిళ్ళగన్నేరు, ఎర్రగన్నేరు అంటూ మూడు రకాలున్నాయి.

11. విష్ణుక్రాంతం : హరిపత్రం (Evolulus alsinoides)


ఆయుర్వేదంలో ఈ పత్రాలను జ్ఞాపకశక్తికి, నరాల అలహీనతకు వాడుతుంటారు. వాతం, కఫాలను నివారిస్తుంది. దంతాలను గట్టిపరుస్తుంది. క్రిములను, వ్రణాలను మటుమాయం చెస్తుంది రకరకాల దగ్గులను తగ్గిస్తుంది. ఇది జ్వరనివారిణి.

12. దాడిమీ పత్రం : దానిమ్మ పత్రం (punica granatum)


ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోకరమైనవే. పత్రాలు, పళ్ళు, అతిసార, అజీర్ణ వ్యాధులను అరికట్టడానికి వాడతారు. ఈ పండ్లను తింటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కాంతివంతమవుతుంది. ఇది వాతాన్ని,కఫాన్ని, పిత్తాన్ని హరిస్తుంది. హృదయనికి బలం చేకూరుస్తుంది.


13. దేవదారుపత్రం ;(sedris diodaran)


దీని బెరడు కషాయం శరీరవేడిని తగ్గిస్తుంది. వెక్కిళ్ళను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.


14. మరువక వృక్షం ; మరువము:( originam marajOranaa)


దీని పత్రాల నుండి తీసిన నూనెను కీళ్ళనొప్పులకు పైపూతగా వాడతారు. శ్వాసరోగాలు, హృద్రోగాలను తగ్గిస్తుంది. తేలు, జెర్రి మొదలైన విషపు పురుగులు కుట్టినపుడు మరువం ఆకులరసాన్ని తీసి కడితేనొప్పి తగ్గుతుంది. ఇది దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. చెవిలోని చీమును, చెవిపోటును తగ్గిస్తుంది. దీనిని పసుపుతో కలిపి రాస్తే గజ్జి, చిడుము మొదలైన చర్మవ్యాధులు తగ్గిపోతాయి. ఇది విరివిగా దొరుకుతుంది.

15. సింధువార పత్రం : వావిలాకు ( vitex negundo) దీని ఆకులను నీళ్ళలో వేసి మరగకాచి బాలింతలకు స్నానం చేయిస్తే, వాతం రాకుండా ఉండటమే కాకుండా ఒళ్ళునొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిగుళ్ళవాపు తగ్గేందుకు కూడ దీనిని ఉపయోగిస్తారు. దీని ఆకుల కషాయం శూలి మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది.


16. జాజి పత్రం (nax maskaTaa)


ఇది అజీర్ణ నివారిణి. జాజి ఆకులను తింటే శరీరానికి తేజస్సు వస్తుంది. కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. నోటి దుర్వాసన పోతుంది. దీనికి తులసికి ఉన్న గుణం ఉంది. దీనిని చాలామంది పెంచుతుంటారు.


17. గండకీ పత్రం : కామంచి (soalnum nigrum)


దీనిని అడవిమల్లె అని కూడ అంటారు. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం,విరేచనాలు అరికట్టబడతాయి. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది.


18. శమీపత్రం : జమ్మి పత్రం (prosopis spicigera)


దీని గాలి క్రిమిసంహారిణి. వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. దీని ఆకులద్వారా మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకులరసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపోతుంది.


19. అశ్వత్థ పత్రం : రావి ఆకు (ficus religiosa)


ఈ చెట్టును త్రిమూర్తుల రూపంగా పూజిస్తుంటారు దీని వేర్లు బ్రహ్మ, కాండం విష్ణువు, కొమ్మలు, ఆకులను శివరూపంగా భావించి పూజిస్తారు. ఈ చెట్టు నీడను ఇవ్వడంతో పాటు మంచి కాలుష్యనివారిణిగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టునుంచి వచ్చేగాలి ఆరోగ్యానికి మంచిది.ఈ ఆకుల, చెక్కరసం విరేచనాలు, నోటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ చెట్టునీడ క్రింద కూర్చుంటే, చదివింది చక్కగా ఒంటపడుతుందని మన పెద్దలు చెబుతుంటారు.


