Sunday, December 9, 2018

రాగి పాత్రలో ప్రత్యేకత

ప్రపంచంలో మనకు కనిపిస్తున్న లోహాలలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అవి దైవానికి ప్రతిరూపాలుగా కూడా చెబుతారు. సువర్ణం ఈశ్వర సంబంధమైనది. తామ్రం విష్ణు సంబంధమైనది. తామ్రం (రాగి) విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. బంగారము, వెండి, కంచు లాంటి ఇతర లోహాలు ఎన్ని ఉన్నా రాగి అన్నా, రాగితో చేసిన పాత్రలన్నా శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనవి అనే విషయాన్ని రుజువు చేస్తోంది వరాహపురాణం. ఈ పురాణంలోని నూట అరవై ఎనిమిదో అధ్యాయంలో సాక్షాత్తూ వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువే భూదేవికి ఈ విషయాన్ని వివరించాడు.

భూదేవి ఓ రోజున శ్రీమహావిష్ణువును ఏ పాత్రలో నైవేద్యం పెడితే ఆయనకు ఇష్టమో చెప్పమని కోరింది. అప్పుడు ఆయన చాలామంది తనకు బంగారు, వెండి, కంచు పాత్రలలో నైవేద్యం పెడుతుంటారని, కానీ తనకు రాగి పాత్ర అంటేనే ఎంతో ఇష్టమని చెప్పాడు. దానికి ఓ కారణం ఉందని కూడా వివరించాడు.

పూర్వం రాక్షసులలో గూడాకేశుడు అనే ఓ రాక్షసుడుండేవాడు. అతడు రాక్షసుడైనా దుర్మార్గపు బుద్ధి లేకుండా దైవచింతనతో ప్రవర్తిస్తూ శ్రీమహావిష్ణువునే నిరంతరం ఆరాధిస్తూ ఉండేవాడు. అలా ధర్మకాముడై నిశ్చలబుద్ధితో పదహారు వేల సంవత్సరాలపాటు గూడాకేశుడు విష్ణువు గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఏమికావాలో కోరుకోమన్నాడు. అప్పుడా అసురుడు తనకు వేరే ఏమీ అక్కరలేదని వేల జన్మల పాటు విష్ణుభక్తి తనకు ఉండేలా అనుగ్రహించమన్నాడు. అంతేకాక శ్రీమహావిష్ణువు విడిచిన చక్రం వల్ల తనకు మరణం కలగాలని అప్పుడు తన శరీరమంతా రాగి లోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. ఆ పరిశుద్ధమైన లోహంతో తయారైన పాత్రలో ప్రతినిత్యం శ్రీమహావిష్ణువుకు నైవేద్యం అందేలా వరమివ్వమని గూడాకేశుడు విష్ణువును ప్రార్థించాడు. గూడాకేశుడిని విష్ణువు అలాగేనని అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. ఆ తరువాత కూడా ఆ రాక్షసుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు.

వైశాఖశుద్ధ ద్వాదశినాడు శ్రీమహావిష్ణువు ఆ అసురుడి కోరిక తీర్చాలనుకున్నాడు. గూడాకేశుడు కూడా తనకు అంతటి భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నాడు. అతడిలోని నిర్మలభక్తికి మెచ్చిన విష్ణువు వైశాఖ శుద్ధ ద్వాదశినాడు సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తున్న సమయంలో విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించాడు. వెంటనే అది అతడిని ఖండించింది. అతడి మాంసమంతా తామ్రం అయింది. అతడి శరీరంలోని అస్థులు వెండి అయ్యాయి. మలినాలు కంచులోహంగా అయ్యాయి. తనను జీవితాంతం అలా స్మరిస్తూ ఉన్న భక్తుడి కోరికను తీర్చాడు విష్ణువు. గూడాకేశుడి శరీరంనుంచి ఏర్పడిన తామ్ర లోహంతో ఒక పాత్ర తయారయింది. ఆ పాత్రలో పెట్టిన నైవేద్యమంటే విష్ణువుకు మహా ప్రీతికరమైంది. ఆ తరువాత తరువాత భక్తులెవరైనా రాగిపాత్రలో పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే విష్ణువు ఆనందంతో స్వీకరించసాగాడు.

రాగి పాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలపాటు ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు తన లోకంలో ఉండగలడని శ్రీమహావిష్ణువు భూదేవితో చెప్పాడు. రాగి లోహాన్ని గురించి విశేషంగా చెప్పిన కథ ఇది. ఆరోగ్య శాస్త్ర రిత్యా పరిశీలించి చూసినా రాత్రి పూట రాగిపాత్రలో పోసివుంచిన నీటిని ఉదయాన్నే లేవగానే తాగిన వారికి రక్తశుద్ధి జరుగుతుందని, ఆరోగ్యకరంగా ఉంటుందని ఈనాడు కూడా అనుభవజ్ఞులెందరెందరో చెబుతున్నారు.

మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. అటులే ముక్కు రంధ్రములను 300 మీ.లీ. నీటిని పీల్చి శుభ్రము చెసుకొన వలయును. ఈ విధముగా చేయుట వలన పడిశం, తుమ్ములు, దగ్గు, ముక్కులో వచ్చే వ్యాధులు తగ్గును. ఈ క్రియను యోగ, ప్రకృతి చికిత్సల్లో నేటికినీ చేయుచున్నారు వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా తామ్రలోహం ఇతర లోహాల కన్నా ఎంతో విశిష్టమైనదని పురాణ వాజ్ఞ్మయం పేర్కొంటోంది.

Written by_ 
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

కర్ణవేధ' చెవులు కుట్టించుకోవడం..?


చెవులం అనగా 'కర్ణవేధ' అను విశేషార్థం కలదు. కర్ణవేధ అనగా చెవులను పోటుతో వేధించడం. చెడు మాటలు విన్నప్పుడల్లా ఆ పోటు గుర్తుకు రావాలి అని అంతరార్థం. కర్ణవేధ చేయించినపుడు పురోహితుడు 'మాశృణు పాప్నానం, మాశ్రావయ పాప్నానం మోచ్ఛారయ పాప్నానం మాచర పాప్నానం మాపశ్య పాప్నానాం' అని చెవిలో చెప్పి బంగారుతీగను ఈ మంత్రంతో ప్రోక్షించి మొదట దైవానికి పురోహితునికి అర్పించి కంసాలికి ఇచ్చి చెవులు కట్టించెదరు.

చెవులు కుట్టించుకోవడం ఆడవాళ్లకు చెందిన వ్యవహారం అని, ఇది అందం కోసం పుట్టిన సంప్రదాయం అని చాలా మంది అను కుంటారు. నిజానికి చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్ళకు మాత్రమే చెందిన వ్యవహారం కాదు. అసలిది కేవలం అందం కోసం పుట్టిన సంప్రదాయం అంతకంటే కాదు.
చెవులు కుట్టించుకోవడం వల్ల చెవుడు రాదు. చెవికి, కంటికి సంబంధం ఉందని మనకు తెలుసు. చెవులు కుట్టించుకోవడం వల్ల కంటిచూపు బాగుపడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. మొదట కంటిచూపును మెరుగుపరచుకోవడం కోసమే చెవులు కుట్టించుకోవడం అనే సంప్రదాయం ఏర్పడింది. అలా చెవులకు రంధల్రు అయిన తర్వాత వాటికి ఆభరణాలను పెట్టుకోవడం అనే ఆచారం ఆరంభమయింది. అందువల్లనే పూర్వం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చెవులు కుట్టిం చుకునేవారు. ఎక్కువ మంది చెవికి అడుగుభాగంలో కుట్టించుకుంటారు. మరికొందరు చెవికి క్రింది భాగంలోనే కాకుండా పైన, పక్కన అనేక భాగాల్లో కూడా కుట్టించుకుంటారు. ఇంకొందరు ముక్కుకు రంధం పెట్టించుకుంటారు. 'ఇవన్నీ కూడా ఆరోగ్య రీత్యా ఏర్పడిన సంప్రదాయాలే.
ఆయుర్వేదం, హౌమియోపతి, అలోపతి ల్లాగే ఆక్యుపంక్చర్ ఒక వైద్య విధానం. అయితే ఈ పేరుతో, ప్రస్తుత పద్ధతిలో కాకున్నా పూర్వం ఎప్పుడో ఈ రకమైన చికిత్స ఉండేది. అందులో భాగమే చెవులు, ముక్కు కుట్టించుకునే పద్ధతి. ఇంకా లోతుగా చెప్పాలంటే... చెవికి, కళ్ళు, ముక్కు, పళ్ళులాంటి ఇతర అవయవాలతోనూ సంబంధం వుంది. ముఖంలోని అనేక ఇతర అవయవాలకు చెవి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుకనే పన్ను పీకేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా వినికిడి శక్తి తగ్గుతుంది.
ఒక్కోసారి విషజ్వరం లాంటి అనారోగ్యాలు సోకినప్పుడు చెవికి ఇబ్బంది కలుగుతుంది. కొందరికి కొంత వినికిడి శక్తి తగ్గవచ్చు. ఇంకొందరికి బ్రహ్మచెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవులు కుట్టించుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉబ్బసం, మూర్చ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను చెవులు కుట్టడం ద్వారా నివారించవచ్చు. శరీరంలోని ఇతర అవయవాలకు, చెవికి ఇంత అవినా భావ సంబంధం ఉంది కనుకనే పూర్వం స్త్రీ,పురుషులందరూ చెవి కుట్టించుకునేవారు. అలా చెవి కుట్టించుకోవడం అనేది ఆరోగ్యం కోసం మొదలై, అందచందాలు తీసుకొ స్తోంది. ఆరోగ్యం కోసం చెవులు కుట్టించు కోవడం మొదలయ్యాక బంగారం, రాగి లాంటి లోహాలతో చెవి దుద్దులు, లోలకులు తయారు చేయించుకుని ధరిస్తున్నారు.
Written by_ 
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

మార్గశిర లక్ష్మీవార వ్రతం


‘మార్గశీర్ష’ మాసము ఒక విలక్షణమైన మాసము. ‘మార్గశీర్షము’ అంటేనే మార్గములందు శ్రేష్ఠమైనది. ఉపయోగకరమైనదని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తిమార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గములన్నింటికన్నా ప్రధానమైనది, ప్రాముఖ్యతతోపాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది.

శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం.

‘‘బృహత్సామ తథాసామ్నాం- గాయత్రీ ఛందసా మహం- మాసానాం మార్గశీర్షోహ- ఋతూనాంకుసుమాకరం’

అనే శ్లోకంలో మార్గశీర్గాన్నీ నేనే, ఆరు ఋతువులలోనూ పుష్పసౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది.

మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం.
ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణువుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః’ ఓ నమో నారాయణయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.

మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీని పూజిస్తూ ‘‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’’ చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ మాసంలో లవణం దానం చేయటం, ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి.

చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలం గా లేక పొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గం లో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు.ప్రాతః కాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది.

మాసానాం మార్గశీర్షోసాం (మాసాలలో మార్గశిర మాసాన్ని నేను) అని శ్రీకృష్ణుడు 'భగవద్గీత-విభూతియోగం'లో చెప్పాడు. మార్గశిరమాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించే ఆచారం ఉంది.లక్ష్మీ ఆరాధనవల్లనే గురువారాన్ని లక్ష్మివారం అని అంటారు.జ్యోతిషార్థంలో సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అనీ, చాంద్రమానం ప్రకారం మార్గశిరమాసం అనీ అన్నారు.ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం. ఈ మాసంలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, పెరుగు మొదలైనవి .ఈ కాలంలో క్షారగుణాన్ని హరించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి గనుక, ఆహారపదార్థాలలోను, దేవతా సంబంధమైన నైవేద్యాలలోను విరివిగా వాడతారు. ఇవన్నీ ఔషధ విలువలున్నవే! దేహానికి ఉష్ణశక్తిని కలిగించేవే!

మార్గశిర మాస పూజలో లక్ష్మీవారంనాడు తలకు నూనె పెట్టుకోరాదని, బియ్యం ఇచ్చి ఏమీ కొనరాదని నియమాలుంచారు.మృగ శిరతో కూడిన పూర్ణిమ (మార్గశీర్షమున) లవణదానం చేయాలి.ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి మహావిష్ణువును విష్ణుసహస్రనామముతో ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవశించి మహావిష్ణువును ప్రార్థించినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

