Saturday, August 4, 2018

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం

హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలాం|
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం||

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరి, హృదయ
దేవి, శిరోదేవి,శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని,
నిత్యక్లిన్నే, భేరుండే ,వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,శివదూతి, త్వరితే,
కులసుందరి,నిత్యే, నీలపతాకే, విజయే,సర్వమంగళే, జ్వాలామాలిని,
చిత్రే, మహానిత్యే!పరమేశ్వర పరమేశ్వరి,మిత్రేశమయి, షష్ఠీశమయి,
ఉడ్డీశమయి, చర్యానాధమయి,లోపాముద్రామయి, అగస్త్యమయి!
కాలతాపనమయి,ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, దీప కళానాధమయి!
విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి,
మనోజదేవమయి, కల్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి,
శ్రీరామానందమయి!అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే,గరిమాసిద్ధే,
మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, ప్రాప్తిసిద్ధే,
భుక్తిసిద్ధే, ఇచ్చాసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి,
కౌమారి, వ్తెష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి,
సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి,
సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే,
సర్వయోగినే,సర్వత్రిఖండే, త్ర్తెలోక్యమోహనచక్రస్వామిని,
ప్రకటయోగిని!కామాకర్షిణి,ఋద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి,
శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి,గంధాకర్షిణి,
చిత్తాకర్షిణి, ద్తెర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి,
బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి,
సర్వాశాపరిపూరకచక్రస్వామిని, గుప్తయోగిని!అనంగకుసుమే,
అనంగమేఖలే, అనంగమదనే,అనంగమదనాతురే, అనంగరేఖే,
అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, సర్వసంక్షోభణచక్రస్వామిని,
గుప్తతరయోగిని!సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి,
సర్వాహ్లాదిని,సర్వసమ్మోహిని,సర్వస్తంభిని, సర్వజృంభిణి,
సర్వవశంకరి, సర్వరంజని,సర్వోన్మాదిని, సర్వార్ధసాదికే,
సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి,
సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని, సంప్రదాయయోగిని!
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ర్పదే, సర్వప్రియంకరి,
సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని,
సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి,
సర్వసౌభాగ్యదాయిని, సర్వార్ధసాధకచక్రస్వామిని,కుళోత్తీర్ణ
యోగిని! సర్వజ్ఞే ,సర్వశక్తే ,సర్త్వెశ్వర్య ప్రదాయిని,
సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే,
సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి,
సర్వేప్సిత ఫలప్రదే,సర్వరక్షాకరచక్రస్వామిని, నిగర్భయోగిని!
వశిని, కామేశ్వరి, మోదిని, విమలే,అరుణే, జయిని, సర్వేశ్వరి,
కౌళిని,సర్వరోగహరచక్రస్వామిని, రహస్యయోగిని! బాణిని,
చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి,
మహా భగమాలిని సర్వసిద్ధిప్రదచక్రస్వామిని, అతిరహస్యయోగిని!
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామిని,
పరాపరరహస్యయోగిని! త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి,
త్రిపురవాసిని, త్రిపురాశ్రీః, త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే,
త్రిపురాంబ, మహాత్రిపురసుందరి! మహామహేశ్వరి,
మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే,
మహామహానందే,మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా
శ్రీచక్రనగరసామ్రజ్ఞి నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః

|| ఇతి శ్రీవామకేశ్వరతంత్రే,ఊమామహేశ్వరసంవాదే,
శ్రీదేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తం||

జాతకచక్రంలో బాధక స్ధానాల సమగ్ర పరిశీలన

భాదకులు:-చర లగ్నాలకు లాభాదిపతి భాదకుడు అవుతాడు.
స్ధిర లగ్నాలకు భాగ్యాదిపతి భాదకుడు అవుతాడు.
ద్విస్వభావ లగ్నాలకు సప్తమాధిపతి భాదకుడు అవుతాడు.