20. అర్జున పత్రం : మద్ది ఆకు (terminalia arjuna)


ఇది వాత రోగాలను పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. దీని గింజలు తైలాన్ని బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. దీని తెల్ల మద్ది అని కూడ అంటారు.


21. అర్కపత్రం : జిల్లేడు పత్రం (calotropis gigantia)


ఆయుర్వేదంలో దీనిని 64 రోగాలనివారిణిగా పేర్కొన్నారు. ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది. అందుకే దీనిని అర్కపత్రమని అన్నారు.దీని ఆకులను నూనెలో కాచి, కీళ్ళకు రాస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఇది పాము విషాన్ని కూడా హరిస్తుందని అంటారు. వాత, పక్షవాతం, కుష్ఠు, కఫం తదితర వ్యాధులకు మందుగా వాడుతుంటారు. దీని ద్వారా జలుబు తగ్గుతుంది. జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతమవుతుంది.


ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలెన్నో తగ్గుతాయి. పత్ర పూజా విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలున్నాయి. ఉదాహరణకు వినాయకునికి వెలగపండును నైవేద్యంగా పెడతాము. వెలగపండు గుజ్జును తేనెలోకలిపి తీసుకుంటే పైత్యం, వాంతులు తగ్గుతాయి.

 ఇట్లు

    మీ

జి.సుబ్రహ్మణ్య శర్మ

నవదుర్గలు -మహిమలు

అమ్మలకే అమ్మ , ముగురమ్మల మూలపుటమ్మ దుర్గా మాత నవ విధ అవతారాలని అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు ఈ దసరా నవరాత్రులు. దేవీ భాగవతంలో శక్తిస్వరూపిణీ మాతకు త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులకన్నా అధిక ప్రాధాన్యమివ్వబడింది. విజయం ప్రాప్తించాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి.' త్రిపురార వ్యాసం'లోని మహాత్మ్యఖంఢం శక్తి ఉపాసనా విశిష్టతను స్పష్టం గావించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళ నామం 'సప్తశతీ, 'లలితాత్రిశతి ', లలితా సహస్రనామం ఆదిగాగల గ్రంధాలలో కూడా కనపడుతుంది. ఆమెయే త్రిపురా రహస్యంలో వర్ణితమైన దుర్గామాత. అట్టి దుర్గామాతకి జరిపే ఉత్సవాలే దేవీ నవరాత్రులు.

తల్లిని దేవతగా గుర్తించి పూజించడం శక్తాభావ వికాసంలోని పద్ధతి . నీవే సరస్వతివి, నీవే మహాలక్ష్మివి, నీవే శాకంభరివీ, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణాన్ని సమన్వయాన్ని సాధించే దిశలో శ్రీ శంకరాచార్యులు మహాలక్ష్మిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు.
వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తులుగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనానికీ, ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు మహాలక్ష్మి, విద్య విజ్ఞానానికి మహా సరస్వతి అధిష్టాన దేవతలుగా రూపొందారు.
నవదుర్గలు -మహిమలు

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటేతి, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.


శైలపుత్రి:

' వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్'

కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.

బ్రహ్మచారిణి:

'దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా
దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా '

ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది.

చంద్రఘంట:

'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా
ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా'

దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.

కూష్మాండ రూపం:

'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '

జ్ఞానరూపిణి,సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.


స్కందమాత:


'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '

శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.


కాత్యాయిని:


'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '

కాత్యాయనీ మాత వింధ్యాచలవాసిని. ఈమె సాక్షాత్తూ గాయత్రీ అవతారమేనని చెప్పబడింది. కాత్యాయనీ ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి.

కాళరాత్రి :

'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '

కాళరాత్రీ దేవి కాలవర్ణంతో , త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె వాహనం గార్ధబం. ఈమె ఉపాసన వల్ల సర్వ విపత్తులు తొలగిపోయి సర్వసౌభాగ్యాలు లభిస్తాయి. ఈమెకు గల మరో నామం శుభంకరి.

మహాగౌరి:

'శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః
మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'

అష్టమశక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.

సిద్ధిధాత్రి:

'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ

తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.

