Tuesday, March 6, 2018

వర్ణవ్యవస్థ

మన వర్ణవ్యవస్థ అనర్థకారియనీ, దీనివల్ల ద్వేషములు ప్రబలుతున్నవిగనుక, దీనిని నిర్మూలించవలసి వుంటుందనీ - అధికార దూర్వాహులయిన పెద్దలు అంటూవుండటం నేడు పరిపాటి అయిపోయింది. నిజానికి వర్ణ ద్వేష మనేది ఇటీవలనే పుట్టుకవచ్చింది. ఈ ద్వేషం తనంతట తానే బయలుదేరిందా? మన పూర్వపరిపాలకులవల్ల ఇది దాపరించిందా? అనే విచారణతో ఇపుడు పనిలేదు.

వర్ణముల మధ్య విరోధములు పుట్టిన మాట నిజం. వర్ణ ద్వేషవాయు ప్రచారం జరుగుతున్న మాటా నిజమే. ఈ వర్ణ ద్వేషంకంటె మతద్వేషాలు మరీప్రబలంగా వున్నవి. ఈ మతద్వేషాలు నేటివికావు. వీటికి పూర్వచరిత్ర చాలావుంది. మతద్వేషా లలా వుండగా, ఒక మతములోనే శాఖకూ శాఖకూ మధ్య సంఘరణలు పుట్టతూవచ్చినవి. క్రుసేడ్సనే వెనుకటి మతయుద్ధాలలా వుండగా, విమతస్థులపట్ల కాథలిక్కులు జరిపిన అత్యాచారాలూ, షియా, సున్నీవిరోధాలు, మనదేశంలో హిందూముస్లిము సంఘరణలు, బర్మాదేశంలో బౌద్ధులకూ ముస్లిములకూ కొట్లాటలు, తెంగల వడఘల విరోధాలు, శైవవైష్ణవ ద్వేషాలూ ఇవి అన్నీ ఏనాటినుంచో వుంటున్నవి. ఈయథార్థ సంఘటనలను చూచినమీదట - రక్తపాతాలకు, యుద్ధాలకు కారణమవుతున్న ఈవర్ణభేదాలను, మతభేదాలను నిర్మూలించవలెననే ఆలోచన ఒకటి బయలుదేరింది. స్థూలంగాచూస్తే ఈ ఆలోచన న్యాయమైన దనే తోస్తుంది.

మరి ఈవర్ణములకంటె, మతములకంటె అధికవిద్వేషాలను భాషాభేదాలు, రాజకీయ మతభేదాలు కల్పిస్తున్నవికదా, వాటి నేమిచేద్దామంటారు? మద్రాసు రాష్ట్రాన్నే చూడండి! ఇచట వర్ణములకంటె భాషలే ప్రబలవిరోధములుగా కనిపిస్తున్నవి. ప్రస్తుత మీ భాషావివాదం, దాని పుణ్యమాయని ఖండన మండనములతోనే సరిపెట్టుకొంటున్నది. ఉత్తరదేశమం దీవివాదం అంతటితో వూరుకొనక దొమ్ములాటలకుదారితీస్తున్నది. ఇలా వివాదాలకు, సంఘరణలకు కారణమవుతూ వున్నది. కనుక అసలు భాషనే నిర్మూలించి, మూగవాళ్ళంగా వుండడమే మేలు అందామా!

పూర్వం రాజ్యలోభంచే రాజులు పరస్పరం యుద్ధాలకు దిగేవారు. ఈనాడు చూడబోతే పరిపాలనావిధానం ఎలా వుండాలి. అనే మతభేదంవల్ల రాజ్యాలన్నీ రెండు తెగలుగా చీలి పరస్పరం ఢీకొనచూస్తున్నవి. ప్రజాసమ్మతిమీదనే పరిపాలనం నడవాలి అని అందరు అంగీకరిస్తారు. మరి, అమెరికా 'తనది ప్రజాసమ్మత ప్రభుత్వ' మంటే 'కాదు, అది సాహుకార్ల ప్రభుత్వ' మని ఆక్షేపిస్తుంది రష్యా. అలాగే రష్యాలో ప్రజా ప్రభుత్వంగా చెలామణి అయేదాన్ని కమ్యూనిజమనిఅమెరికా ఆక్షేపిస్తుంది. పూర్వపు రాజుల అహంకారంలాగే నేటి యీ రాజకీయ మతదురహంకారం స్పర్థలను తెచ్చిపెట్టుతున్నది. ఈ రాజరికపు మతభేదాలతో మాకు సంబంధం లేదు. మే మడిగేది ఒక్కటే- ఈ రాజకీయభేదాలు వివాద కారణంగా వుంటున్నవి కనుక మొదట ప్రభుత్వమనేదాన్నే రూపుమాపి వెనుకటి ఆటవికావస్థకు మాత్స్యన్యాయానికి తరలిపోవలసిందేనా? అని.

