Friday, September 14, 2018

మట్టి గణపతి నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.

వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్లు. అందుకే అలా జరుగకుండా ఉండాలంటే చెరువులు, కుంటల్లో పూడికలు తీయాలి. నీరు నిల్వ ఉండాలే కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు. అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.

విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు

పత్రిపూజ-రహస్యం
గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తుంది. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం కూడా చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. ఔషధపవూతాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటి వల్ల ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్లుగానే పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారని చెబుతుంటారు.

నిమజ్జనం-అసలు రహస్యం
నవరాత్రుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదంటే కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తుంది. చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.

Tuesday, September 11, 2018

వివిధ ఆగమ శాస్త్రాల్లోని గణపతులు

ముద్గల పురాణాన్ని అనుసరించి 32 మంది గణపతులు ఉన్నారు.

1. బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి

5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి

9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి

13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి

16. ఊర్ద్వ గణపతి 17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి

21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి

25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి

29.సింహ గణపతి 30.యోగ గణపతి 31.దుర్గా గణపతి 32 .సంకష్ట గణపతి

ఈ గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.

నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోలుతున్నాయి. తక్కినవి వేరుగా ఉన్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించిన నివేదిక కూడా పేర్కొంది.

విద్యార్ణవ తంత్రంలో గణపతి రూపాల్లో 15 విభేదాలు కనిపిస్తాయి.

1. ఏకాక్షర గణపతి 2.మహా గణపతి 3. క్షిప్ర గణపతి

4. వక్రతుండ గణపతి 5. లక్ష్మీ గణపతి 6. హేరంబ గణపతి

7. వీర గణపతి 8.లక్ష్మీ గణపతి 9. శక్తి గణపతి

10. సుబ్రహ్మణ్య గణపతి 11. మహా గణపతి 12. త్రైలోక్య గణపతి

13. హరిద్రా గణపతి 14. వక్రతుండ గణపతి 15. ఉచ్చిష్ట గణపతి

ఇందులో రెండు మహా గణపతులు ఉన్నాయి. కాగా మూడు లక్షణాలు ఉన్న గణపతులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతులు రెండు, వక్రతుండ గణపతులు రెండు, శక్తి గణపతి లక్షణాలు అయిదు, త్రైలోక్య మోహన గణపతి లక్షణాలు రెండు, వీర గణపతి లక్షణాలు రెండు, ఉచ్చిష్ట గణపతి లక్షణాలు రెండు స్పష్టమౌతున్నాయి.

శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి 21 గణపతుల రూపాలు ఉన్నాయి. అవి వరుసగా...

1.వినాయకుడు 2.బీజ గణపతి 3.హేరంబ గణపతి 4.వక్రతుండ గణపతి

5.బాల గణపతి 6.తరుణ గణపతి 7.భక్తి విఘ్నేశ 8.వీర విఘ్నేశ 9.శక్తి గణేశ

10.ధ్వజ గణపతి 11.పింగళ గణపతి 12. ఉచ్చిష్ట గణపతి 13. విఘ్నరాజ గణపతి

14.లక్ష్మీ గణేశ 15.మహా గణేశ 16. భువనేశ గణపతి 17.నృత్త గణపతి

18.ఊర్ద్వ గణపతి 19.ప్రసన్న గణపతి 20.ఉన్మత్త వినాయక 21.హరిద్రా గణేశ

విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 33 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత.

1. బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

2. తరుణ గణపతి:

ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను...

పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.

3. భక్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్

అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

4. వీరగణపతి

ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....

బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.

5. శక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే
అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,
విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

6. ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.

7. సిద్ధి (పింగల) గణపతి

ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల
అనే మంత్రంతో స్తుతించాలి.

8. ఉచ్ఛిష్ట గణపతి

కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.

9. విఘ్న గణపతి

గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో ప్రార్థించాలి.

10. క్షిప్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను....

దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్
అనే మంత్రంతో స్తుతించాలి.

11. హేరంబ గణపతి

అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా

అనే మంత్రంతో స్తుతించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

12. లక్ష్మీ గణపతి

బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే

గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

13. మహాగణపతి

ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.

హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్

బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే
అనే మంత్రంతో ప్రార్థించాలి.

14. విజయ గణపతి

సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని....
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.

15. నృత్య గణపతి

సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.

పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్
అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

16. ఊర్ధ్వ గణపతి

కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.

కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

Monday, September 10, 2018

హరితాళిక వ్రతం

హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం : భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.

హరితాలికా వ్రత కధ

కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది - ‘‘స్వామీ! తక్కువ శ్రమతో, ధర్మాచరణతో ఎవరు నిను భక్తిశ్రద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవౌతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక, జగవూత్పభువైన మీరు నాకు యే తపోదాన వ్రతమాచరించుటచే లభించారు’’ అని అడిగింది. ప్రసన్నవదనంతో పరమశివుడు ‘‘దేవీ! వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతమొకటున్నది. దాన్నెవరాచరించినా నేను వారికి వశుడనైతాను. ఈ వ్రతాన్నాచరించినవారు సర్వపాప విముక్తులవుతారు. ‘‘దేవీ! నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహా వ్రతాన్ని ఎలా ఆచరించావో చెబుతాను. విను!’ అన్నాడు. 

భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచుచేత కప్పబడి బహుసుందరమైన హిమవత్పర్వతము కలదు. హిమవంతుడా ప్రాంతానికి ప్రభువు. నీవాతని కూతురువు. చిన్నతనం నుంచే శివభక్తురాలవు. యుక్తవయసు వస్తున్న నీకు వరుడెవరగునా?యని హిమవంతుడాలోచించగా, త్రిలోక సంచారి నారద మునీశ్వరులొకనాడు మీ తండ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్య పాద్యాలందించి మీ తండ్రి నిను చూపి, ఈ కన్యనెవరికిచ్చి వివాహం చేయవచ్చును, తగిన వరుడెవరని నారదుని అడిగినాడు. వెంటనే నారదుడు ‘ఓ గిరిరాజా! నీ కన్యారత్నమున కన్నివిధముల యోగ్యమైనవాడు బ్రహ్మాదిదేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చానన్నాడు’. సంతోషంతో హిమవంతుడు మునీందరా ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నినుపంపాడు కనుక గౌరవించి, అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపుమన్నాడు. నారదుడందుకంగీకరించి బయలుదేరాడు.

హిమవంతుడానందంతో భార్యాపిల్లలకావిషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి ‘ఓ పుత్రీ! గరడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని’ తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్లి పొర్లిపొర్లి దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనసా పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకుని స్నేహితురాలికొక ఉపాయం చెప్పింది. నీ త్రండి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వనప్రాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి, ఏడ్చి మూర్ఛిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీభక్తికి మెచ్చి సైకత లింగాన్ని (ఇసుక) ,(సన్ స్టోన్) చేసుకొని పూజిస్తున్న నీకు నేను ప్రసన్నుడైనాను.

చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని ‘‘హరితాలిక వ్రతం’’ అంటారు. ఆరోజు శివరాత్రివలె ఉపవసించి, రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని “సన్ స్టోన్” లింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి’’ అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు. 16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథులు ముళ్లు వేసి తోరానికి గ్రంథిపూజచేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి.

Sunday, September 9, 2018

వినాయక పత్రిలోని విశేష గుణాలు

వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షంలో హస్త నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది.

వర్షాకాలానికి, చలి కాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో సూక్ష్మజీవులు స్వైరవిహారంచేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికం. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్లనుంచి త్రుంచి వాటిని దేవునికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ, వాటినుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి.

గణపతి పూజావిధాపంలోనే 'పత్రం సమర్పయామి' అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. అదే విధంగా వినాయక చవితి ముందు రోజున 'తదియ గౌరి' వ్రతం గౌరిదేవికి చేస్తారు. ఈ పూజలో గౌరిదేవికి 16 రకాలైన పత్రాలు సమర్పిస్తారు. అందులో ముఖ్యమైనది 'అపామార్గ పత్రం' అంటే ఉత్తరరేణి ఆకు. దానికి ప్రాధాన్యం ఎక్కువ.