సంకటనాశన గణేశ స్త్రోత్రం

నారద ఉవాచ |

ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్టసిద్ధయే ||
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్ ||
లంబోదరం పంచమం చ, షష్టం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్ ||
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్ |
ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరం |
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధి కరం ప్రభో ||
విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్ ||
జపేత్ గణపతిస్తోత్రమ్, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః ||
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః ||


ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశ స్త్రోత్రం
సంపూర్ణమ్

దారిద్ర్యదహన శివస్తోత్రమ్


విశ్వేశ్వరాయ, నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ, శశిశేఖర ధారణాయ,
కర్పూరకాన్తి ధవళాయ, జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
గౌరిప్రియాయ, రజనీశ కళాధరాయ
కాలాన్తకాయ, భుజగాధిప కంకణాయ,
గంగాధరాయ, గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
భక్తప్రియాయ, భవరోగ భయాపహాయ
ఉగ్రాయ, దుఃఖ భవసాగర తారణాయ,
జ్యోతిర్మయాయ, గుణనామ సునృత్యకాయ,
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
చర్మాంబరాయ, శవభస్మ విలేఫనాయ
ఫాలేక్షణాయ, మణికుండల మండితాయ,
మంజీరపాదయుగళాయ, జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
పంచాననాయ, ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ, భువన త్రయమండితాయ,
ఆనంద భూమి వరదాయ, తమోపయాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
భానుప్రియాయ, భవసాగర తారణాయ
కాలాన్తకాయ, కమలాసన పూజితాయ,
నేత్రత్రయాయ, శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
రామప్రియాయ, రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ, నరకార్ణవ తారణాయ,
పుణ్యాయ పుణ్యభరితాయ, సురార్చితాయ,
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
ముక్తేశ్వరాయ, ఫలదాయ, గణేశ్వరాయ
గీతాప్రియాయ, వృషభేశ్వర వాహనాయ,
మాతంగచర్మ వసనాయ, మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ.
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్,
సర్వ సంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్.
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం, న హి స్వర్గ మవాప్నుయాత్.
ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రమ్
సంపూర్ణమ్

భక్తుడి భగవంతుడి


సాధారణంగా తమ మనోవాంచలు నెరవేర్చుకోవడం దేవతలకు పూజ చేసి ప్రత్యేక రోజులలో ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సరియైన పద్ధతేనా?? కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. వాస్తవానికి అతడు భక్తుడి నుండి ఏమీ ఆశించడు. అతను మనఃస్పూర్థిగా ఇచ్చినదేదైనా సంతోషంగా స్వీకరిస్తాడు. అది ఫలమైనా, పుష్పమైనా ఏదైనా సరే. అది కూడా భక్తుని సంతృప్తి పరచడానికే తీసుకుంటాడు. కనుక తన సంతృప్తికై భక్తుడు తన ఇష్టదైవానికి తీపి వంటకమో, పుష్పమాలయో, ధూపదీపాలో లేక మరే ఇతరమైనవో సమర్పించుకుంటాడు . అంతే కాని ఏ దేవుడు నాకిది కావాలని అడగడు. ఇచ్చింది కాదనడు. దైవానికి నైవేద్యం సమర్పించడమంటే భగవంతుడికి పూర్ణంగా శరణు జొచ్చడమని భావం. దేవుది పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్ధనా లక్ష్యంపై మనసు సంపూర్ణంగా లగ్నం కాదు. ప్రసాదం అంటె దేవునికి లంచం ఇవ్వడం కాదు. భక్తుడు తనకోసమై తనదనుకుంటున్న సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం. అలాగే అది తనకు భగవానుడే ఇచ్చాడు అని భావించడం అనేది నైవేద్యం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.