ఒకరి మనస్సొకరికి తెలియజెప్పికోవాలంటే ఏకమో అనేకమో భాషలు ఉండితీరాలి. మన దేశంలోనే చూడండి! ప్రతి 500 మెళ్ళకు ప్రాంతీయభాషలు భిన్నంగా కనిపిస్తున్నవి. అంతే కాదు, ప్రతిభాషా 500 ఏండ్ల కొకతూరి పెద్దగా మార్పు చెందుతున్నట్లు కనిపిస్తున్నది. కన్యాకుమారి నుంచి హిమాలయాలదాకా, ప్రాచీన కాలమునుండి నేటిదాకా పరికించి చూస్తే ఈమార్పులు స్పష్టంగా గోచరిస్తవి. భాషవల్ల మనకెంతో ప్రయోజనం వుంటున్నది. అట్టి భాషను తుడిచి పెట్టవలెనంటే ఎవరూ సమ్మతించరు. భాషలు వ్యవహారం కోసం పుట్టినవి కాని విరోధాల కోసం పుట్టలేదు కదా. కాబట్టి బుద్ధిశాలురైనవారు ఈ భాషాద్వేషాలకు కారణం ఏమైయుటుందా అని పరిశీలించి, ఆకారణాన్ని పరిహరించుకోవాలిగాని భాషనే విడనాడరు.

తమిళనాడు ఇతర భాషల కెప్పుడూ ఆతిథ్యమిచ్చి ఆదరిస్తూనే వచ్చింది. ఆంధ్ర మహారాష్ట్ర దేశాలకు దక్షిణదేశస్తు లేనాడో వలసపోయినారు. అలా వచ్చినవారినే తెలుగువారు ద్రావిడులని పిలుస్తారు. ఆ ద్రావిడులకు ఒక్క ముక్కయినా తమిళం రాదు. మహారాష్ట్రానికి వెళ్లిన ద్రావిడులుకూడా అచటి భాషనే అవలంబించారు. అట్లే ఆంధ్రులు, మహా రాష్ట్రులు, ఘూర్జరులు తమిళదేశంలో పాతకాపులైనారు. తమిళనాడులో ఎన్నో తరాలు గడచినా నేటికీ ఆయాదేశస్థులు తమ తమ మాతృభాషలను విడనాడలేదు. వారు తమిళభాషలోనూ పండితులై అనేక తమిళగ్రంధాలు రచించారు తమిళులు గూడా ఏ దేశం వెళ్లినా అచటిభాష నిట్టే అలవరచుకొంటారు. వస్తువుల చల్లదనాన్ని కాపాడే శైత్యకరండం వంటిది తమిళనాడు. తన మరుగుజొచ్చిన భాషలనది కాపాడుతుంది. ఇతర ప్రాంతములను చేరిన భాషలు అట్లుకాక తమ స్వరూపాన్ని కాల క్రమాన కోల్పోయినవి. ఇతరభాషల నిలా ఆదరించి రక్షిస్తూవచ్చిన ప్రశస్తకీర్తిని రక్షించుకొనేభారం తమిళులపై వుంది. ఇతర భాషలకంటె తమభాష గొప్పదనే భావముంటే ఈభాషావైమనస్యంనశించదు. భాషలుపరస్పరం సౌహార్దంతో చెట్టలు పట్టుకొని మెలగుతూ ఇతర భాషలలోని భావరత్నాలతో తమ్ము నలంకరించకొంటూవుంటే సకల భాషలు సంపన్నము లవుతవి. భిన్న భాషలవారికపుడు పరస్పరాభిమానాలు నెలకొంటవి. భాషాదురభిమానాలు సమసి పోవుట కిదేమార్గం.