చరరాశుల రాశ్యాధిపతులు, ద్విస్వభావ రాశుల రాశ్యాదిపతులు, వాటి బాధక స్ధానాధిపతులు పరస్పర శత్రువులు కాబట్టి ఈ రాశుల్లో జన్మించిన వారికి బాధక రాశ్యాధిపతుల దశలు, అంతర్ధశలు యోగించకపోవటం గమనించవచ్చును. ఎటువంటి శుభగ్రహ ప్రభావం లేని బాధక గ్రహాలు తీవ్ర వ్యతిరేక ఫలాలను కల్పించటంతో పాటు మారక నిర్ణయంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

చరలగ్నాలు అయిన మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు వరుసగా మేషరాశికి లాభాధిపతి శని, కర్కాటక రాశికి లాభాధిపతి శుక్రుడు, తులారాశికి లాభాధిపతి సూర్యుడు, మకర రాశికి లాభాధిపతి కుజుడు భాదకులు అవుతారు.

స్ధిర లగ్నాలు అయిన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు వరుసగా వృషభరాశికి భాగ్యాధిపతి శని, సింహరాశికి భాగ్యాధిపతి కుజుడు వృశ్చిక రాశికి భాగ్యాధిపతి చంద్రుడు, కుంభరాశికి భాగ్యాధిపతి శుక్రుడు భాదకులు అవుతారు.

ద్విస్వభావ లగ్నాలు అయిన మిధునం, కన్య, ధనస్సు, మీన రాశులకు వరుసగా మిధున రాశికి సప్తమాధిపతి గురువు, కన్యారాశికి సప్తమాధిపతి గురువు, ధనస్సు రాశికి సప్తమాధిపతి బుధుడు, మీనరాశికి సప్తమాధిపతి బుధుడు భాదకులు అవుతారు.

స్దిర లగ్నాల వారికి భాదకులు పరస్పర మిత్రత్వం కూడా ఉంది కాబట్టి భాద పెట్టి మాత్రమే ఫలితాన్ని ఇస్తారు. ప్రతి లగ్నాలకు లగ్నాదిపతి, పంచమాదిపతి, భాగ్యాదిపతి యోగకారకులు అవుతారు. స్దిర లగ్నాలకు బాగ్యాధిపతి భాదకుడు, యోగకారకుడు కావటం వలన భాద పెట్టి మాత్రమే యోగాన్నిస్తాయి.

భాదక గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో భాదకుడు ఏ భావానికి ఆదిపత్యం వహిస్తున్నాడో, ఏ భావాన్ని చూస్తున్నాడో ఆ భావ కారకత్వాలకు ఇబ్బందులు, బాధ కలుగుతాయి.

బాధక స్ధానాధిపతుల దశాంతర్ధశలు జరుగుతున్నప్పుడు దోషపూరితమైన గోచారం జరుగుతుంటే తీవ్ర వ్యతిరేక ఫలాలు అనుభవించక తప్పదు. అష్టకవర్గు బలం, ఇతరత్రా శుభగ్రహ సంబంధం కలిగినప్పుడు మాత్రం బాధక స్ధానాధిపతులు కొంత తక్కువ స్ధాయిలో దోష ఫలాలను ఇవ్వటం జరుగుతుంది. బాధక గ్రహాలు వివిధ లగ్నాలకు యోగకారక గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలలో ఉన్నప్పుడు కొంత యోగాన్ని ఇస్తున్నప్పటికి దుస్ధానాధిపత్యం పొందిన గ్రహాల నక్షత్రాలలో ఉన్నప్పుడు మాత్రం తీవ్ర వ్యతిరేక ఫలాలను ఇస్తాయి.

బాధకస్ధానాధిపతులు బలమైన యోగాలలో ఉన్నప్పుడు (రాజ యోగం, పంచమహా పురుష యోగం తదితరాలు) ఆ యోగ ఫలాలను బలహీన పరచటం, దుర్యోగాలలో భాగస్వాములుగా ఉన్నప్పుడు దుష్పలితాలను మరింత అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఫలిత నిర్ణయంలో బాధక స్ధానాలలోని గ్రహాలు కీలకమైనవిగా ఉన్నందున వీటి సమగ్ర పరిశీలన తరువాత మాత్రమే సరైన ఫలాలను నిర్ణయించవలసి ఉంటుంది.