జ్యోతిర్‌ వైద్యం ఆధారంగా నక్షత్రాలకు, రాశులకు, గ్రహాలకు ఈ పత్రాలతో అవినాభావ సంబంధముంది. జ్యోతిషంలో ఆకుపచ్చరంగు బుధునిది. ఆకులన్నీ బుధ కారకత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే తత్వాలను పరిశీలిస్తే... అగ్నితత్వానికి రవి, కుజ, గురువు; భూతత్వానికి బుధుడు, వాయుతత్వానికి శని, చంద్ర, శుక్రులు; జలతత్వానికి, పిత్త తత్వానికి రవి, కుజ, గురువు; వాత తత్వానికి శని, కఫానికి చంద్ర శుక్రులుగా శాస్త్రం నిర్వచించినది. అయితే బుధునికి వాత, పిత్త, కఫతత్వం (త్రిగుణం) ఉంది.

ఏకవింశతి 21 పత్రాలు, వాటి పేర్లు, వాటివల్ల దూరమయ్యే రోగాలు, గ్రహకారకత్వాలు .

1. మాచీ పత్రం (దవనం ఆకు) : ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడంద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. వ్రణాలకు, కుష్టువ్యాధికి మందులా పనిచేస్తుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది.

2. బృహతీ పత్రం (నేల మునగ ఆకు) : దీనినే 'వాకుడు ఆకు' అని అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది.

3. బిల్వ పత్రం (మారేడు ఆకు) : దీనికే మరో పేరు 'బిలిబిత్తిరి'. 'త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మపాప సంహారం, ఏక బిల్వం శివార్పణం' అని పూజిస్తాం. బిల్వ పత్రమంటే శివునికి ఎంత ప్రీతికరమో ఈ శ్లోకంద్వారా తెలుస్తోంది. ఈ మారేడు ఆకువల్ల నెమ్మదించే రోగగుణాలను పరిశీలిస్తే... బంక విరోచనాలు కట్టడిపోతాయి. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలైనది. నేత్రసంబంధమైన రుగ్మతలను అరికడుతుంది. శ్రీమహాలక్ష్మి తపస్సువల్ల ఈ వృక్షం జన్మించినదట. మారేడు దళంలో మూడు ఆకులు, ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది.

4. దూర్వాయుగ్మం (గరిక) : చర్మరోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులు నిరోధించడంలో, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్నిస్తుంది. గజ్జిని నియంత్రిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిణి (aఅ్‌ఱ పఱశ్‌ీఱష)లా పనిచేసి మాడ్చేస్తుంది.

5. దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు) : దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగిస్తుంది. ఉదరకోశ వ్యాధులకు, చర్మరోగాలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక సంబంధ సమస్యలకు, గడ్డలు, ప్రణాలకు ఉమ్మెత్త ఆకు చాలా బాగా పనిచేస్తుంది.

6. బదరీ పత్రం (రేగు ఆకు) : జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. వీర్యవృద్ధికి దోహదపడుతుంది. రక్త దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరిచేతుల దురదలు తగ్గుతాయి.

7. అపామార్గ పత్రం (ఉత్తరేణి) : పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు. కడుపు శూల, అజీర్తి, మొలలు, వేడిసెగ గడ్డలు, చర్మపుపొంగుకు ఉత్తరేణి చాలా మంచిది. దీనితో పళ్లు తోముకున్నట్టయితే దంతాలు గట్టిపడతాయి. దీనికే పాపసంహారిణి, రాక్షస సంహారిణి అనికూడా పేర్లున్నాయి.

8. కశ్యపాయ పత్రం (తులసి ఆకు) : ఇందులో చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గు, చర్మరోగాలు, గొంతు సంబంధ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు తగ్గించగలదు. రక్తస్రావాన్ని, అతిసారను అదుపుచేస్తుంది. వాంతులు, కడుపుశూల అరికడుతుంది. విషాన్ని హరించే గుణంకూడా తులసి ఆకులో ఉంది. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. కలియుగ కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పాలి.