Monday, December 3, 2018

మారుతీరావు విషయం గురించి మీ అభిప్రాయం ఏవిటీ అని నన్ను ముగ్గురు అడిగారు


నా అభిప్రాయం కూడా మీకు నచ్చకపోవచ్చు. తప్పుగా వుండచ్చు. అప్పుడు నాకు తెలియచెయ్యండి. బ్లాక్ చేసి వెళ్ళిపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది కనక.
.
నా అభిప్రాయం చెప్పే ముందు ఎందరో తల్లి తండ్రులు నిజాయితీగా ఆవేదనతో వెలిబుచ్చుతున్న అభిప్రాయాలను గమనించాను. చాలా జాగ్రత్తగా  చూశాను.
.
మారుతీరావుగారిని సమర్ధించేవాళ్ళల్లో అత్యధిక సంఖ్యాకులు కూడా అతను చేసిన హత్యను ఖండిస్తూ వారు కూడా అది మూర్ఖమైన చర్యే అంటున్నారు.
అయితే ఆ కుర్రవాడిది కుత్సితమైన చర్య అంటున్నారు, ఆ అమ్మాయి గ్రహించలేక మాట్లాడుతోంది అంటున్నారు.
.
ఏది మంచి మనసుతో చేస్తున్నారో ఏది కుత్సితమైన బుద్దితో చేస్తున్నారో ప్రేమలోనో మోహంలోనో వున్న ఏ అబ్బాయికైనా ఏ అమ్మాయికైనా ముందే తెలిసిపోతుందా??
నచ్చిన బొమ్మతో ఆడుకుంటున్న పసిపాపకి దాని చేతుల్లోంచి
ఆ బొమ్మని లాగి పారేస్తే ఆ పసిబిడ్డ ఏడవకా తనకు వచ్చిన కోపంతో తిట్టకా ఏం చేస్తుంది?
పోనీ ఎంతగానో ఎదిగాము అనుకుంటున్న మనం, ఎంతో ఇష్టంగా చేస్తున్న మనం ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఎవరైనా వద్దని చెప్పినా ఒక్కసారిగా మూసెయ్యమని చెపితే మనం వింటామా? 
.
రైతుకు ఏ విత్తనం చూస్తే ఏ మొక్క వస్తుందో తెలుస్తుంది. మీకూ నాకూ తెలియదు కదా.? అతను జీవితంలో అనుభవం సంపాదించడం వల్ల అలా చెప్పగలిగాడు.
ఒక చిన్నపిల్లవాడు ఇసకలో కూర్చుని గుళ్లు కట్టుకుంటాడు ఎంతో ఆనందిస్తూ..... ఆ గుడిని ఆ గుళ్ళూ గోపురాలూ ఇళ్ళూ  కట్టుకుంటూ దాన్లో ఓ అద్బుతమైన ఆనందాన్ని అనుభవిస్తుంటే... ఆ గుడినీ ఈ పెద్దాళ్ళు ఎవరైనా కాళ్ళతో తొక్కిపారేసి, 
"నీ కోసం పెద్ద ఇల్లు కట్టాను దాంట్లో  ఏసిలు పెట్టించాను ఇందులో నువ్వు ఉండు. ఇందులోనే ఆనందించాలి.
"ఎక్కడికీ వెళ్ళకూడదు... వెళ్టే ఏక్సిడెంట్లు అవుతాయి.
సైకిలెక్కకు మోకాళ్ళు పగులుతాయి.
చెట్టెక్కకు కింద పడితే తల పగిల్తుంది. 
వర్షంలో కెళ్ళకు తడిస్తే జలుబు చేస్తుంది. పిడుగులు పడితే చచ్చి పోతావ్.
ఇందులోనే వుండు ఈ గదిలోనే ఈ ఏసి గదిలోనే వుండు వీడితోనే ఆడుకోవాలి అని వీటితోనే ఆనందించు" ....
అంటే వాడికా ఇల్లు జైల్లా కనిపించి కొద్ది రోజుల్లో పిచ్చిలేస్తుంది
మరి కొద్ది రోజుల్లో ఆకాశం భూమీ కనిపిస్తే చాలని...
ముష్టి వాడిలా అందరికాళ్లూ పట్టుకుంటాడు.
.
పిల్లల్ల్ని ప్రేమించడం అంటే వాళ్ళని ఎగరేసి ఎత్తుకోవడం, వాళ్ళు నవ్వితే మనం నవ్వడం, వాళ్ళ మలమూత్రాలు తియ్యడం, తియ్యించడం కాదు.
వాళ్ళ తెలివి అతి తెలివీనీ వాళ్ళ జ్ఞానాన్నీ అజ్ఞానాన్ని కూడా క్షమించాలి క్షమించగలగాలి.క్షమించి తీరాలి.
ఇంకా చెప్పాలంటే క్షమించడం కాదు అర్థం చేసుకోవాలి.
క్షమించడానికి మనలో మాత్రం ఏం గొప్పతనం ఉందనీ. మనం కూడా వాళ్ళు ఉన్న దశ దాటి వచ్చాకే కదా కొన్ని సంగతులు వాటి లోతూ తెలుసుకున్నదీ.
పైగా పిల్లల్నిప్రేమ లవ్ ఆర్ లస్ట్ ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు మాత్రం పొరపాటున కూడ కొట్టకూడదు.
మనకు మాత్రం కామవాంచలు రాలేదా?
వివేకనందస్వామి అంతటి వ్యక్తి, మహాత్మాగాంధీ కి
రాముడికి కృష్టుడికి వీరందరికీ మాత్రం కామవాంచలు రాలేదా?
ఏ కామ వంఛాలేకుండానే మరొక స్త్రీతో జతకట్టారా?
.
మనం మన అబ్బాయి అలా ఒక అమ్మాయితో ప్రేమలో పడి మనకే ఎదురు తిరగడాన్ని, మనల్ని వదిలేసి వెళ్ళిపోవడాన్ని అరక్షణం ఊహించుకోవడానికి కూడా ఇష్టపడం.
అడ్డంగా మా పిల్లలు అలా చెయ్యరు అనుకుంటాం.
.
నిజానికి ఏ తప్పు చెయ్యని వాళ్ళని ఏ పొరపాటు ఆలోచనా రాని వాళ్ళు ఇంతవరకూ ఈ సృష్టిలోనే లేరుఉంటారా?.
కాసేపు అతను డబ్బుకోసం ఆశపడి ఆమెను ప్రేమించినట్టు నటించాడే అనుకుందాం. 
అలా మనం మాత్రం మన ఉద్యోగ వ్యాపారాల్లో మనకు ఏమీ తెలియని  ఇతరులతో  పై అధికారులతో డబ్బూ అధికారం ఉందని తెలిసిన వాళ్ళతో తెలిసి తెలిసీ లంచగొండి పోలీసు కానిస్తేబుల్స్ తో మర్యాద ఉన్నట్టు  మాట్లాడడం లేదా? నటించడం లేదా?
మనలోని నటనను లౌక్యం అనో వినయం అనో మన ఆశను మన కుటుంబంలోని పిల్లల మీద ప్రేమగానో మార్చి చెప్పుకుంటాం.
కానీ ప్రతి పిల్లవాడు ప్రతి యవ్వనంలోకి వచ్చిన ప్రతి యువతీ ఏదో ఒకరోజు కామవాంచలకు గురౌతారు అంత మాత్రాన అది క్షమించరాని తప్పు అయిపోతుందా?
.
అయినా ఏ పిల్లలైనా ఏ ఇంట్లో అయినా అడిగారా మనల్ని? నాన్నా అమ్మా మాకు కోట్లకు కోట్ల రూపాయలూ రత్నాలు వజ్రాలూ ఇవ్వండీ మేము ఆనందంగా జీవిస్తాం అని - అడగలేదు కదా..
నిజంగా సుఖంగా జీవించడానికి ఇవన్నీ అవసరమా? మన మాట వినకపోతే మనకు నచ్చినదే మన పిల్లలకూ నచ్చాలన్న సూత్రమేదైనా ఉందా? ఈ ప్రపంచంలోకానీ ప్రకృతిలోకానీ ఉందా?
మన పిల్లవాడు ఒక బొమ్మతో ఆడుకుని కాసేపాగి మరో బొమ్మతో ఆడుకుంటాడు. ఆ తరవాత అసలు బొమ్మలతో ఆడుకోవడమే మానేస్తాడు.