"108 ఉపనిషత్తులు"

1. ఈశావాస్యోపనిషత్

2. కేనోపనిషత్

3. కఠోపనిషత్

4. ప్రశ్నోపనిషత్

5. ముండకోపనిషత్

6. మాండూక్యోపనిషత్

7. తైత్తిరీయోపనిషత్

8. ఐతరేయోపనిషత్

9. చాందోగ్యోపనిషత్

10. బృహదారణ్యకోపనిషత్

11. బ్రహ్మోపనిషత్

12. కైవల్యోపనిషత్

13. జాబాలోపనిషత్

14. శ్వేతాశ్వతరోపనిషత్

15. హంసోపనిషత్

16. అరుణికోపనిషత్

17. గర్భోపనిషత్

18. నారాయణోపనిషత్

19. పరమహంసోపనిషత్

20. అమృతబిందూపనిషత్

21. అమృతనాదోపనిషత్

22. అథర్వశిరోపనిషత్

23. అథర్వశిఖోపనిషత్

24. మైత్రాయణ్యుపనిషత్

25. కౌషీతకీబ్రాహ్మణోపనిషత్

26. బృహజ్జాబాలోపనిషత్

27. నృసింహతా పిన్యుపనిషత్ (పూర్వ తాపిని, ఉత్తర తాపిని )

28. కాలాగ్నిరుద్రోపనిషత్

29. మైత్రేయోపనిషత్

30. సుబాలోపనిషత్

31. క్షురికోపనిషత్

32. మంత్రికోపనిషత్

33. సర్వసారోపనిషత్

34. నిరాలంబోపనిషత్

35. శుకరహస్యోపనిషత్

36. వజ్రసూచ్యుపనిషత్

37. తేజోబిందూపనిషత్

38. నాదబిందూపనిషత్

39. ధ్యానబిందూపనిషత్

40. బ్రహ్మవిద్యోపనిషత్

41. యోగతత్వోపనిషత్

42. ఆత్మబోధోపనిషత్

43. నారదపరివ్రాజకోపనిషత్

44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్

45. సీతోపనిషత్

46. యోగచూడామణ్యుపనిషత్

47. నిర్వాణోపనిషత్

48. మండల బ్రాహ్మణోఫనిషత్

49. దక్షిణామూర్త్యుపనిషత్

50. శరభోపనిషత్

51. స్కందోపనిషత్

52. మహానారాయణోపనిషత్

53. అద్వయతారకోపనిషత్

54. రామరహస్యొపనిషత్

55 రామతాపిన్యుపనిషత్ 9పూరవ తాపిన్యుపనిషత్, ఉత్తర తాపిన్యుపనిషత్ )