ఒక మంచివస్తువులో కొంత చెడ్డకూడా కనిపిస్తుంది. నిజమే. అపుడాచెడ్డను పరిహరించి మంచిని కాపాడుకోవడమే బుద్ధిమంతుల లక్షణం. మతవిషయాన, వర్ణవ్యవస్థవిషయాన కూడా ఈమార్గమునే అవలంబించాలి. వర్ణవ్యవస్తనేపరిశీలించండి సంఘవ్యాపారము సుష్ఠుగాజరగడంకోసం పుట్టిందా వ్యవస్థ వృత్తివిభజనచేసి ఎవరిధర్మాన్ని వారు నిర్వహిస్తూ, సమిష్టిక్షేమాన్ని సాధించడమే దాని ఉద్దేశం ఆయావృత్తుల కనుగుణమైనఆహారవిహారములు, నిత్యానుష్ఠానాదులు, జీవన విధానము ఏర్పాటయినవి. ఆశ్రమ వ్యవస్థకూడాఇటువంటిదే. ఒకవర్ణము తక్కినవానికంటె అధికమని చెప్పికొనుట సమర్థనీయం కాజాలదు. వివాహవిషయంలో, స్వీయాచారములవిషయంలో కొన్నికట్టుబాట్లువున్నవి. అంటే, అట్టివిలోకమంతటా వున్నవే. ఐరోపీయులగు క్రిష్టియనులు, నీగ్రోక్రిష్టియనులతో సంబంధభాంధవ్యముల నొల్లరు. ఆ కారణాన క్రయిస్తవమతము పనికిమాలినదని రూపుమాపవచ్చునా? కేవలం స్వకీయములైన ఆచారభేదము లున్నంతమాత్రాన వర్ణవ్యవస్థను ఖండించుటయు న్యాయముకాదు.

ఇటీవలికాలమందుగాని, పరంపరా గతంగాకాని కొన్ని దురాచారములు ప్రవేశించిఉన్నట్లయితే వాటిని పరిహరించుకోవచ్చు ఇంతకు, ఒక వర్ణంకంటె మరొకటి అధికమనుకొనుటయే ఈ వివాదమంతటికి మూలంగా కనిపిస్తున్నది. ఇతరుల కష్టనష్టాలను, విపత్తులను మనవిగా ఎంచుకోవడం అలవాటుకావాలి. మనము ఇతరవర్ణస్థుడు కష్టాలలోవున్నప్పడు మనకష్టాలమాట అలావుంచి. ముందు అతని నాదుకోవాలి. శాస్త్రవిహితమైన ఇట్టి ఉదారదృష్టి అలవడితే నేటి పొరుపులు సమసిపోయి సామరస్యం ఏర్పడుతుంది. 'సర్వేజనా స్సుఖినో భవంతు' అనేదే మనకు ధ్యేయం.

ఇక మతవిషయమంటారా ఇతరమతాలను, శాఖలను ఆక్షేపించటాన్ని ముందుగా మనం వర్జించాలి. ఇతర మతస్థుల నాక్షేపించేముందు ఎవరికివారు తమ మతధర్మాలను చక్కగా ఆచరిస్తున్నారో లేదో పరీక్షించుకోవాలి. మానవునకు ఆత్మ వికాసాన్ని ఘటించి, దివ్యత్వం సమకూర్చడంకోసం మతమనేది ఏర్పడింది. పరులకుపదేశించేముందు మనం కామక్రోధద్వేషాదులను జయించాలి. సమస్తమతాలను అడకువతో పరిశీలించి, వానియందున్న మంచిని గ్రహించుకోవాలి. అట్టి సహృదయత్వం ఏర్పడితే విోధబీజములు నశిస్తవి. విరోధకారణములుగా కన్పించే ఈ మతములప్పుడు ఆత్మకు పుష్టిని, ధర్మోత్సాహాన్ని సమకూరుస్తవి.