మన అహాన్ని మన అంతస్తుల్లో చూపించుకోవడానికీ  ఇతరులకన్నా మనం ఎక్కువ అంటూ చుట్టూ వున్నవారిపై ఆధిపత్యం ప్రదర్శించడానికి గొప్పలు చెప్పుకోవడానికి డప్పాలు కొట్టుకోవడానికి.
మనం అర్థం లేకుండా డబ్బులు సంపాదిస్తూ...
మనం మన పిల్లల్నేదో చాలా ప్రేమతో సరిగ్గా పెంచుతున్నామనుకుంటే ఎలా?
.
డబ్బులో అధికారంలో వున్న అంతస్థులను ఆశ అత్యాశలనూ ఎంతో క్రమబద్దంగా నేర్పుతూ పిల్లల్నిపెంచడం కొన్ని రాచరికపు కుటుంబాల్లో చేస్తూ వుంటారు. అది తప్పో రైటో నాకు తెలియదు. వాళ్ళు ఒక అత్యున్నత అధికారం ఉన్నవ్యక్తికి బాధ్యతలు నేర్పించడం అని చెప్పడం విన్నాను
.
కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
మనం మొదట ఆస్తుల్లో వున్న అంతస్తులనీ
మన పిల్లలకు నేర్పడం కన్నా మానవత్వంలో జ్ఞానంలో వున్న అంతస్తులను మన పిల్లలకు చూపించి నేర్పాలి. .
కానీ మనకు అంత టైమ్ లేదంటాం. అయినా వాళ్ళకి ఆ జ్ఞానమంతా ఎవరో ఇచ్చెయ్యాలీ అనుకుంటాం.
పైగా మీ కోసమే కదా సంపాదిస్తున్నాం అంటాం.
.
కాసేపు కూర్చుని వినే లక్షణం మనలో వుండాలి. 
ఆ తత్వం ముందు మనం అలవాటు చేసుకుని ఉండాలి.
తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఉన్నట్టుండి నీతులు చెప్తే వినడానికి పిల్లలు కూడా అమాయకులేం కాదు కదా.
.
అంత చిన్నవయసులో ఆడైనా మగైనా ఎలాంటి యువకులకైనా ఆకర్షణ కలగడం చాలా చాలా సహజం. దాన్ని ప్రేమతో పిల్లలకి తెలియచెప్పడం మానేసి అవతలి వాళ్ళని చంపెయ్యడానికి పూనుకుంటే అలా చెయ్యడం ఏ తండ్రి చేసినా కరెక్టే అయితే
ఈ లోకంలో హార్మోॐలు ప్రవేశించి వయసులోకి వచ్చిన  యువతీ యువకులందర్నీ వరసపెట్తి చంపెయ్యాల్సి వస్తుంది. అతనిది ఆలోచన ఎంత బుద్ది హీనమైన ఆలోచన. పైగా ఇది లోకానికి గుణపాఠమా? వినడానికి కూడా జుగుప్సగా వుంది.
 నిజానికి మనువు కూడా ఎక్కడా ఇలాంటి నీచాతి నీచమైన మాటలు శిక్షలు  చెప్పలేదు.విధించమని అనలేదూ..  - Written by_ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

ఘంటసాల జయంతి సందర్భంగా అయన గురించి కొన్ని విశేషాలు




బాల్యం

ఘంటసాల 1922 డిసెంబర్ 4 న గుడివాడసమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఆయన ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో ఆయన సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు.

సంగీత సాధన

తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. రెండేళ్ళ కాలంలో ఒకఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొనవలసి వచ్చింది. ఆలస్యమైనా తనతప్పు తెలుసుకొన్న ఘంటసాల తనదగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు.

విజయనగరం చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది. ఆ కళాశాల ప్రిన్సిపాల్దగ్గరకువెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా తోటివిద్యార్థులు చేసినతప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువంటే ఆయనే అనిచెప్పేవాడు.

శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం(ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడు. మిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒకడబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవాడు.

వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. శాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసాడు. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకుచేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు. 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.

సినీ ప్రస్థానం

1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.

సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తనమకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమలోమొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.

తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాలచిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.

కీలుగుర్రం సినిమాలో ఘంటసాల ప్లేబాక్ పాడిన కాదు సుమా కల కాదు సుమా పాట

విజయ విహారం

1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెపుతుంటారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే! ఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.

చివరిదశ

1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలోప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు.

అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

వ్యక్తిత్వం

ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు.

"నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నోసార్లు చెప్పేవాడు.

మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.

పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు.

సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు

వ. నా. సం. కు. శ.

మంగళ చండీ స్తోత్రం

కుజగ్రహ దోష నివారణకు "మంగళ చండీ స్తోత్రం"

ప్రధానాంశ స్వరూపా యా దేవీ మంగళ చండికా ||

ప్రకృతేర్ముఖసంభూతా సర్వమంగళదా సదా |
సృష్టౌ మంగళరూపాచ సంహారే కోపరూపిణీ ||

తేన మంగళ చండీ సా పండితైః పరికీర్తితా |
ప్రతిమంగళవారేషు ప్రతివిశ్వేషు పూజితా ||

పంచోపచారైర్భక్త్యా చ యోషిద్భిః పరిపూజితా |
పుత్రపౌత్ర ధనైశ్వర్య యశోమంగళ దాయినీ ||

శోక సంతాప పాపార్తి దుఃఖ దారిద్ర నాశినీ |
పరితుష్టా సర్వవాంఛాప్రదాత్రీ సర్వయోషితాం ||

రుష్టా క్షణేన సంహర్తుం శక్తా విశ్వం మహేశ్వరీ |

"ప్రకృతి' దేవియొక్క మరొక ప్రధానాంశము ఆమె ముఖమునుండి పుట్టిన మంగళచండిక, ఆమె సమస్త మంగళములను తన భక్తుల కిచ్చును. ఆమె సృష్టి జరుగునప్పుడు మంగళ స్వరూపిణిగా సంహారసమయమున చండీ స్వరూపిణిగా కనిపించుచున్నందువలన మంగళ చండియని కీర్తింపబడుచున్నది. ఆమె సమస్తలోకములలో ప్రతి మంగళవారము స్త్రీలచే పంచోపచారములచే పూజింపబడుచున్నది. ఆమె తనను పూజించువారికి పుత్రపౌత్ర ధనైశ్వర్యములను, కీర్తిని, సంతోషమును ఇచ్చును. అట్లే వారికి శోకము, సంతాపము, ఆర్తి, దుఃఖము, దారిద్ర్యము,పాపములు కలుగనివ్వదు. ఆమె సంతుష్ఠురాలైనచో స్త్రీలందరకు అన్ని కోరకలు తీర్చును. కోపగించినచో క్షణములో సమస్త ప్రపంచమును సంహరించును.

ప్రకృతి ప్రధానాంశ రూపమంగళ చండికాదేవి. ఈమె నేలపై నీటిపై నంత రిక్షుమున పిల్లలున్నచోట నుండి మంగళము గల్గించుచుండును. ఈమె ప్రకృతి ముఖము నుండి యుద్భవించెను. సర్వమంగళ రూపమున సంహారమున కోపముగనుండు దేవి. అందుచే పండితులీమెను మంగళ చండిక యని పిలుతురు. ఈమె ప్రతి మంగళవారమున ఎల్ల జగము లందు పూజింపబడుచుండును. ఈమె ప్రసన్నురాలైనచో స్త్రీలకు పుత్ర పౌత్ర ధనైశ్వర్య యశో మంగళములను ప్రసాదించును. స్త్రీలకోర్కె లన్నియును దీర్చగలదు. 

త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతిపోవటంతోపాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజ విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.

మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు.

శత్రు పీడలు,ఋణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ,కోర్టు సమస్యలు,సంసారంలో గొడవలు,అనారోగ్య సమస్యలు,కోపం,అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది.

మంగళ చండీ స్తోత్రం

రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే.