56. వాసుదేవోపనిషత్

57. ముద్గలోపనిషత్

58. శాండిల్యోపనిషత్

59. పైంగలోపనిషత్

60. భిక్షుకోపనిషత్

61. మహోపనిషత్

62. శారీరకోపనిసషత్

63. యోగశిఖోపనిషత్

64. తురీయాతీతోపనిషత్

65. సన్న్యాసోపనిషత్

66. పరమహంసపరివ్రాజకోపనిషత్

67. అక్షమాలికోపనిషత్

68. అవ్యక్తోపనిషత్

69. ఏకాక్షకోపనిషత్

70. అన్నపూర్ణోపనిషత్

71. సూర్యోపనిషత్

72. అక్ష్యుపనిషత్

73. ఆధ్యాత్మోపనిషత్

74. కుండికోపనిషత్

75. సావిత్ర్యుపనిషత్

76. ఆత్మోపనిషత్

77. పాశుపతబ్రహ్మోపనిషత్

78. పరబ్రహ్మోపనిషత్

79. అవధూతోపనిషత్

80. త్రిపురతాపిన్యుపనిషత్

81. శ్రీదేవ్యుపనిషత్

82. త్రిపురోపనిషత్

83. కఠరుద్రోపనిషత్

84. భావనోపనిషత్

85. రుద్రహృదయోపనిషత్

86. యోగకుండల్యుపనిషత్

87. భస్మ జాబాలోపనిషత్

88. రుద్రాక్ష జాబాలోపనిషత్

89. గణపత్యుపనిషత్

90. ధర్మనోపనిషత్

91. తారసారోపనిషత్

92. మహావాక్యోపనిషత్

93. పంచబ్రహ్మోపనిషత్

94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్

95. గోపాలతాపిన్యుపనిషత్

96. కృష్ణోపనిషత్

97. యాజ్ఞ్వల్క్యోపనిషత్

98. వరాహోపనిషత్

99. శాట్యాయనీయోపనిషత్

100. హయగ్రీవోపనిషత్

101. దత్తాత్రేయోపనిషత్

102. గారుడోపనిషత్

103. కలిసంతారణోపనిషత్

104. బాల్యుపనిషత్

105. సౌభాగ్యలక్ష్ముపనిషత్

106. సరస్వతీ రహస్యోపనిషత్

107. బహ్వృచోపనిషత్

108. ముక్తికోపనిషత్

వేదములు - కొన్ని విషయాలు

వేదములు - కొన్ని విషయాలు

         హిందూ పవిత్ర గ్రంథాలలో వేదములు ప్రముఖమైనవి. వీటినే "శ్రుతులు", "ప్రభు సంహితలు"అనికూడా అంటారు. శ్రుతి అనగా విన్నది అని అర్థం. ఇవి భగవంతుని ద్వారా తెలియ చేయబడినవి అని హిందువుల నమ్మకం. వేదం అనే పదం సంస్కృత పదం 'విద్' (తెలుసుకొనుట) నుంచి పుట్టింది. హిందువుల నమ్మకం ప్రకారం వేదములు సృష్టి కి ముందునుండే ఉండి, కాల క్రమేణా మహర్షులకు వారి ధ్యాన, తపోబలముల వలన ప్రకటించపడ్డాయి.

         ప్రతి వేద మంత్రమునకు ఒక అధిష్టాన దేవత ఉండి, ఆ మంత్రము ఆయనకు అంకితం చేయబడి ఉంటుంది.

         వేదములను వ్యాస మహాముని నాలుగు భాగాలుగా విభజించారు. ఒక నమ్మకం ప్రకారం ప్రతి ద్వాపరయుగాంతం లో ఈ విభజన జరుగుతుంది. ఇప్పటికి ఈ విభజన 27 సార్లు జరిగి ఉండవచ్చని అంచనా.

         మనకి ఉన్న వేదములు నాలుగు. వాటిని గురించి క్లుప్తంగా చర్చిద్దాం....

1. ఋగ్వేదం :

         ఈ వేదం అన్ని వేదాలలోనికి ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఈ వేదం మొట్టమొదటిసారిగా పైల మహర్షికి ప్రకటింప బడింది. అగ్ని దేవుడికి అంకితం చేయబడిన ఈ వేదానికి అధిష్టానదేవత గురువు (Jupiter). ఈ వేదం మొత్తం 10 మండలాలుగా (Books) విభజించబడి, 1028 సూక్తములతో (Hymns) 10,552 మంత్రాలతో అలరారుతూ ఉంది.

         ఈ వేదం మొదటిలో 21 శాఖలుగా విస్తరించి ఉండేది. కాని, ఇప్పుడు 5 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. దేవతా సూక్తాలు, ఆత్మ సంబంధిత సూక్తాలు, సామాన్య జీవన విధాన సూక్తాలు ఇందులో పొందు పరచ బడ్డాయి.

         ఇందులోనే 'ఐతిరేయ' మరియు 'కౌషితక' ఉపనిషత్తులు ప్రస్తావించ బడ్డాయి.

2. యజుర్వేదం :

         వైశంపాయన మునికి మొదటి సారిగా ప్రకటించబడ్డ ఈ వేదం వాయు దేవునికి అంకితం చేయబడింది. అధిష్టాన దేవత శుక్రుడు (Venus). ఈ వేదం 40 స్కంధాలుగా (Parts) విభజించబడి, 1975 శ్లోకాలతో అలరారుతుంది.

         ఈ వేదాన్ని 'శుక్ల' యజుర్వేదం అని, 'కృష్ణ' యజుర్వేదం అని రెండు భాగాలుగా విభజించారు. వీటిలో శుక్ల యజుర్వేదం ప్రాచీనమైనది. కృష్ణ యజుర్వేదం యఙ్ఞవల్క్య మునికి ప్రకటించబడినది.

         యజుర్వేదం మొదట 102 శాఖలుగా ( 85 కృష్ణ, 17 శుక్ల) విస్తరించినప్పటికి, ప్రస్తుతానికి 4 కృష్ణ యజుర్వేద శాఖలు, రెండు శుక్ల యజుర్వేద శాఖలు మాత్రమే మనకు మిగిలాయి. ఈ వేదం ముఖ్యం గా సాంప్రదాయ పద్ధతులు, పూజా విధానాలు, బలి మొదలైన వాటిని వివరిస్తుంది.

