Saturday, October 6, 2018

అంతర్యామి

భక్తి వల్లనే భగవంతుడు వశుడవుతాడంటారు. అటువంటి ‘భక్తి’ అని దేన్ని అంటారో ఎవరికీ స్పష్టంగా తెలియదు. భగవంతుడికి ప్రీతి కలిగించాలనే సంకల్పంతో భక్తులు నిత్యం పూజలు, జపాలు, ఇతర దైవకార్యాలన్నీ చేస్తుంటారు. అవన్నీ భక్తి పరిధిలోకే వస్తాయా అన్నది సందేహమే!
భక్తుణ్ని భగవంతుడు అనుగ్రహించాడని ఎలా తెలుస్తుంది? తన భక్తులైన ప్రహ్లాదుడికి, గజేంద్రుడికి, అలాగే మరికొందరికి కష్టాలు   వచ్చినప్పుడు ఆయన ఆదుకున్న కథలు అందరికీ తెలుసు. సర్వసహజంగా ఇతరులెవరికీ అంతటి కష్టాలన్నీ వచ్చే అవకాశం లేదు. వాటి నుంచి తమను తాము కాపాడుకునేందుకు వారు జాగ్రŸత్తలు తీసుకుంటారు. అడుగులు వేయడం తెలిసిన పసివాణ్ని ఆదుకునే అవసరం ఎవరికీ ఉండదు. నడవలేనివారికే సాయం కావాలి. మనిషి శక్తికి మించిన కష్టం కలిగినప్పుడే, దైవశక్తి అవసరం ఉంటుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి కొరవడినప్పుడే ఔషధాలు కావాల్సి వస్తుంది. ఇదీ అలాంటిదే!
భక్తుడు పిలిచిన వెంటనే భగవంతుడు వచ్చి ఆదుకోడు. ఆ పిలుపు ఆర్తిగా వెలువడినప్పుడే, అది భగవంతుణ్ని చేరుతుంది. ప్రార్థన పెదవుల నుంచి, ఆర్తి మనసు నుంచి, పూజ బుద్ధి నుంచి వస్తున్నాయి. ఆత్మతో భక్తుడు ఎటువంటి అనుబంధమూ పెట్టుకోవడం లేదు. దైవం ఎక్కడో ఉన్నాడని భ్రమిస్తున్నాడు. ఆయన ‘అంతర్యామి’గా మదిలో కొలువై ఉన్నాడనే సత్యం భక్తుడికి ఒకపట్టాన అర్థం కావడంలేదు. ఆ లోపాన్ని అతడు తనకు తానే సరిదిద్దుకునే వరకు దైవానుగ్రహం లభించదు.
పూజ యాంత్రికం కారాదు. ప్రార్థన పూజగదికే పరిమితం కాకూడదు. మనిషి హృదయమే పూజా మందిరం. ముందుగానే అతడు అవలక్షణాల్ని తొలగించుకోవాలి. ఆ లక్షణాలేమిటో అతడికి ముందే తెలియాలి. అసూయ, అకారణ ద్వేషం, అంతరాలు, ఆధిక్య భావాలు... ఇవన్నీ తనలో ఉన్నాయని తెలిసినా, గుర్తించలేని స్థితికి చేరాడు. పరిపూర్ణుణ్ని, పరిశుద్ధుణ్ని- అనే భ్రమలు అతణ్ని వీడటం లేదు.    భగవంతుడు మానవుడికి అనేక ప్రజ్ఞలిస్తున్నాడు. అవన్నీ తనవేనని, అంతా తన ప్రజ్ఞేనని భావించి మనిషి అహంకరిస్తున్నాడు. అందరూ తనపై ప్రశంసలు కురిపించి, మహోన్నతుడిగా గౌరవించాలని అతడు ఆరాటపడుతున్నాడు.
అహంకారం, ఆధిపత్య ధోరణి అనేవి చెప్పుల జతలాంటివి. వాటికి ఎన్నడూ ఆలయ ప్రవేశం ఉండదు. వాటిని ధరించి వెళ్లినవారికి దైవదర్శనం ఎప్పటికీ లభించదు. సర్వసంగ పరిత్యాగం అంటే కేవలం కాషాయం ధరించడం కాదు. తలపుల్ని శూన్యం చేసుకోవాలి. మనసంతా దైవచింతనతో నిండాలి. వేషంతో కాదు, వ్యవహార సరళి ద్వారా వైరాగ్యం ప్రస్ఫుటమవుతుంది. అవధూతలకు ఎలాంటి ఆర్భాటాలూ ఉండవు.
భక్తి అంటే, భగవంతుణ్ని ప్రేమించడం ఒక్కటే కాదు. సమస్త సృష్టినీ సమభావంతో చూడటం, సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకచోటే దృష్టి కేంద్రీకరించడం! అప్పుడే అది సంపూర్ణ భక్తి అవుతుంది. అలాంటి భక్తితత్పరతకే భగవంతుడు   వశుడవుతాడు.
సంపూర్ణభక్తి అంటే- సమస్తంలోనూ భగవంతుణ్ని స్థిరబుద్ధితో చూడటం, చూస్తూనే ఉండటం!
Written by_
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...