Sunday, December 2, 2018

పురోహితునికి భార్యవ్వడం భగవత్‌సంకల్పం



" వద్దు మమ్మీ.. ఎన్నిసార్లు చెప్పాలి? ? "
" మళ్ళీ ఆలోచించమ్మా.. అబ్బాయికి ఏ దురలవాట్లూ లేవు.. "
" ఐతే? "
" మంచి కుటుంబం, సొంత ఇల్లు, కళ్ళెదుటే ఉంటారు. సంఘంలో మంచి గౌరవస్థులు.. "
" అబ్బా..ఎన్నిసార్లు చెప్తావ్ అరిగిపోయిన రికార్డులా.. ఆపంచె, నామాలూ..ఉఫ్ఫ్..
" అదికాదమ్మా, మీరిద్దరూ ఈడూజోడూ బావుందని మన సిద్ధాంతిగారు చెప్పారు జాతకాలు చూసి.. "
" ఛ..మీరు మారరా? జాతకాలట జాతకాలు.. "
" అదేంటమ్మా అలా అంటావు? సంబంధం నచ్చకపోతే వదిలేయ్, సంప్రదాయాలను దూషించకు. "
" మీ ఛాదస్తం మీదిలే. న్యూజెర్సీ సంబంధమే ఖాయం చేయండి. ఇదే ఫైనల్. "
" అంతదూరం పంపాలంటే బాధగా ఉందిరా.. "
" నేను బావుండాలా? హ్యాపీగా ఉండాలా? లేదా ఆ పూజారితో పొద్దున్నే మడికట్టుకొని పూజలు చేసుకోవాలా? "
" వద్దులేమ్మా.. నీ ఆనందమే మాక్కావాలి. వాళ్ళతో మాట్లాడమంటా మీ నాన్నని. అనవసరంగా ఆ అబ్బాయిని ఏమనొద్దు. మంచివాడు పాపం. "
" సరే.. ఆపనిలో ఉండండి.  "
" ఏమందండీ మీ అమ్మాయి? ఒప్పుకుందా ఒదినగారూ? "
" లేదు వదినగారూ.. మీ అబ్బాయిని చేసుకోడానికి ససేమిరా అంటోంది "
" అయ్యో మావాడికేమిటమ్మా తక్కువ? " రోజూ ఆలయానికొస్తూంటారు కదా.. ఏవైనా అవలక్షణాలున్నాయా? పైగా వేదం కూడా చదివాడు "
" ఎంతమాట వదినగారూ..మీ అబ్బాయికి పేరుపెట్టడం అంటేనే మహా పాపం.. మాకే అదృష్టం లేదనుకుంటాను. అమెరికాసంబంధమేకావాలట మాదానికి "
" సరేలేమ్మా, పిల్లల మనస్సు నొప్పించకూడదు. కలిసిబ్రతకాల్సింది వాళ్ళు. ఇంక మీ అమ్మాయిని బలవంతపెట్టకండి. "

... ... ...

" ఏమ్మా ఎమయ్యింది ? "
" నువ్వు నచ్చావు, నీ పద్ధతులు నచ్చాయి కానీ నీ వృత్తే నచ్చలేదట.. "
" అర్ధమయ్యినమ్మా. దిగులుపడకు. నాకు ముందే తెలుసు. ఆ అమ్మాయి చులకనభావన "
" బాధపడకురా. ఇంతకంటే మంచి సంబంధం తీసుకొస్తాను అన్నాడు పేరయ్య "
" మంచి సంబంధం కాదమ్మా, మంచి అమ్మాయి ఐతే చాలు. నీతో కలిసిపోయి ఉండగలిగితే చాలు.

... ... ...

" అన్నీ సర్దుకున్నావా? మళ్ళీ సంవత్సరం దాకా రావాయె. అల్లుడు పెళ్ళవ్వగానే మరుసటిరోజేవెళ్ళిపోయాడు.. పట్టుమని పదిరోజులు కూడా లేడు "
" మమ్మీ, పెద్ద జాబ్. ఊపిరిసలపని పని. ఇదేమైనా గుడి ఊడ్చే పని అనుకున్నావా? శెలవుదొరకడమే పెద్ద విషయం ఆయనకి "
" సర్లేమ్మా.. మళ్ళీ ఆ సంబంధాన్ని దెప్పడం ఎందుకు? ఐనా మంచి పిల్ల వాళ్ళ చుట్టాల్లోనే చూసి చేసేసారు పోయిన వారం. చిలకాగోరువంకల్లాగున్నారు జంట.
" వాటెవర్. క్యాబ్ వచ్చేసింది. ఏడవకు. నేనేమీ జైలుకి పోవట్లేదు. జస్ట్ అమెరికా అంతే. స్కైప్ లో రోజూ మాట్లాడుతూంటాకదా.. వెళ్ళొస్తా మమ్మీ, వెళ్ళొస్తా డాడీ.. "

... ... ...