Friday, August 3, 2018

వ్యాధిహర వైష్ణవ కవచం

విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః |
హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః ||

మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః |
పాతు నేత్రే వాసుదేవః శ్రోత్రే సంకర్షణ స్తథా ||

ప్రద్యుమ్నః పాతు మే ఘ్రాణం అనిరుద్దో ముఖం మమ |
వనమాలీ గలం పాతు శ్రీవక్షో రక్షతాత్పురః |

పార్శ్వ తు పాతుమే చక్రం వామం దైత్య విదారణమ్‌ ||

దక్షిణం తు గదా దేవీ సర్వాసురనివారిణీ |
ఉదరం ముసలీ పాతు ! వృష్ఠం పాతు చ లాంగలీ ||

ఊరూ రక్షతు శార్గీ మే జరేఘ రక్షతు చర్మకీ |
పాణీ రక్షతు శంఖీ చ పాదౌ మే చరణా పుభౌ ||

వరాహో రక్షతు జలే విషమేషు చ వామనః |
అటవ్యాం నరసింహస్తు సర్వతః పాతు కేశవః ||

హిరణ్య గర్భో భగవాన్‌ హిరణ్యం మే ప్రయచ్ఛతు ! |
సాంఖ్యాచార్యస్తు కపిలో ధాతు సామ్యం కరోతు మే ||

శ్వేతద్వీప నివాసీ చ శ్వేతద్వీపం నయ త్వజః |
సర్వాన్‌ శత్రూన్‌ సూదయతు మధుకైటభ సూదనః ||

వికర్షతు సదా విష్ణుః కిల్బిషం మమ విగ్రహాత్‌ |
హంసో మత్స్యః తథా కూర్మః పాతు మాం సర్వతో దిశమ్‌ ||

త్రివిక్రమస్తు మే దేవః సర్వాన్‌ పాశా న్నికృంతతు ! |
నరనారాయణో దేవో వృద్ధిం పాలయ తాం మమ ||

శేషో೭శేసామలజ్ఞానః కరో త్వజ్ఞాన నాశనమ్‌ |
బడబాముఖో నాశయతు కల్మాషం య స్మయా కృతమ్‌ ||

విద్యాం దదాతు పరమా మశ్వమూర్ధా మమ ప్రభుః |
దత్తాత్రేయః పాలయతు సపుత్ర పశు బాంధవమ్‌ ||

సర్వాన్రోగా న్నాశయతు రామః పరశునా మమ |
రక్షోఘ్నె మే దాశరథిః పాతు నిత్యం మహాభుజః ||

రిపూన్‌ హలేన మే హన్యా ద్రామో యాదవ నందనః |
ప్రలంబ కేశి చాణూర పూతనా కంస నాశనః ||

కృష్ణో యో బాలభావేన స మే కామాన్‌ ప్రయచ్ఛతు |
అంధకారం తమో ఘోరం పురుషం కృష్ణ పింగళమ్‌ ||

పశ్యామి భయ సంతప్తః పాశహస్త మివాంతకమ్‌ |
తతో೭హం పుండరీకాక్ష మచ్యుతం శరణం గతః ||

యోగీశ మతిరూపస్థం శుభ శీతాంశు నిర్మలమ్‌ |
ధన్యో೭హం విజయీ నిత్యం యస్య మే భగవాన్‌ హరి! ||

స్మృత్వా నారాయణం దేవం సర్వోపద్రవ నాశనమ్‌ |
వైష్ణవం కవచం బద్ధ్వా విచరామి మహీ తలే ||

అప్రధృష్యో೭స్మి భూతానాం సర్వ విష్ణు మయోహ్యహమ్‌ |
స్మరణా ద్దేవదేవస్య విష్ణో రమిత తేజసః ||

వివాహ యోగం కోసం "రుక్మిణీ కల్యాణం"

రుక్మిణీ కల్యాణం గ్రంధాన్ని ఈ క్రింద ఉన్న డౌన్‌లోడ్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోగలరు.

భారతీయ వివాహ వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత వుంది ... మరెంతో ప్రత్యేకత వుంది. సంప్రదాయ బద్ధంగా కొనసాగే పెళ్లి పనులు, ప్రాచీనకాలం నుంచి వస్తోన్న ఆచార వ్యవహారాలకు అద్దం పడుతుంటాయి. ఆధునీక నాగరికత కొన్ని పద్ధతులను పక్కకి నెట్టేస్తున్నా, వివాహ వ్యవస్థ మాత్రం నేటికీ తన విశిష్టతను నిలబెట్టుకుంటూనే వుంది. వివాహమనేది స్త్రీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఆ విషయంలో వాళ్లు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు.

ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు రాకపోవడం, వచ్చిన సంబంధాలు నచ్చక పోవడం యువతులను మానసిక వత్తిడికి గురిచేస్తుంటాయి. ఇంకొందరు తమకి సంబంధం నచ్చకపోయినా, పెద్దల మాట కాదనలేక తల వంచవలసి వస్తుంది. ఇలాంటి సందర్భంలో యువతులు తమ దురదృష్టాన్ని నిందించుకుని కుమిలిపోతుంటారు. ఇలాంటి వారిని చూసిన మిగతా వాళ్లు కూడా తమ భవిష్యత్తును తలచుకుని ఆందోళన చెందుతుంటారు. తమ ఆశలకి ... ఆలోచనలకి తగిన వరుడు దొరుకుతాడో లేదోనని సతమతమైపోతుంటారు.

ఈ తరహా యువతులకి పరిష్కార మార్గంగా 'రుక్మిణీ కల్యాణం' పేర్కొనబడుతోంది. సంస్కృతంలో వ్యాసభగవానుడు రచించిన 'శ్రీ భాగవతం'లో రుక్మిణీ కళ్యాణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది. శ్రీ కృష్ణుడిని భర్తగా పొందడానికి ఆమె పడిన ఆరాటం ... ఆమె కోరిక నెరవేరిన తీరు ఎంతో మనోహరంగా వర్ణించడం జరిగింది. సాధారణంగా వివిధ గ్రంధాలను పారాయణం చేయడం వలన ఆయా దైవాల అనుగ్రహం కలుగుతుంది. అలాగే భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చదవడం వలన, యువతులకు వెంటనే వివాహ యోగం కలుగుతుందని చెప్పబడుతోంది.

రుక్మిణీ కల్యాణం చదవడం వలన ... యువతులకు ఇష్టంలేని సంబంధాలు తప్పిపోయి, కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు. అలా జరగడం కోసం వ్యాసభగవానుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించాడు. ఇక అమ్మవారు కూడా తన వివాహ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వారిని ఈ విధంగా అనుగ్రహిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది.

1. ముందుగా శ్రీకృష్ణుని నిత్యపూజచేసి రుక్మిణీ కళ్యాణం పారాయణం ప్రారంభించాలి.
2. శ్రీకృష్ణ నిత్యపూజ చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరము మరియు కృష్ణాష్టకము ఖచ్చితముగా చదవాలి.
3. మీ జన్మనక్షత్రము రోజుగాని, లేదా నామనక్షత్రము రోజుగాని పారాయణ ప్రారంభించండి.
4. వీలయినంతవరకు శుక్రవారం, గురువారాలలో పారాయణ ప్రారంభించండి.
మీకు వివాహము నిశ్చయము కాగానే ఎనిమిదిమంది కన్యలను పిలిచి (శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించి) చందన తాంబూలములతో రుక్మిణీ కళ్యాణం అను పుస్తకమును దానముగా ఇవ్వండి శ్రీకృష్ణుని అనుగ్రహం ఖచ్చితముగా లభిస్తుంది.

Monday, July 30, 2018

ఆహార నియమాలు

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.

ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.

అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమి నాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.

రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకును గాని, పాత్రను గాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.

రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.

రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి వాడకూడదు. ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.

ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు.

ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి. ( అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది )

ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి ( ఘన పదార్ధాలను త్రాగండి అంటారు. అంటే నోటిలోనే సగం నమలబడాలి . అందువలన లాలాజలం పూర్తిగా కలిసి, ముద్దా మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం ( క్షారం ) విరుగుడు గా పనిచేస్తుంది .

ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు?

పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి

అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .

రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే మాత్రం అత్యుత్తమ మైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .

అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||

అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.

Monday, July 23, 2018

గురు పౌర్ణమి

జ్ఞానామృతం పంచే గురు పౌర్ణమి

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం; ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కధ... గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం!

గురువు అంటే:

గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అంటే గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చే యువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.

వేదవ్యాసుని కథ:

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా? శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన కృష్ణ దెై్వపాయనుడే వ్యాసుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు.పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశసా్తల్రు పొందాడు.కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే! భాగవాతాన్ని రచించాడు.