9, చూత పత్రం (మామిడి ఆకు) : దీనిని ఏ శుభకార్యమైనా, పర్వదినమైనా గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి. మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కుట్టుకుని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత, చిగుళ్ల బాధలు, పాదాల పగుళ్లు వంటివి మామిడాకుతో నివారించుకోవచ్చు. చక్కెర వ్యాధికి ఉపశమనమిస్తుంది. దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తి కలిగిస్తుంది.

10. కరవీర పత్రం (ఎర్ర గన్నేరు ఆకు) : పేలను నివారించి శిరోజాలకు రక్షణనిస్తుంది. గుండె జబ్బులు, మూత్రవ్యాధులు, కుష్టు రోగం, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కణుతులను కరిగించే గుణం పుష్కలంగా ఉంది.

11. విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి) : జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, రొమ్ము పడిశం, దగ్గు తగ్గించగలదు.

12. దాడిరి పత్రం (దానిమ్మ ఆకు) : రక్తవృద్ధి కలుగజేస్తుంది. పిత్తహరిణి, అతిసార, మలేరియా, ఇతర జ్వరాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను నివారిస్తుంది. పిల్లలకు కడుపులో నులిపురుగులను, నలికెల పాములను చేరనివ్వదు.

13. దేవదారు పత్రం (దేవదారు ఆకు) : జ్ఞానవృద్ధి, జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి. పుండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, విరోచనాలు తగ్గించగలదు. దీని తైలం కళ్లకు చలువనిస్తుంది.

14. మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. దీని నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలనివ్వదు.

15. సిందూర పత్రం (వావిలాకు) : తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టించగలదు. కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది.

16. జాజి పత్రం (జాజి ఆకు) : తలనొప్పి, చర్మవ్యాధులు, నోటి పూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటివాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్లలకు జాజి ఆకు మంచి మందు. జాజికాయ, జాపత్రికి చెందినదీ ఆకు. సన్నజాజి ఆకు కాదు.

17. గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) : ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలుగజేస్తుంది.

18. శమీ పత్రం (జమ్మి ఆకు) : చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి రుగ్మతలనుంచి విముక్తి చూపించి ప్రశాంతతను చేకూరుస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది.

19. అశ్వత్థ పత్రం (రావి ఆకు) : కంటివ్యాధులు, అతిసార, సంభోగ రోగాలు, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్లు, చర్మ రోగాలు, పుండ్లు తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది. జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది.

20. అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు) : దీనిలో నల్లమద్ది ఆకుకూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. వ్రణాలకు, శరీరంలో మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. వాత పిత్త కఫాలకు మంచిది. పితృకర్మలలో వినియోగిస్తారు. దీని రసం రుమాటిజమ్‌ను అరికడుతుంది. నల్లమద్ది ఆకు కడుపులో నులిపురుగులను నివారిస్తుంది.

21. అర్క పత్రం (జిల్లేడు ఆకు) : సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు, చర్మవ్యాధులు, ఉబ్బసం, వాతం, కడుపు శూల వంటి దీర్ఘరోగాలను నివారిస్తుంది. అమిత ఉష్ణతత్వంనుంచి విముక్తి కలిగిస్తుంది. రథసప్తమినాడు ఆత్మకారకుడైన సూర్యభగవానుడి ప్రీతికోసం జిల్లేడు ఆకులను తల, భుజాలపై పెట్టుకుని తలారా స్నానంచేయడం ఆనవాయితీ.

అరటి ఆకులో భోజనం అనేది జీర్ణప్రక్రియలో ఒక భాగం. అలాగే మృష్టాన్న భోజనం అనంతరం తాంబూలం పేరుతో తమలపాకును తినటం జీర్ణప్రక్రియకు ఎంతగానో ఉపయోగం. ఇంకా చర్మవ్యాధులకు, పొంగు, ఆటలమ్మలకు ఈనాటికీ గ్రామాల్లో వేపాకుతో వైద్యం చేస్తారు. దగ్గు, ఉబ్బసంలాంటివాటికి తమలపాకు, సంతానలేమికి రావిచెట్టు ప్రదక్షిణం, విరోచనానికి సునామికాకు, సౌందర్యపోషణలో కలబంద, మునగాకు, వాపులకు వావిలాకు... ఇలా ప్రతి పత్రంలోనూ ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...