" ఏమోయ్.. ఏంటి దిగాలుగా ఉన్నావు ? "
" నేనొచ్చి అప్పుడే రెండేళ్ళైపోతోందండీ..సెలవుకు సీరియస్ గా ప్రయత్నించండి.  మా చెల్లాయ్ పెళ్ళ్కి రెండునెలలముందైనా లేకపోతే ఎలా? "
" చూస్తున్నావు కదా.. ఆదివారాలు కూడా వెళ్ళాల్సొస్తోంది. ఉదయం ఆరింటికి బయల్దేరితే ఆరింటికి ఇంటికొస్తున్నాను. తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సెలవు దొరకట్లేదు "
" అదేంటండీ.. ఏడెనిమిది నెలలనుంచీ ఇదే చెప్తున్నారు. ఒంటరిగా ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతోంది. ఇండియా చాలా మిస్సౌతున్నాను. "
" సరేలే. ఒక నెలముందు నువ్వెళ్ళు. సెలవు దొరకకపోతే ఒక వారమైనా ఎమర్జెన్సీ లీవు పెట్టుకొని పెళ్ళికొస్తాను. ఫ్రెష్ అవ్వు, గుడికెళ్దాం. మా బాసు, వాళ్ళావిడా రమ్మన్నారు "
" ఎప్పుడో సంక్రాంతికి వెళ్ళాము. మళ్ళీ దీపావళి వచ్చేసింది. మీ బాసు పుణ్యమా అని ఇన్నాళ్ళకి వెళ్తున్నాం. మా పుట్టింట్లో ఉన్నప్పుడు ఇంటిపక్కనే గుడి. రోజూ వెళ్ళేవాళ్ళం "
" నువ్వు రెడీ అయ్యి గుడికి పక్కింటావిడతో వచ్చేయ్ ఎప్పటిలా.. నేను పూజా సామాన్లు షాపింగ్ చేసి గుడికి వచ్చేస్తాను. టైం లేదు మళ్ళీ మధ్యలో ఆగి షాపింగ్ చేయడానికి.

" అరే..ఇతను ఇక్కడున్నాడేంటి ?"
" నీకుతెలా ఆయన? మొన్ననే ఇండియానుంచి తీసుకొచ్చారట, వేదపండితుడట "
" తెలుసు. నాకు ముందర ఇతనితోనే ఇచ్చి చేద్దామనుకున్నారు మావాళ్ళు హ..హ.. మా ఇంటిపక్కన గుడి అని చెప్పాను కదా.. ఈయన అందులోనే పనిచేసేవారు.
" ఎందుకే నవ్వుతావు.. ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నావే.. ఆయనకేమి తక్కువ? రెండునెలలకోసారి ఇండియాకి సెలవుమీద వెళ్ళొస్తారు. మనం ఇండియాకెళ్ళడం మాట దేవుడెరుగు. నెలకొకసారైనా ఇల్లుదాటి బయటకెళ్ళలేకపోతున్నాం.
మా ఆయనా మీ ఆయనా సంపాదించేదానికన్నా ఎక్కువ ఈయన జీతం. మనమే కాదు, మీ ఆయన బాసు కూడా ఈయనకాళ్ళమీదే పడతాడు చూడు. ఆ పక్కన విల్లా చూడు. అదే ఈయనకి ఇచ్చిన ఫ్యామిలీ ఎకామొడేషన్. మనలా అగ్గిపెట్టిల్లాంటి గదులుకావు "
" అంటే పూజారి అనీ.. "
" నీ ఖర్మ. పురోహితుణ్ణి చేసుకోవాలంటే నువ్వు కావాలంటే చేసుకోలేవు. పెట్టిపుట్టుండాలి. వచ్చిన లక్కుని వద్దనుకొని బాధపడితే ఏమి లాభం? అదిగో..మీ ఆయనా, మా ఆయనా సామాన్లు తీసుకొస్తున్నారు. పద పద మన భర్తల ప్రమోషన్లకోసం, జీతం పెరగడం కోసం, ఉద్యోగాలు పీక్కుండా ఉండాలనీ వెళ్ళి ఆయనకాళ్ళమీదే పడి ఆశీర్వాదాలు తీసుకోవాలి. 

బ్రాహ్మణస్త్రీమూర్తులారా, అర్చకుల్నీ, వారివృత్తినీ చిన్నచూపు చూసి వారితో సంబంధాలను తిరస్కరించేముందు మరోసారి ఆలోచించండి. మీకు మరోజన్మంటూ ఉందో లేదో తెలీదు. ఈజన్మలో అత్యంత పవిత్రమైన, భగవంతుని సేవకుడితో పెళ్ళయ్యే అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దు. డబ్బూ దస్కం, విదేశాల్లో ఉద్యోగం, ఆస్థీ అంతస్థూ ఇవేమీ శాస్వతంకావు. ఉద్యోగాలు ఉండొచ్చు, ఊడొచ్చు. ఉన్నా అదొకరిదగ్గర పనిచేయడమే ఎంత పెద్ద ఉద్యోగమైనా. అర్చకత్వమంటే భగవంతునికే సేవచేయడం. అలాంటి అర్చకునికి భార్యగా సేవలుచేసుకొనే భాగ్యం పుణ్యవతిలకు దేవుడిచ్చే భాగ్యం, భగవత్‌సంకల్పం. స్నేహితురాళ్ళముందు చులకనౌతామనో లేదా చెప్పుకోవడానికి బావుండదనో లేదా ఏహ్యభావంతోనో అలాంటి సంబంధాలు తిరస్కరించొద్దు. ఎందుకంటే అలా వెటకరించేవాళ్ళందరూ పురోహితుని పాదాలను పట్టుకోవాల్సినవాళ్ళే. కనుక పురోహితుని భార్యగా సగర్వంగా తలెత్తుకొని చెప్పుకొనే భాగ్యాన్ని కోల్పోవద్దు.

Written by_ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...