Friday, May 19, 2023

బలిపీఠం

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!!

ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది.

గర్భగుడి, విమానం, విగ్రహం (మూలమూర్తి), బలిపీఠం ఇవి నాలుగూ ఉంటేనే దాన్ని దేవాలయం అంటారు.

కనుక ఆలయంలో బలిపీఠం ప్రముఖమైనది. ఆలయంలోని మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించాక చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు.

గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి.

బలిప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది. ప్రాచీన దేవాలయాలలోని బలిపీఠాలు ఇంత కళాత్మకంగా ఉండవు. మొరటు రాతిస్తంభం వలె ఉండేవి.
శిల్పరత్నం మట్టితో, కొయ్యతో కూడా బలిపీఠాలు నిర్మించవచ్చని చెప్పింది.

విష్ణుతిలక సంహిత, మానసార శిల్పశాస్త్రం గ్రంథాలు గోపురం బయట, లేక మొదటి ప్రాకారానికి బయట బలిపీఠాన్ని నిర్మించాలని చెప్పాయి.

తిరుమల, దారాసురం వంటి ఆలయాలలో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది.గర్భగుడిపై ఉన్న విమానం, గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది.

విమానం ముకుళితపద్మం (ముడుచుకుని ఉన్న తామర) వలె ఉంటే బలిపీఠం వికసితపద్మం (విరిసిన కమలం) వలె ఉంటుంది.

దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే, బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది.

ఆలయపురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది. కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి.

ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు.

ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు.

తిరుమల ఆలయం చుట్టూ వీటిని మనం చూడవచ్చు. శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు.

ఇందులో శివుడు సదా ఉంటాడని, బలిపీఠాన్ని దర్శించినా శివదర్శనం అయినట్లే అని శైవాగమాలు చెబుతున్నాయి.

ముఖమండపం చేరే ముందు భక్తులు బలిపీఠానికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అహంకారాన్ని బలిగా అక్కడ విడిచి బలిపీఠం నుండి వచ్చే దైవీకశక్తిని తనలో నింపుకుని దైవదర్శనానికి వెళ్లాలి.

బలిపీఠానికి ప్రదక్షిణ చేసే వీలు లేకపోయినా తాకి నమస్కరించవచ్చు. బలి వేసిన అన్నం ఆయా దేవతలకు మాత్రమే.

మానవులు దాన్ని భుజించకూడదు.బలిపీఠ దర్శనంతో మానవులలోని సమస్త దుర్గుణాలు తొలగిపోతాయి.
written_by 
G.S.S.S సోమయాజులు శర్మ గారు.

Tuesday, January 24, 2023

రథసప్తమి వైశిష్ఠ్యం పఠించాల్సిన శ్లోకాలు..?

సూర్యుడే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగు తున్నాయి. భౌతిక దృష్టికి గోచరించని సూర్యుని విశిష్టతలను మన ధర్మం గుర్తించి కొనియాడింది. సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. లోకరక్షణ కోసం సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజు రథసప్తమి. ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుని ఆరాధించాలి.


సూర్యనారాయణ మూర్తి, లోకబాంధవుడు, ఆదిత్యుడు, ఆదిదేవుడు అంటూ సూర్యుడిని అనేక పేర్లతో పిలుస్తాం..ఇక హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర నెలల్లో వచ్చే సప్తమి తిథులకన్న మాఘమాసంలో వచ్చే సప్తమి అత్యంత విశిష్టమైంది.


రథసత్పమి అని పిలవడానికి కారణం..? ‘సప్తానాం పూరణీ సప్తమీ’ అంటే ఒకటి నుండి ఏడు వరకూ గల స్థానాలు పూరించేది సప్తమి, సూర్యరథ గమనానికి కారణమైంది కనుక ఈ పండుగకు రథసప్తమి అని పేరుపెట్టారు పెద్దలు. కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది.


ఇక రామ రావణ యుద్ధ సమయంలో అలసిన శ్రీరాముడికి అగస్య మహాముని ఆదిత్య హృదయం ను 30 శ్లోకాలుగా ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఈ శ్లోకాలను పఠించినవారికి శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు దరిచేరవని నమ్మకం. ఆదిత్యుని ఆరాదిస్తే.. తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయని పెద్దల నమ్మకం.