వేదాలను నాలుగు భాగాలుగా విభజించి దైలుడనే శిష్యునికి ఋగ్వేదాన్ని, వైశాంపాయనునికి యజుర్వే దాన్ని; జైమినికి సామవేదాన్ని; సుమంతునికి అధర్వణ వేదాన్ని తెలియజేసి వ్యాప్తి చేయించాడు. తాను వ్రాసిన పురాణాతిహాసాలు సుతునికి చెప్పి ప్రచారం చేయించాడు. పరమేశ్వరుని దయతో వ్యాసునికి పుత్రుడు జన్మించాడు. ఒక రోజు వ్యాసుడు తన ఆశ్రమంలో అరణి మధిస్తుండగా ఘృతాచి అనే అప్సరస కనబడింది. ఆమె అందానికి చలించిన వ్యాసుని వీర్యస్కలనం కాగా అందుండే శుకుడు జన్మించాడు. ఆ బాలునికి వ్యాసుడు దివ్యబోధలు చేసాడు. సృష్టి్ట క్రమం, యుగధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు తెలియజేసి జ్ఙానిగా మార్చాడు.

ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు, చదవలేదు.అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.

పూజా విధానం (వ్యాస పూజ / గురు పూజా విధానం)...

కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు, అత ని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.

ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురు వుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట!వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి.ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.

శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః
అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!

ఆషాఢ పూర్ణిమ ప్రత్యేకతలు...

ఈ రోజు గురు పూర్ణిమతో పాటుగా కోకిలా వ్రతం, మహాషాఢి అని, వ్యాస పూజ, శివశయనోత్సవం, జితేంద్రరాయ జాతర. ఆ, కా, మా, వై పూర్ణిమలో మొదటిదైన ఆషాఢ పూర్ణిమ స్నానం... ఎన్నో వున్నాయి. కోకిలా వ్రతం విచిత్రంగా వుంటుంది, ఈనాడు సాయంకాలం నది స్నానం చేసి తెలకపిండితో కోకిల ప్రతిమ చేసి పూజ చేయాలి. నెల రోజులు పాటు అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరు చేసినా అందమైన భాగస్వామి దొరుకుతాడని అంటారు. కోకిల, తెలకపిండి ప్రధానంగా కావాలి. ఆషాఢంలో తెలకపిండి తీసుకోవాలి, కోకిల వలస వెళ్ళిపోతుంది. కోకిలాదేవి ద్రుపదుని భార్య.

కోకిలా వ్రతం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది

సద్గుణ సంపన్నురాలైన యువతి భార్యగా లభించడం కోసం యువకులు, తల్లిదండ్రులను మరిపించే ప్రేమానురాగాలను అందించే యువకుడిని భర్తగా పొందాలని యువతులు ఆశిస్తుంటారు. వాళ్ల కోరిక నెరవేరాలంటే 'కోకిలా వ్రతం' చేయాలని శాస్త్రం చెబుతోంది.

సాధారణంగా ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర కాస్త గారాబంగా పెరుగుతుంటారు. అంతటి అపురూపంగా పెంచుకున్న తమ కూతురికి ఎలాంటి భర్త లభిస్తాడోనని వాళ్లు ఆందోళన చెందుతుంటారు. ఆమెకి తగిన జోడీని వెతకడంలో తాము పొరపాటు పడకుండా చూడమని దైవాన్ని కోరుతుంటారు.

ఇక యువకుడి విషయానికి వచ్చేసరికి అతని గురించి కూడా తల్లిదండ్రులు అదే విధంగా ఆలోచిస్తూ వుంటారు. తమ తరువాత ఆ కుటుంబాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత కోడలికే వుంటుంది కనుక, ఉత్తమురాలైన అమ్మాయి తమకి కోడలిగా లభించేలా చేయమని దేవుడిని ప్రార్ధిస్తుంటారు. ఎందుకంటే సరైన తోడు దొరక్కపోతే అది ఒక జీవితకాలపు శిక్షగా మిగిలిపోతుందని ఇరు కుటుంబాలవాళ్లు భావిస్తుంటారు.

మరి జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పే వివాహం విషయంలో అంతా మంచే జరగాలంటే ' కోకిలా వ్రతం' చేయాలని శాస్త్రం చెబుతోంది. 'ఆషాఢ శుద్ధ పౌర్ణమి' మొదలు తెలక పిండితో ప్రతిరోజు కోకిల ప్రతిమను తయారుచేస్తూ, నెలరోజులపాటు దానిని పూజించాలనేది ఈ వ్రతం చెబుతోంది. ఈ వ్రతానికి సంబంధించి వివరాలు తెలుసుకుని, నియమబద్ధంగా ఆచరించడం వలన ఆశించిన ప్రయోజనం లభిస్తుంది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...