         కృష్ణ యజుర్వేదంలో 'తైతిరీయ ', 'కథా' ఉపనిషత్తులు ఉండగా శుక్ల యజుర్వేదంలో 'ఈషా', 'బృహదారణ్యక' ఉపనిషత్తులున్నాయి.

3. సామవేదం :

         ఈ వేదం మొట్టమొదటి సారిగా జైమిని మునికి ప్రకటించ బడింది. ఈ వేదానికి అధిష్టాన దేవత అంగారకుడు (Mars). ఈ వేదం ఆదిత్యునికి (Sun) అంకితం చేయబడింది.

         ఈ వేదం రెండుభాగాలుగా విభజించబడింది.

A). పూర్వార్సిక : 4 స్కంధములలో 585 మంత్రములు కలిగి ఉంది.

B). ఉత్తరార్సిక: 21 స్కంధములలో 964 మంత్రములను కలిగి ఉంది.

         మొత్తం 1564 మంత్రాలలో 75 మంత్రాలు ఋగ్వేదం నుంచి గ్రహించ బడ్డాయి.

         మొదటిలో 1000 శాఖలుగా విస్తరించిన ప్రస్తుతానికి మూడు శాఖలు మాత్రమే నిలిచి ఉన్నాయి. దైవ ప్రార్థనలు, సంగీతం, శాంతి ప్రార్థనలు ఈ వేదంలో మనకు కనపడే విశేషాలు.

4. అధర్వ వేదం

         ఈ వేదం మొదటి సారిగా సుమంతు మహామునికి ప్రకటించదడినది. ఆదిత్యునికి అంకితమైన ఈ వేదానికి బుధుడు అధిష్టాన దేవత.

         ఈ వేదం రెండుభాగాలుగా విభజించ బడినది.

A). పూర్వార్ధ: అనేక విషయాలపై చర్చ.

B). ఉత్తరార్ధ: వివిధ ఆచారాలపై కూలంకష చర్చ.

         అధర్వ వేదం నాలుగు భాగాలుగా విభజించబడి 20 స్కంధములతో 6,077 మంత్రములతో అలరారుతున్నది.

         మొదట తొమ్మిది శాఖలలో ఉన్న ఈ వేదంలో ప్రస్తుతం 2 శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి.

         ఈ వేదంలో దైవ ప్రార్థనలతో పాటు సృష్టి పరిణామం గురించిన కథలు, భూతపిశాచ, దుష్ట శక్తులను నివారించటానికి మంత్రాలు, మంత్రవిద్య, తంత్ర విద్య లకు సంబంధించిన విషయాలు కూడా పొందుపరిచారు.

         ఇందులో 93 ఉపనిషత్తులు పొందు పరిచి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 'ప్రశ్న', 'మాండూక',మరియు 'మాండుక్య' ఉపనిషత్తులు.

   ప్రతి వేదాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చు.

***        ***        ***

         1. మంత్ర సంహితలు: ఇహలోక పరలోక లభ్ధికోసం వివిధ దేవతల గురించిన ప్రార్థనలు ఉన్న భాగం.

          2. బ్రాహ్మణములు: వివిధ ఆచారాలు వాటిని పాటించేవిధాలని గురించి వివరించే భాగం.

          3. అరణ్యకాలు: ఆచారాలకు తాత్విక (Philosophical) వివరణ.

          4. ఉపనిషత్తులు: వీటినే వేదాంతాలు అనికూడా అంటారు. ఇవి వేదాలలోని సారాంశాన్ని వివరిస్తాయి.

         మొత్తం వేద విజ్ఞానాన్ని ఒక మహావృక్షంగా భావిస్తే బ్రాహ్మణాలు ఆ చెట్టు పూలుగా, అరణ్యకాలు పచ్చి కాయలుగా, ఉపనిషత్తులని పండ్లుగా వర్ణించ వచ్చు.

          ఊపవేదములు: వేదాల వెలె కాకుండా ఉపవేదములు మహామునులచే లిఖించబడినవి. వీటినే"స్మృతులు" అనికూడా అంటారు. ఇవి వేదాల వలనే మొత్తం నాలుగు.