ఇక మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానమని.. అందుకనే ఆరోజు వేకువజామునే స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానం వంటి కార్యాక్రమాలను నిర్వహిస్తే.. సప్త జన్మల పాపాలు నశించి.. ఆయురారోగ్య సంపదలను ఇస్తుందని నమ్మకం. అయితే రథ సప్తమి రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి .. జిల్లేడాకులు, రేగుపండు తలపై పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి “అర్కః” అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.


రథసప్తమి రోజున స్నానం చేసే సమయంలో పఠించవల్సిన శ్లోకాలు : ..


నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!


యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు! తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!


ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్! మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!


ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే! సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!


రథసప్తమి రోజున నిర్వహించాల్సిన పూజా విధానం: గంధంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక – అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని పూజించడం అత్యంత విశిష్టమైనది.


ఇక ఆవు పేడతో చేసిన పిడకలమీద క్షీరాన్నాన్ని వండి సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. అలా క్షిరాన్నాన్ని చెరకు ముక్కతో కలుపుతూ తయారు చేయాలి. అలా వండిన దానిని నైవేద్యంగా సూర్యుడికి చిక్కుడు ఆకులలో వడ్డించి నివేదించాలి.


చిక్కుడు, జిల్లేడు, రేగు ఆకుల్లో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.


ఇక హిందువులు చేసే పూజలు, వ్రతాలు అన్ని శివ కేశవులకొరకే.. ఆ ఇరువురికి ఇష్టమైన మాసం మాఘమాసం. అంతేకాదు రథసప్తమి నుంచి వేసవి కాలం ప్రారంభం అని భావిస్తారు. అందుకనే ఆరోగ్య ప్రదాతగా సూర్యుభగవానుణ్ణి పూజిస్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.


రథ సప్తమి రోజున చదవాల్సిన స్తోత్రాలు:- ఆదిత్యహృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం. ఈ జన్మలో చేసిన .. గత జన్మలో చేసిన.. మనస్సుతో.. మాటతో. శరీరంతో.. తెలిసీ.. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉంది. ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడవడం ఆచారంగా వస్తుంది.


ఇక రథ సప్తమి రోజున సంతాన ప్రాప్తి కోసం, రోగ నివారణ కోసం పెద్దలు ఒక వ్రతాన్ని చూచించారు.


స్నానానంతరం అష్టదల పద్మాన్ని బియ్యం పిండితో వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్ట దళ పద్మ మధ్యలో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రథాన్ని నడుపుతున్న (బంగారు ప్రతిమ) ఓ ప్రతిమని ఏర్పరచాలి. అనంతరం కుంకుమాదులు దీపములతో అలంకరించాలి. ఎర్రని రంగుగల పువ్వులతో సూర్యుడిని పూజించాలి., సంకల్పం చెప్పుకోవాలి. ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికీ సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి అనంతరం ఆ సూర్యుడిని ప్రతిమను గురువునకు దానం ఇవ్వాలి.


ఇలా ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఎలా ఏడాది పటు నియమ నిష్టలతో సూర్యుడిని పూజించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి.




Sunday, November 13, 2022

ప్రాథమిక సూత్రాలు

 




          మీరు ఒకరి గురించి *మంచిగా* చెప్పకపోయినా పర్లేదు కానీ *చెడుగా* మాత్రం చెప్పొద్దు, *పని పాటలలేక* ఏమి తోచక ఎవరో ఒకరి సంతోషం ఆనందం కొసం చేప్పే *మాటలు* ఇంకోకరి *జీవితం*  నాశనం కావటానికి *కారణం* అవుతుంది ఒకసారి మీరే *ఆలోచించండి* .

      నీలో ఉన్న *చికాకులన్నీ* ఎగిరిపోవడానికి నీ *చిన్న చిరునవ్వు* చాలు , నీ *కన్నీళ్ళు* ఆగిపోవటానికి  *చల్లని చూపుచాలు* , నీ *గుండె మంట* చల్లార్చటానికి  *మాట్లాడే తీయని మాట* చాలు , మనం ఉన్నామని *భరోసా* ఇవ్వడానికి మంచి *స్నేహం*  చాలు,  మంచి స్నేహితుడు ఉంటే *ఆత్మీయ బంధం*  ఉన్నట్లే .