అనేకకాష్ఠములను ఒక్క త్రాడుబంధించి వుంచుతుంది. వానిలో ఒక్కకట్టెను వెలికిలాగితే, బంధనం సడలిపోయి. కట్టెలన్నీ విడిపోతవి. అలాకాకుండా ఆకట్టెలను ముందునాలుగైదు చిన్న కట్టెలుగాకట్టి. పిమ్మట అన్నిటినీఒకత్రాటితో బంధిస్తా మనుకోండి. అపుడుఒకకట్టెను జారలాగినా, తక్కనవిఆ యేక బంధమున సురక్షితంగా వుంటవి. అలాగే సమానధర్ములైన మానవులను వర్ణములనే చిన్నకట్టలుగా కట్టి, పిమ్మట వాని నన్నిటిని మతమనే ఏకసూత్రముతో బంధించాలి వర్ణములు, మతము అనేవి సంఘమును ఇలా ఏకబంధాన పరిరక్షిస్తున్నవి. మతమనే ఆ పెద్దమోపులో ఇమిడిన వర్ణములనే చిన్నకట్టలు పరస్పరసహకారభావంతో, ద్వేషమత్సరాలనువిడనాడి స్వక్షేమమును సమిష్టిక్షేమమును సాధించుకోవడంకోసమే మత వర్ణమలు ఏర్పడినవి. మనమిట్లు పాపచింతా విముఖలమై, మానవ సౌందర్యాన్ని ఆరాధిస్తూ, ఈశ్వరానుగ్రహానికి పాత్రులం కావాలి.

వర్ణమునుబట్టి, పదవినిబట్టి ఎవరును అహంకరింపరాదు. మన వర్ణ ధర్మాలను గూర్చిన విచారణతప్ప ఎక్కువతక్కువలను తలపెట్టగూడదు. ఏ వర్ణమువారైనను ఈశ్వరభక్తిచే ఈశ్వర పదాన్ని అధిష్టింపగలరు వర్ణాభిమానములు నశింపవలెనంటే స్వధర్మానురక్తీ భక్తిజ్ఞానములే సాధనాలు. వివేక విజ్ఞానధనులైన పవిత్రులు - భక్తిజ్ఞాన ప్రపూర్ణులగుటచే వర్ణాభిమానం వారి నంటదు. మానవుని కర్మప్రవృత్తియందు ధర్మం లోపించగానే, హృదయంభక్తిశూన్యము బుద్ధిజ్ఞానశూన్యం అవుతుంది. అంతట వర్ణాభిమానాలు ప్రకోపిస్తవి. వర్ణములు నశించాలని చెప్పే పెద్దలు ధర్మమును, భక్తిని, జ్ఞానాన్ని వృద్ధిచేసుకోవాలనికూడా చెప్పవలసివుంటుది. వూరకే వర్ణ భేదాలు పోవాలి, పోవాలి అంటే అవి పెరుగుతవేకాని తరగవు మందు త్రాగేవాణ్ణి కోతినిగూర్చి తలచుకోవద్దు అన్నట్లుగా వుంటుందది. భక్తిజ్ఞానధర్మాలు వేరుదన్నుకొంటే వర్ణభేదాలు వాటంతటవే వెనుక బడిపోతవి. భక్తులపట్ల, జ్ఞానులపట్ల వర్ణభేదం చేయక వారిని ఆరాధిస్తాము. మహాత్ములైనవారు తమ్ము దాము పరమాణువులుగా ఎంచుకుంటారు. మనశాస్త్రాలు వర్ణాహం కృతిదూష్యమనీ, పాపమని చెప్పుతున్నవి. ఏ వర్ణానికి విహితమైన ధర్మాలను ఆ వర్ణం శ్రద్దాలను ఆ వర్ణంశ్రద్ధాభక్తులతో ఆచరించవలెనేకాని స్వవర్ణాభిమానం వహించగూడదు. ఏ వర్ణమువాడైనా తన్ను నికృష్ణునిగా ఎంచుకోవాలేగాని ఉత్కృష్టత నాపాదించుకో గూడదు. శ్రీరంగ దేవాలయానికి పెద్దలు వచ్చినపుడు వారి కాలయమర్యాదలు నెరపుతారు. అపుడాపెద్దలు 'కుక్కకంటె హీనుడను' అని బదులుపలకడం ఆచారం. శైవ వైష్ణవభక్తి గీతాలలో ఈ నైచ్యానుసంధానం స్పష్టంగా గోచరిస్తూ వుంటుంది. మన తప్పులను దిద్దుకొనే వివేకాన్ని, శక్తిని పరమేశ్వరు డనుగ్రహించుగాక!                       

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- “జగద్గురు బోధలు” నుండి

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...