         1. ఆయుర్వేదం: ఋగ్ వేదానికి సంబంధించిన ఇది ఆరోగ్యాంగా జీవించటానికి పాటించవలసిన విధులని తెలిపే శాస్త్రం.

                 A) చరక సంహిత: మహాముని చరకునిచే రచించబడిన గ్రంథం.

                 B) శుశ్రుత సంహిత: మహాముని శుశ్రుతుని రచన.

                 C) వాగ్భట్ట సంహిత: మహాముని వాగ్భట్టుని రచన.

                 D) కామ సూత్రములు: మహాముని వాత్సాయనుని రచన.

          2. ధనుర్వేదం: యజుర్వేదానికి సంబంధించిన ఈ ఉపవేదం బ్రహ్మర్షి విశ్వామిత్రునిచే రచించబడినది. ఇది ముఖ్యంగా సైన్య (Military) శాస్త్రానికి సంబంధించినది. మొత్తం నాలుగు భాగాలలో ఈ శాస్త్రం యుద్దానికి సంబంధించిన అన్ని విషయాలని చర్చిస్తుంది. ఇందులోనే వివిధ మారణాయుధాలు, మంత్ర యుద్ధ పద్ధతులు యుద్ధ వ్యూహాల గురించి విపులం గా చర్చించబడింది.

       3. గంధర్వ వేదం: సామవేదానికి సంబంధించిన ఈ ఉపవేదం ముఖ్యంగా కళలకు, సంగీతానికి సంబంధించిన శాస్త్రం. భరత మహాముని రచించిన గంధర్వ శాస్త్రం ఈ కోవలోనికి వస్తుంది.

          4. అర్థశాస్త్రం: రాజకీయ మరియు అర్థశాస్త్రం. ఇందులో నీతిశాస్త్రం, శిల్పశాస్త్రం, అరవైనాలుగు కళలు, ఇంకా అనేక భౌతిక , ప్రాపంచిక విషయాలను కులంకుషంగా చర్చించారు.

వేదాంగములు:

         ఆనవాయతి ప్రకారం వేదాభ్యాసానికి ముందుగా ఈ వేదాంగములని నేర్చుకోవాలి. వేదాంగములు మొత్తం ఆరు.

         1. శిక్ష (Phonetics): పాణిని రచించిన శిక్ష.

         2. వ్యాకరణము (Grammer): పాణిని రచించిన వ్యాకరణము, పతంజలి రచించిన మహాభాష్యము. ఇది పాణిని వ్యాకరణానికి వివరణ.

         3. ఛందస్సు: పింగళాచార్యుల ఛందస్సు.

         4. నిరుక్త (EtymOlogy): యక్షుని నిరుక్త.

         5. జ్యోతీష: ఖగోళ మరియు జాతక శాస్త్రము, గార్గి ముని రచించిన జ్యోతిష గ్రంథము, ఇంకా చాలా గ్రంథములే ఉన్నాయి. భారతీయులు ఖగోళ శాస్త్రంలో వేద కాలంలోనే చాలా ప్రగతి సాధించిన విషయం జగమెరిగిన సత్యం.

         6. కల్ప: ఆచార సంప్రదాయ పద్ధతుల గురించిన శాస్త్రం. ఇందులో మూడు భాగాలున్నాయి.

                I) శుశ్రుత కల్ప: భగవంతునికి ఇచ్చే బలి, నైవేద్య పద్దతులు.

                II) శులభ కల్ప: కొలతలు మొదలైన విషయాలను తెలిపే కల్పము.

                III) ధర్మ కల్ప: నీతి , ధర్మ విషయాలకు సంబంధించినది. ధర్మ కల్పంలో మొత్తం 18 విభాగాలున్నాయి. వాటిలో ప్రముఖమైనవి మూడు.

                         1. మను స్మృతి: ఈ ధర్మసూత్రాలు త్రేతాయుగానికై నిర్దేశించబడినవి.

                         2. యాఙ్ఞవల్క్య స్మృతి: త్రేతా యుగానికై నిర్దేశించబదినది.

                         3. పరాశర స్మృతి: కలియుగానికై నిర్దేశించబడినది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...