       *జీవితం* నీది, *స్వప్నం* నీది,*గమ్యం* నీది, *కష్టం* శ్రమ *గెలుపు ఓటమి* అన్నీ నీవే ,  కింద *పడితే* లేవాల్సింది నువ్వే , *బాధను* దిగమింగుకోవాల్సింది నువ్వే , నీకేమైన *గాయాం* అవుతే ఆ  గాయాన్ని భరించాల్సింది నువ్వే , *దైర్యం* చెప్పుకోవాల్సింది నువ్వే, ఇతరులు కేవలం *చోద్యం* చూస్తారు,వీలైతే *ఎగతాళీ* చేస్తారు నీవు ఎవర్నీ *పట్టించుకోవద్దు* సాగిపో దైర్యంగా *మొరిగే* కుక్కలని పట్టించుకోకుండా.అప్పుడు .*విజయం* నీ ఇంటి *కాపలాదారు* గా మారుతుంది 

రామేశ్వర లింగము

రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము. 

మహాబలసంపన్నుడయిన రావణాసురుని సంహారం అంత తేలికయినది కాదు. పరమ మంగళప్రదుడయిన శంకరుని అనుగ్రహం కావాలి. ఈశ్వరా ! లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే పది తలలతో నా కంటపడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమయి యుద్ధం జరుగుగాక’ అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభు లింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. రామచంద్ర మూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు.

స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా!

పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం!!

ఈశ్వరా! నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడయినా నానుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. నన్ను ఆశీర్వదించాలి. జయమును ఇవ్వాలి. నన్ను అనుగ్రహించమని అనేసరికి శంకరుడు ప్రత్యక్షం అయి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగమనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అన్నాడు. శివుడే శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ – లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ‘నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పకవిమానంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించి ‘సీతా! ఇదిగో సేతువు. అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు’ అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈపాదం ఉన్నది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు.

ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటేముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము. ఈవేళ రామేశ్వరం దీవియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండూ ఒకటేనా? అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్ర మూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగము నొకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగము తయారుచేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ రెండు శివలింగములు ఒకటేనా? ఈవిషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు ‘రామాయణమునందు ధర్మ సూక్ష్మములు’ అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒకమాట చెప్పారు. కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ

‘యావస్సేతుశ్చతావశ్చ కాస్యాంయత్రతిరోహితః’ ‘నేను తిరోహితుడనై ఉంటాను. అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగుచేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగర ఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు. అది రామేశ్వర లింగమే. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవాలని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహుర్తమై హనుమ ప్రతిష్ఠించాలి. ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగుచేస్తే అది శివలింగం అయింది. దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు. రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకు వచ్చిన లింగము. అది కాశీనుండి తేబడింది దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటియందు ఓషధీశక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి.

రామేశ్వరంలో మనం సముద్రస్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమయిన దర్శనం. అక్కడ రైల్వేస్టేషన్లో ఒక గొప్పతనం ఉన్నది. కొత్త ప్లాట్ ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరోచోట పెట్టకుండా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావిచెట్టు క్రింద పెట్టారు. రైల్వేస్టేషనులోనే దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవచ్చు.

written_by

గుట్టి సుబ్రహ్మణ్య శర్మ



Friday, June 7, 2019

నవ మాసాలు – నవ గ్రహాలు

పిండోత్పత్తి ప్రారంభమయిన దగ్గర నుండి శిశు జననం వరకు తల్లి గర్భములో పిండం ప్రతి మాసం మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ మార్పుల ఆధారంగా ప్రతి మాసమునకు ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు.

1 వ మాసం   శుక్ర గ్రహం   ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శుక శోణితాలు ద్రవ రూపంలో ఉంటాయి.

2 వ మాసం కుజ గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శుక్ర శోణితాలు గట్టిపడుతుంటాయి.

3 వ మాసం గురుగ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో జీవం ప్రారంభమవుతుంది. అవయవాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది.

4 వ మాసం రవి గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో ఎముకలు ఏర్పడటం ప్రారంభమవుతుంది.

5 వ మాసం చంద్ర గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో ద్రవ పదార్ధాలు ఏర్పడతాయి. చర్మం ఏర్పడటం ఆరంభమవుతుంది.

6 వ మాసం శని గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు కేసాలు ఏర్పడతాయి.

7 వ మాసంలో బుధ గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు స్పర్శ జ్ఞానం ప్రారంభమవుతుంది.

8 వ మాసంలో తల్లి లగ్నాధిపతి ప్రాదాన్యత వహిస్తూ ఉంటుంది. .

9 వ మాసలో చంద్ర గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు ఆహారం తీసుకోవటం తెలుస్తాయి.

10 వ మాసంలో రవి గ్రహం ప్రాదాన్యత వహిస్తూ ఉంటుంది.

పై గ్రహాలు అవి సూచించు మాసాలలో గర్భంలోని శిశువుపై ప్రభావాన్ని సూచిస్తాయి. గర్భవతిగా స్త్రీకి ఎన్నవ మాసం జరుగుతుందో ఆ మాసాధిపతి ఆ మాసములో గోచారంలో బలహీనపడరాదు. అదే విధంగా ఒక స్త్రీ జాతకంలో ఏదైనా గ్రహం  బలహీనంగా ఉంటే ఆ గ్రహం సూచించు మాసములో గర్భములోని శిశువుకు ఇబ్బందులు ఏర్పడటం లేదా గర్భస్రావం జరగటం లేదా గర్భవతికి గర్భ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడటం జరుగుతాయి.

ఉదా:- గర్భవతి జాతకంలో రవి బలహీనపడిన నాల్గవ నెలలో ఇబ్బందులు కలగటం లేదా ప్రసవ సమయంలో కష్టాలు కలుగుతాయి. ఏ విధంగా స్త్రీ జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉన్నదో మరియు గర్భవతిగా ఉన్నప్పుడూ ఏ మాసం జరుగుతుందో ఆ మాసాధిపతి ఆ మాసంలో గోచారంలో బలంగా ఉన్నాడో లేదో ముందుగానే పరిశీలించి ఆ గ్రహానికి శాంతి ప్రక్రియలు చేయించుకున్న గర్భ రక్షణ జరుగును.

Wednesday, April 10, 2019

శ్రీ రామ రక్షా స్తోత్రం

శ్రీరాముని ఎన్నో రకాలుగా స్తుతిస్తాము. ఈ స్తోత్రాలన్నింటిలో రామరక్షా స్తోత్రానికి ఒక ప్రత్యేక స్థానం కలదు. ఈ రామ రక్షా స్తోత్రాన్ని బుధ కౌశిక ముని రచించారు. ఈ స్తోత్రంలో 38 శ్లోకాలు ఉన్నాయి. శ్రీరాముని మనసారా భక్తి యుక్తులతో ధ్యానించి పూజించేవారు, తమకు రక్షణ నివ్వమని కోరుకునే ఈ స్తోత్రం మనస్ఫూర్తిగా నమ్మి పఠించినవారు, ఆ శ్రీరాముని కృపకు పాత్రులవుతారు.

రామరక్షా స్తోత్ర జపం భక్తి శ్రద్ధలతో చేసిన వారికి పాపాలు నశించడమే గాక, శరణాగతి వేడుకొన్న వారికి శ్రీరామ రక్ష ఎల్లవేళలా వెన్నంటి ఉంటుంది. ఈ స్తోత్రం చేసిన వారికి మానసిక ప్రశాంతత, జీవితంలో సుఖశాంతులు మరియు సంతోషము కలుగుననుటలో ఏమాత్రము సందేహము లేదు.

మానవ జీవితంలోని ఎన్నో సమస్యలను అధిగమించడానికి తగు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించే అత్యంత సులువైన భక్తి మార్గం రామరక్షా స్తోత్రం. ఎవరికైతే సమస్యలను అధిగమించాలనే సంకల్పం కలుగుతుందో, వారు నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో పదకొండు సార్లు ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేయాలి.

నిరుద్యోగులు, శత్రుభయం కలిగినవారు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నవారు, ఏదైనా ఉద్యోగ లేదా వ్యాపార పరమైన సమస్యలలో చిక్కుకుని సతమతమవుతున్నవారు, మానసిక ఒత్తిడులకు గురవుతున్నవారు ఇలా ఒకటేమిటి జీవితంలో ఇబ్బంది పడే ఎటువంటి సమస్యనుండైనా బయటపడాలంటే సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేసి, రాముని శరణు వేడితే తప్పక బయట పడి జీవితము సాఫల్యత వెంపు నడుచుటకు తగు మార్గము కనపడుతుంది.

అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య | బుధకౌశిక ఋషిః | శ్రీసీతారామచంద్రో దేవతా | అనుష్టుప్ ఛందః | సీతా శక్తిః | శ్రీమద్ హనుమాన కీలకమ్ | శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః ||

ధ్యానమ్-
ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థమ్
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ |
వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభమ్
నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్ ||

స్తోత్రం-
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ |
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ || ౧ ||

ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్ |
జానకీలక్ష్మణోపేతం జటామకుటమండితమ్ || ౨ ||

సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకమ్ |
స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతం అజం విభుమ్ || ౩ ||

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || ౪ ||

కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ |
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః || ౫ ||

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః |
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః || ౬ ||

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః || ౭ ||

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ || ౮ ||

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః || ౯ ||

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ || ౧౦ ||

పాతాళభూతలవ్యోమచారిణశ్ఛద్మచారిణః |
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః || ౧౧ ||

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ |
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి || ౧౨ ||

జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితమ్ |
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః || ౧౩ ||

వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ |
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ || ౧౪ ||

ఆదిష్టవాన్యథా స్వప్నే రామరక్షాంమిమాం హరః |
తథా లిఖితవాన్ప్రాతః ప్రభుద్ధో బుధకౌశికః || ౧౫ ||

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ |
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః || ౧౬ ||

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ || ౧౭ ||

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ |
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ || ౧౮ ||

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ |
రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ || ౧౯ ||

ఆత్తసజ్యధనుషావిషుస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ |
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ || ౨౦ ||

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |
గచ్ఛన్మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః || ౨౧ ||

రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ |
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః || ౨౨ ||

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః |
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః || ౨౩ ||

ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః |
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః || ౨౪ ||

రామం దుర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాససమ్ |
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరః || ౨౫ ||

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్ |
కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ |
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిమ్ |
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ || ౨౬ ||

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || ౨౭ ||

శ్రీరామ రామ రఘునందన రామ రామ |
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ |
శ్రీరామ రామ శరణం భవ రామ రామ || ౨౮ ||

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి |
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి |
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే || ౨౯ ||

మాతా రామో మత్పితా రామచంద్రః |
స్వామీ రామో మత్సఖా రామచంద్రః |
సర్వస్వం మే రామచంద్రో దయాళుః |
నాన్యం జానే నైవ జానే న జానే || ౩౦ ||

దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || ౩౧ ||

లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ |
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే || ౩౨ ||

మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే || ౩౩ ||

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్ || ౩౪ ||

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || ౩౫ ||

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ |
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ || ౩౬ ||

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే |
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః |
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహమ్ |
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర || ౩౭ ||

శ్రీ రామ రామేతి రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || ౩౮ ||

ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేకం"

ఉద్యోగం లేని వాళ్ళు,ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు,ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండమునందు మొదటిసర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 11 సార్లు పఠించాలి.

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||

న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||

న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||

నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||

గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||

చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను.

శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో సుఖఃసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు, ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు.

రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద(మరణ)ములు గాని, వాయు భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో వర్థిల్లుచుందురు.

అనేకములైన అశ్వమేథాదిక్రతువులను, సువర్ణ్క యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి, వాసికెక్కును.

రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.

ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును, ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారిపుత్త్రపౌత్త్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...